పొద్దు తిరుగుడు పువ్వు

ప్రతిరోజూ ఓ పిల్లవాడు పుస్తకాల సంచి భుజాన వేసుకుని పొలాలగుండా బడికి వెళ్ళేవాడు. దారిలో వారి పొలం కూడా ఉంది. ఒక ఎకరాలో పొద్దు తిరుగుడు పూల మొక్కలు, మరో ఎకరాలో మామిడి చెట్లు పెంచేవారు.
ఆ పిల్లవాడికన్నా ముందే వాళ్ల అమ్మ, పొలం దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టేది.
ఆ పిల్లవాడు వెళ్తూ వెళ్తూ అమ్మని పలకరించి వెళ్ళేవాడు.
అమ్మ దగ్గరినుంచి వాడు బయలుదేరే ప్రతిసారీ ”బాబూ… పొద్దు తిరుగుడు పూలమొక్కలను, మామిడి చెట్లను చూస్తూ పో..” అని చెప్పేది.
అదే మాట ప్రతిరోజూ వినీవినీ వాడికి బాగా విసుగొచ్చింది. ”రోజూ చూడటానికి ఏముందమ్మా ఈ పూలను? ఎప్పుడూ సూర్యుడి వైపే చూస్తూ ఉంటాయి. సూర్యుడు తూర్పు దిక్కు తిరిగితే ఆ వైపు, పడమర దిక్కు తిరిగితే పడమటి వైపు తిరుగుతాయి ఆ పూలు. రోజూ చూసేదే కదా. అందులో విశేషమేముంది? మామిడి చెట్లను కూడా కొత్తగా చూసేదేముంది? పూత పూస్తుంది, కాయలు కాస్తుంది. అంతే కదా” అని చెప్పాడు.
అప్పుడు కూడా ఆమె చిన్న నవ్వు నవ్వి ”చూస్తూ ఉండు బాబూ, నీకే తెలుస్తుంది” అని చెప్పింది.
అమ్మకి చాదస్తం ఎక్కువయ్యిందని అనుకున్నాడు. వాటిని తప్పించి మిగిలిన చెట్ల వైపే చూస్తూ బడికి వెళ్ళేవాడు.
వర్షాకాలం వచ్చింది. వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగానే ఆరోజు కూడా బడికి బయలుదేరాడు ఆ పిల్లవాడు. బడికి గొడుగు తీసుకెళ్దామని అనుకున్నాడు కానీ… ‘చాలా రోజులయ్యింది వానలో తడిచి. అమ్మ తిట్టినా ఫర్లేదు. కొద్దిసేపైనా వానలో తడవాల్సిందే…’ అనుకుని గొడుగు తీసుకోకనే బయలుదేరాడు.
ఆరోజు వర్షమైతే రాలేదు కానీ, ఆకాశం మాత్రం బాగా నల్లటి మబ్బులేసుకుని ఉంది.
అమ్మని పలకరించి బడికి బయలుదేరుతూ ఉంటే ఆరోజు కూడా ”పూల తోట, మామిడి తోట చూస్తూ పో బాబూ…” అని ప్రేమగా చెప్పింది.
ఆ పిల్లవాడు పకపకా నవ్వి ”పొద్దు తిరుగుడు పూలు చూడటానికి ఆకాశంలో సూర్యుడే లేడు, అవి ఏ దిక్కు చూడగలవు? మామిడి తోటలో మాత్రం ఏమి విశేష ముంటుంది? వానకి బాగా తడిసి ఉంటాయి. అంతకుమించి ఏమీ ఉండదు…” అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ వాటివైపు చూశాడు.
ఆశ్చర్యం… వారం రోజుల వర్షానికే మామిడి తోటలో కలుపు మొక్కలు దండిగా పెరిగి ఉన్నాయి. పొద్దు తిరుగుడు పూల తోటలో మచ్చుకు ఒక్క కలుపు మొక్క కూడా పెరగలేదు.
ఆశ్చర్యంగా అమ్మవైపు చూశాడు.
”అదే బాబూ నిన్ను చూడమన్నది. పొద్దుతిరుగుడు పూల మొక్కలు తమని తాము రక్షించుకోవడానికి కొన్ని రసాయనాలు విడుదల చేస్తాయి. అందువల్ల వాటి దగ్గర కలుపు మొక్కలు పెరగవు. అదే మామిడి చెట్లకు ఆ గుణం లేదు. అందువల్ల కలుపు మొక్కలు వాటి చుట్టూ విరివిగా పెరుగుతాయి. పురుగూపుట్రా చేరుతాయి. అవి మామిడి చెట్ల అభివృద్ధిని అడ్డుకుంటాయి.
ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏమిటంటే… నీ స్నేహితుల్లో మంచి అలవాట్లు ఉన్న వారూ ఉంటారు. చెడ్డ అలవాట్లు ఉన్నవారూ ఉంటారు. కలుపు మొక్కలని పొద్దు తిరుగుడు పూలు దూరంగా పెట్టినట్లు నువ్వు చెడ్డ స్నేహితుల్ని దూరంగా పెట్టాలి. ఎవరో వస్తారని, సాయం చేస్తారని మనం ఎదురు చూడకూడదు. మంచిచెడ్డలు చెప్పే అమ్మనాన్నలు ఎల్లకాలం ఉండరు. నిన్ను నువ్వు కాపాడుకునే శక్తి సామర్థ్యాలను నీకు నీవే పెంపొందించుకోవాలి” అని హితవు చెప్పింది.
అమ్మ మాటలను ఆసక్తిగా విన్న పిల్లవాడు ”అలాగే” అని చెప్పి పూల వైపే చూస్తూ బడికి బయలుదేరాడు. కొద్దిసేపటికి మబ్బులు పక్కకి వెళ్ళాయి. సూర్యుడు తూరుపు దిక్కున ధగధగా మెరుస్తూ కనిపించాడు. అంతే… సైనికులు ఒక్కసారిగా కవాతు ప్రారంభించినట్లు పూలన్నీ సూర్యుడి వైపు తిరిగాయి.
పిల్లవాడు చిన్నగా నవ్వుకుంటూ బడికి చేరాడు.
– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు
9393662821

Spread the love