బాల సాహిత్యంలోనూ మేటి కవి చెన్నయ్య దోరవేటి

బాల సాహిత్యంలోనూ మేటి కవి చెన్నయ్య దోరవేటిదోరవేటి చెన్నయ్య ఈ పేరు వినగానే పంచెకట్టుకున్న తెలుగు పద్యం గుర్తుకు వస్తుంది. శైవ వచన రచనలు జ్ఞాపకం వస్తాయి. కవి, రచయిత, విమర్శకుడు, వక్త, ముఖ్యంగా మూడున్నర దశాబ్దాలకు పైగా బడిలో పిల్లలకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడే కాక పిల్లల కోసం పాటలు, కథలు రాసిన బాల సాహితీవేత్త దోరవేటి చెన్నయ్య. ‘దోరవేటి’ కలం పేరుతో రచనలు ప్రారంభించిన ఉప్పరి చెన్నయ్య 11 ఫిబ్రవరి, 1961న నేటి వికారాబాద్‌ జిల్లాలోని ధారూరులో పుట్టారు. తల్లితండ్రులు శ్రీమతి ఈశ్వరమ్మ-శ్రీ అడివయ్య. వీరి స్వగ్రామం ధారూరు అసలు పేరు ‘దోరవేటి’, ఆ పేరునే తన కలం పేరుగా పెట్టుకుని రచనలు చేస్తున్నారు దోరవేటి చెన్నయ్య.
ఉద్యోగ జీవితమంత బడి గుడిలో జరిపిన దోరవేటి పాఠాలు బోధిస్తూనే అక్షరాలా యాభై రచనలు చేశారు. ‘పద్యమే ప్రాణము జిహ్వకు పద్యమె నా తెలుగు జాతి ప్రజ్ఞాయశముల్‌, పద్యమె రస నైవేద్యము పద్య కవిత హృద్వికాసపదమగు నేస్తం…’ అంటూ హృద్యంగా పద్యం గురించి రాసుకున్న దోరవేటి ‘అమృతఝరి, జె జూస్కో, నాన్నకు జేజే, సంబంధం, కానుక, పల్లె, చరితార్థులు, ఆచార్య దేవోభవ, మన కవులు, మహా కవులు, ముగిసిన ఒంటరి పోరాటం’ పేర పదకొండు కథా సంపుటాలు, ‘మరో శివాజీ, అసమాన వీరుడు-అనురాగ దేవత, జీవనది, పయనమెచటికోయి, కలల సాకారం, శంఖారావం, నవ భారతం మొదలైన తొమ్మిది నవలు రాశారు. పద్యమే ప్రాణంగా రాసే దోరవేటి ‘సాంబశివ శతకం, నేస్తం శతకం, బసవ పంశతి, విరులబాట శతకం’తో పాటు ‘హృదయ స్పందన, సాయి సంకీర్తనావళి, అంజలి, అంజలి-2, శ్రమదేవోభవ, పద్యారాధన, దోస్తానా పద్య కావ్యం’ వంటి పలు కవిత్వ రచనలు వీరి రచనల్లో ఉన్నాయి. శైవ వచన రచనల్లోనూ దోరవేటిది అందెవేసినచేయి, ‘శరణు బసవ’, ‘ప్రభులింగ విభూతి’, ‘కాశీఖండం’ వంటి రచనలు అచ్చుకాగా ‘శ్రీశైల ప్రభ’లో ‘ఆనంద తరంగిణి’ ధారా వాహికంగా వ్రాస్తున్నారు. కథ, కవిత్వం, వచనాలే కాక ‘నీవు సల్లంగుండాలి’, ‘ప్రకృతి మణిపూసలు’ వచన కవిత్వం, ‘దోరవేటి లేఖలు’ అచ్చయ్యాయి. వేయికి పైగా వ్యాసాలు రాసిన దోరవేటి కృషికి సోహన్‌లాల్‌ బల్దావా ఉత్తమ కథా సాహిత్యం, ఓగేటి పురస్కారం, ‘రస నైవేద్యం’కు ఎస్‌.ఈ.ఆర్‌.టి. వారి ప్రథమ బహుమతి, రమ్య సాహితీ పురస్కారం, నోముల కథా పురస్కారం, బి.ఎన్‌.శాస్త్రి పురస్కారం, మచిలీపట్నం పద్య కవితా పురస్కారంతో పాటు ‘తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం’తో పాటు మరికొన్ని పురస్కారాలు దోరవేటిని వరించాయి.
బాలల కోసం పద్యం, గేయం, కథ, బుర్రకథలు రాసిన దోరవేటి ‘విరులబాట శతకం’ రాశారు. ఇందులో ‘వేగమెక్కువై ఆగమైపోతుంది/ యువతరమ్ము ఇపుడనవరతమ్ము’ అంటూ, ‘శ్రమను జేయకుండ సద్భక్తిజూపిన/ దైవసాయమేమి దక్కదిలను/ చిత్తశుద్ధితోడ చేయాలి సేవలు/ విరులబాట దోరవేటి మాట’ అంటారు. మరో పద్యంలో లోకరీతిని ఎత్తి చూపుతూ ‘మంచి మాటలెన్నొ- మర్యాదలెన్నెన్నో/ చెప్పవచ్చు, అదియు గొప్పగాదు/ ఆచరించి చూపి అద్దమై నిలవాలి/ విరులబాట దోనవేటి మాట’ అంటూ నొక్కి చెబుతారీ ఆదర్శ ఉపాధ్యాయుడు. ఇంకా ‘దుర్ముహూర్తములును, దోషములనుచును/ కాలహరణ చేయనేలనోయి’ అంటూ మూఢనమ్మకాలపై, వరకట్నం వంటి వాటిపై రాసినా పిల్లలకు హత్తుకునేలా ఉంటాయి. వీరు ఇతర ప్రక్రియల్లో చేసిన రచనలు ‘మీ కోసం’ పేరుతో పిల్లల కోసం కథలు, గేయాలు పద్యాలను అచ్చువేశారు. బాలల కోసం ‘పల్లె’, ‘ఊరు ప్రయాణం’, ‘పశ్చాత్తాపం’, ‘వేసవి సెలవుల్లో…’ వంటి చక్కని కథలను రాసిన దోరవేటి వాటిలో బాలల మనస్తత్వాన్ని, సమస్యలను చక్కగా చర్చించారు. అంతేకాకుండా తన బాల్యంలో జరిగిన సంఘటనలను కూడా కథలుగా అక్షరబద్ధం చేయడం విశేషం. బాలల కోసం దోరవేటి రాసిన వాటిలో ‘సీత కష్టాలు’ బుర్ర కథ ఒకటి. యిందులో స్త్రీ అబలకాదని, ఆడపిల్లలను చిన్నచూపు చూడడం సబబు కాదని చెబుతూనే తన చైతన్యంతో గెలిచి నిలిచిన ‘సీత’ కథ యిది. యిది పిల్లలకు నచ్చడమే కాకుండా చక్కని స్ఫూర్తిని కలిగిస్తుంది. యివే కాకుండా పిల్లల కోసం చక్కని గేయాలు రాశారు దోరవేటి. ‘జయహే జయహే జయహే భరతమాత/ జయహే జయహే జయహే భవ్యచరిత’, ‘ఇదే ఇదే నా దేశం – నా మాతృదేశం’ అంటూ దేశభక్తిని ఉద్భోదించే గేయాలతో పాటు ‘పాడరా ఓ భారతవీరా!/ పాడరా కలిమి రేడా/ పాడరా మన వీరపురుషుల వీర వనితల కీర్తిగీతిక/ పాడరా పాడరా పాడరా’ అంటూ చైతన్యపరుస్తారాయన. వీరు రాసిన బాల గేయాల్లో ఎక్కువగా దేశం, వీరులు, ధర్మం, హిమాలయాలు, జాతి, జాతీయతకు సంబంధించినవే కావడం విశేషం. ‘ఏ దిక్కున ఉన్నవో- వానదేవుడా/ మాదిక్కు రావయ్య వానదేవుడా’ అంటూ తెలంగాణ యాసలో రాసిన గేయం వీరి గేయసంపుటిలోని మరో చక్కని గేయం. ‘గురువేరా మన ప్రగతికి మూలం’, ‘నిప్పులే చిమ్ముతాం-నింగికే ఎగురుతాం/ ఉప్పైనై ఉరుకుతాం-గొప్పగా ఎదుగుతాం’ అంటూ చెబుతారు ఇతర గేయాల్లో దోరవేటి. జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love