Sunday, August 30, 2026
E-PAPER
Homeదర్వాజమూడు తరాల జీవనచిత్రం లంద

మూడు తరాల జీవనచిత్రం లంద

- Advertisement -

జీవితంలో నుండే కథలు పుడతాయి. డా.పొన్నాల బాలయ్య రచించిన ‘లంద’నవలలో మూడు తరాల మాదిగల జీవితం ఉంది. సమాజంలో వారు ఎట్లా బతికిండ్రు వారి జీవన విధానం ఏమిటి? అనేది సవివరంగా తెలిపిన నవలఇది.కాలానుగుణంగా తమను తాము మార్చుకోవాలన్న తపన సందేశం ఈ నవల మొత్తంలో కనిపిస్తుంటుంది. లంద అనే పేరుకు అర్థం ఏమిటన్నది నవల చదివితేనే తెలిసింది. జంతు చర్మాన్ని నానబెట్టే గోళాన్ని లంద అంటారు. తోలును మెత్తగా చేయడానికి, శాగవారిన టేకుచెక్కలాంటి రంగు రావడానికి, నీసు వాసన పోవడానికి వెనుక ఎంత పెద్ద ప్రక్రియ దాగుందో, ఎంత శ్రమచేస్తారో తెలుస్తుంది. ఇదొక ప్రయోగశాల. వివిధ వృత్తుల వారికి వినియోగపడే వస్తువులను చేసే ఉత్పత్తి కేంద్రం. తమ కుల ఆస్తిత్వ చిహ్నమైన ‘లంద’ను లోకానికి పరిచయం చేయడం, తమ జాతి సాంస్కృతిక ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాడటం, సామాజిక చైతన్యం, తమ వాస్తవిక జీవనాన్ని ప్రతిబింబించడం తన వంతు బాధ్యతగా రచయిత ఎత్తుకున్నాడు.
ఇక నవలలోని కథ – రామయ్య, బొందయ్య, అజయ్ ముగ్గురు మూడు తరాలకు ప్రతినిధులు. రామయ్య ఏ మార్పు లేకుండా తన జీవితంలో తాను ఒదిగిపోయిండు. సచ్చిన ఎద్దును మోస్తున్నప్పుడు ఎద్దు బరువుకు యాష్టపడి “ఈ మోసుడు పాడుగాను ఎన్ని తంతెలైనా తప్పక పాయెరా!” అని గుణుగుతాడు.

ఎల్లవ్వ “గడియ రికావులేదు గవ్వ కూడేసింది లేదాయే! అన్ని పాత పొక్కలేనాయే! ఈ కట్టం పాడుగాను ఈ బతుకు నాశిడెంగాను” అని బాధతో కుమిలిపోతుంది. కష్టాలు తీరుతాయని కొమరెల్లి జాతరకు పోతే అక్కడ కులమడిగి అంటొద్దు ముట్టొద్దు అని ఆంక్షలు పెడతారు. అక్కడ ఒంటిమీదికి దేవుడొచ్చి, అగ్గిగుండంలోకి దిగిన కొడుకు బొందయ్యను పొట్టుపొట్టుగా సచ్చెట్టు కొడతారు.
బొందయ్య పుట్టుకే కష్టంపుట్టుక .చచ్చిపోయి పుట్టాడని బొందతవ్వి పెట్టగానే ఏడుపు లంకించుకుంటడు. అందుకే బొందయ్య అని పేరు. సాహసవంతుడిగా పనిమంతుడుగా పెద్ద జీతగానిగా ఎదిగిండు. ఇతని జీవితమంతా సంఘర్షణే.కమ్యూనిస్టులను రాత్రుల్లో కలుస్తున్నాడని,సంఘంతో సోపతి ఉందని తెలిసి, దొర మనుషుల్ని పంపిస్తే,వారిని కొట్టి తప్పించుకొని భయంతో బొంబాయికి పారిపోతాడు. భవన నిర్మాణ కార్మికునిగా పని చేస్తూ, అక్కడ అంబేద్కర్ పోరాటాల గురించి విని ఉత్తేజితు డవుతాడు. అంబేద్కర్ లేబర్ సంఘం పెట్టి కూలీల కష్టాలు చూస్తూ, న్యాయం ధర్మం కోసం పనిచేస్తుంటాడు.

అయితే అక్కడ కూడా కష్టాలే పలకరించి, చేదు అనుభవాలతో ఇక బతకలేని పరిస్థితిలో మళ్లీ ఊరికి తిరిగి వస్తాడు. లందగోలం కాడ మాదిగ పిల్లలతో బతుకమ్మలు ఆడిస్తాడు. జ్ఞానం లేకనే మనం ఇట్లా అయ్యామని, మన పిల్లలనన్నా బాగా చదివించుకోవాలని చెప్పే అతను నడీడులోనె మరణించాడు. బొందయ్య భార్య ఈరవ్వ మూడు తరాల కష్టాలను నష్టాలను చూసింది మోసింది. బొందయ్య చిన్న కొడుకు అజయ్ పెద్దవాడై, దళిత ఉద్యమంతో ప్రభావితుడై, తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు. విద్యార్థి నాయకుడిగా జేఏసీని ఏర్పాటు చేసి, తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. బస్వాపూర్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. యూనివర్సిటీలో బిప్ ఫెస్టివల్ నిర్వహించడం అజయ్ సాధించిన విజయాలు. చైతన్యవంతమైన నేటితరం అజయ్ జీవితం కొనసాగుతూ ఉంది ఇదీ కథ. ఈ నవల కేవలం బాధలను కష్టాలను మాత్రమే ఏ కరువు పెట్టలేదు. ప్రకృతి పరిసరాలు, ఆటలుపాటలు, పెండ్లి, చావు, పండుగలు, విందులు, జాతరలు పూజలు ఏది విడిచిపెట్టకుండా రచయిత ఆయా సన్నివేశాలకు తగిన జానపద పాటలను కూడా చేర్చి శిల్పవంతంగా కళ్ళకు కట్టేలా వివరించాడు.

ఈ నవలలో భాష కూడా ప్రత్యేకమైనదే! తెలంగాణ భాష ముఖ్యంగా మాదిగ వాడల జీవద్భాషలో రచన ప్రవాహంలా సాగిపోతుంది. డక్కలి, నుల్కసందయ్యల పుట్టుక గురించిన కథలు ఆసక్తికరంగా ఉన్నాయి. నవలలో మరో ఆకర్షణ అందమైన వర్ణణలు.ఉల్లాకు కొత్తిమీర ఏసి పెట్టిన ఎండుతునకల దప్పడాన్ని రచయిత ఎంతో రుచికరంగా వర్ణించాడు. బొందయ్య పెండ్లి సందడి ఎంత రమ్యంగా ఉందో, బొందయ్య చనిపోయినప్పుడు ఆ ఏడుపులు అంత ఆర్దతగా హృదయాలు ద్రవించేట్టుగా వర్ణించాడు. వాగువర్ణన చూడండి. “మొస మొస మొసపోసుకుంట, నుర్గులు కక్కుంట, నాగుపాము నడివంకలు కొడవలి పిడివంకలతోటి ఆ వొడ్డు ఈ వొడ్డు పట్టుకొని సుడులు తిరుగుకుంట పడమటి దిక్కు వురికురికి పోటెత్తి పారుతుంది మోయ తుమ్మెద వాగు”
ఆయా సందర్భాలలో ఒదిగిపోయిన సామెతలు పదబంధాలు కూడా నవలకు మరింత బలాన్నిచ్చాయి. మచ్చుకు ఒకటి రెండు – గమ్ముండ్లింటికి పోయిన మనిషి మాదిగింటికి పోయిన కుక్క జల్ది రావంటరు/ సన్నాయి లేని పెండ్లి చేయరాదు ఆడపిల్లలేని సావు సావరాదు/ గోసిల పాపము పెట్టుకొని కాశికి పోతేంది!/ పని పాతర పెట్టి ఎటో జాతర పోయినట్టు/ లంద నవల పూర్తిగా మాదిగల జీవితాన్నే తెలుపుతున్నప్పటికీ, అణగారిన వర్గాల సమిష్టి అనుభవాలకు ఇది ప్రతీక. రచయిత తన అనుభవాలతో ఈ నవలను బలమైన స్వచ్ఛమైన ఒక సాంస్కృతిక జీవన కథగా మలిచారు. రచయిత కృషికి అభినందనలు.

గడ్డం సులోచన, 7702891559.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -