ఆడబిడ్డ

ఆడబిడ్డఆ ఇంట్లో… రాజయ్య శవం తరలిపోయిననంక వైరాగ్యంతో కూడిన వాతావరణం భయంకరంగా వుంది. నిశ్శబ్దంగా గంభీరంగా వుంది. ఒక్కొక్కరుగా ఆ ఇంట్లోకి వస్తున్నారు.
రాజయ్య ఫొటో పెట్టి దండ వేశారు.
శ్మశానానికి వెళ్లలేని బంధువులు, స్నేహితులు మౌనంగా వచ్చి ఫొటోకి మొక్కి పక్కకి తప్పుకుంటున్నారు. రాజయ్య ఆ వూర్లో మోతుబరి రైతు. ఆయనకి ముగ్గురు కొడుకులు. ఒక కూతురు. అందరు కొడుకులు అదే వూర్లో స్థిరపడ్డా, కూతుర్ని మాత్రం పట్నానికిచ్చాడు. రాజయ్య భార్య కన్నుమూసి ఆరేళ్లవుతుంది. అప్పట్నించి రాజయ్య కొడుకులు, కోడల్ల ఇంట సంవత్సరానికి నాలుగు నెలల చొప్పున వంతుల వారీగా ఉంటున్నడు. వాళ్లు బాగానే చూసుకునే వారు. తను వుంచుకున్న మూడెకరాల పొలం దున్నుతూ, తన భార్య సమాధి దగ్గర పడిపోయాడు. వరి నాట్లేస్తున్న వాళ్లంతా పరిగెత్తుకొచ్చి.. రాజయ్యని ఎడ్లబండిలో వేసుకొని ఆరెంపి డాక్టర్‌ దగ్గరకి తీసికెళ్లారు. అప్పటికే రాజయ్య ప్రాణం పోయింది.
ఆ ఇంట్లో రాజయ్య ఒక్కగానొక్క కూతురు భారతి ఏడ్పు తగ్గించడం ఎవరితరం కావట్లేదు. ముగ్గురన్నయ్యలు, వదినలు, చుట్టాలు ఎందరు ఓదార్చినా, తండ్రి జ్ఞాపకాల్ని తలచుకొంటూ ఏడుస్తోంది. బతికున్నప్పుడు రాజయ్య మంచితనం.. కొడుకులు, మనవల పట్ల ఎవ్వరినీ నొప్పించక చూపిన ప్రేమ, వాత్సల్యం గుర్తొచ్చి అందరి హృదయాలు బరువెక్కి కళ్ల నిండా నీళ్ళు తిరుగుతున్నాయి.
భారతి శోకం పెట్టి అలా ఏడుస్తూనే వుంది. ఆ ఏడ్పులో కూడా.. అందరి గుండెలు గుభిల్లుమనేలా.. ఒక్క మాట అంది.
ముఖ్యంగా.. అక్కడున్న అన్నదమ్ముల్లో, వాళ్ల భార్యలకీ గునపం దించినట్లయింది.
”మా నాన్నా… నువ్వు బతికున్నప్పుడు నాకు చింతకింది పొలం మూడెకరాలు రాసిస్తానన్నవ్‌ గా నాన్నా.. ఇప్పుడు నేను ఎవర్ని అడగాలే నాన్నా.. ఆడబిడ్డ కట్నంగా ఇచ్చేయమని నీ కొడుకులకు చెప్పలే నాన్నా..” అంటూ ఏడ్చింది.
ఆ ఇంట అప్పటివరకూ వున్న వైరాగ్య వాతావరణం కాస్తా ఉద్రిక్తంగా మారింది. పెద్ద కోడలు కనకలక్ష్మి గట్టిగానే నోరు విప్పింది.
”ఏంటి వదినా.. మామయ్య మాకెవరికి చెప్పనిది.. నీకెప్పుడు చెప్పాడు..” అని అడిగింది నిలదీసినట్లుగానే. ఆ మాటతో ఏడ్పు ఆపింది భారతి.
ముగ్గురు అన్నదమ్ములూ మొహాలు చూసుకున్నరు. భారతి ఏడ్పు ఆపి.. వెక్కిల్లు రావటంతో పక్కింటి సుందరమ్మ గ్లాసులో మంచినీళ్లు తెచ్చి భారతికిచ్చింది. భారతి నీళ్ళు తాగి… మళ్లా ఏడ్వటం మొదలెట్టింది.
ఆ ఏడ్పులో ప్రధానమైంది మళ్లీ ఆ మూడెకరాల ప్రస్తావనే రావటంతో.. రాజయ్య పెద్దకొడుకు రాజేందర్‌ కల్పించుకొని అడిగిండు. ”ఏందే చెల్లెమ్మ.. మా పంపకాలప్పుడు.. నాన్న తన సొంతానికి వుంచుకున్న ఆ మూడెకరాలు నీకిస్తానని మాకెప్పుడూ మాట వరసకైనా చెప్పలేదే. అయినా నీకెందుకే.. మీ ఆయన ఏ-వన్‌ కంట్రాక్టరు. నువ్వే కోటేశ్వరురాలివి. మీ కొడుకు అమెరికాలో డాక్టర్‌. కూతురు ఆస్ట్రేలియాలో ఇంజనీరు. నాన్న పేరు మీదున్న ముష్టి మూడెకరాలు నీకిస్తానన్నడా. ఆయన ఇస్తానన్న తీసుకోవడానికి నీకెలా మనసొప్పుతుందే..”
కాసేపటి తర్వాత.. రెండో కొడుకు జలంధర్‌ విసురుగా భారతి దగ్గరికి లేచి వచ్చి.. ”నాన్న చనిపోయి ఒక్క రోజయిన గడవలేదే.. ఆస్థి పంపకాలకి వచ్చినవా.. అయినా నీకేం తక్కువే.. కోట్ల రూపాయలకున్నవ్‌.. ఇంకా మా భూములెందుకు” అన్నాడు.
అప్పటికే.. వూరి జనం అంతా గుమికూడారు.
”భారతికి అందేం బుద్ది..” అన్నారొకరు.
”ఆడబిడ్డ కట్నం ఇయ్యాల్సిందే మరి” అందొకావిడ.
”ముసలోడు భలే లిటిగేషన్‌ పెట్టి చచ్చాడ్రా”
”డబ్బున్నోళ్లకే ఆకలెక్కువుంటాయి”
ఇలా అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
”తండ్రి ఆస్తి మీద కొడుకులెంత అధికారముంటుందో.. కూతుళ్లకు కూడా అంతే హక్కుంటుందని పేపర్లు, టీవీల్లో చెపుతున్నారు కదా”
”అవునవును.. భారతి తప్పేం లేదు..”
అక్కడ సన్నివేశాన్ని.. పంచాయితీలా మార్చి.. తలో రాయి విసరడానికి కొందరు రెడీగా వున్నారు. చిన్న కొడుకు మునీందర్‌.. భారతిని ఏమీ అనలేక మౌనంగానే వున్నాడు.
అతని భార్య లత మాత్రం.. మీ తమ్ముడు వ్యవసాయంలో పత్తి పండించాలని.. అకాల వర్షాలకు పత్తి తడిసిపోయి.. బాగా నష్టపోయి వున్నాడొదినా.. ఆ మూడెకరాలల్లో మాకు వచ్చే ఎకరం మాత్రం అడుగకు. మేం చాలా కష్టాల్లో వున్నం వదినా..” అంది మెల్లిగా భారతి దగ్గరగా వచ్చి కూచుంటూ.
భారతి భర్త నిరంజన్‌ కూడా భారతి ప్రవర్తనకి విస్తుపోయాడు. వాళ్లు మూడెకరాలు ఇచ్చినా.. తమకున్న ఆస్తిలో అదొక లెక్కలోకే రాదు. సముద్రంలో వాన కురిసినంత కూడా కాదు. తనకి చెప్పనైనా చెప్పకుండా.. బావమరుదుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏంటి అనుకున్నడు.
అతడు ఆశ్చర్యంగా భార్యనే చూస్తుండిపోయాడు.
భారతి మళ్లీ ఏడ్పు అందుకుంది.
”నాన్న.. నువ్వు బతికున్నప్పుడే.. రిజిస్టర్‌ చేస్తానన్నావే.. నేనే వద్దన్ననే నాన్నా..”
వూరంతా గుసగుసలు మొదలయ్యాయి.
భారతి డబ్బు మనిషి అనుకున్నారు కొందరు.
”తల్లి చనిపోయినప్పుడు కూడా.. అమ్మ మీది సొమ్ములు ఆడబిడ్డకే చెందుతాయని రచ్చరచ్చ చేసి తీసికెళ్లింది” ఒకావిడ గతాన్ని తవ్వుతోంది.
రాజయ్య పెద్ద కొడుకు సీరియస్‌ అవుదామనుకున్నడు. భార్య దిక్కు చూశాడు.
‘నువ్వేం మాట్లాడకు’ అన్నట్టు సైగ చేసింది.
వాళ్ల కూతురుకి తమకి సంబంధించిన ఒకబ్బాయిని చేసుకోవాలని అనుకుంటున్నరు. ఆ విషయం అప్పుడే గుర్తొచ్చిందామెకి. పెద్దోడు మాట్లాడనిది నాకెందుకు అని జలంధర్‌ కొంచెం వెనక్కి తగ్గాడు. ఇంక తాను ఆర్థికంగా చాలా చితికిపోయానని.. తనేం మాట్లాడినా అంతా తప్పు పడతారనే భావనతో సైలెంటయ్యాడు. భారతి తండ్రి జ్ఞాపకాల్లో తడిసిపోయి ఏడుస్తోంది. మధ్యమధ్యలో మూడెకరాల విషయం మర్చిపోక ఏడుస్తోంటే.. అక్కడికొచ్చిన ఒక ముసలావిడ.. ”ఏందే భారతీ. నీకున్న ఆస్తి ఎవరికున్నదే.. మూడెకరాలంటే.. నీ మొగుడు ఒక్కసారి పెద్దోల్లకు మందు పార్టీ ఇచ్చినంత విలువ కాదాయె. నీ ఏడ్పు నాకైతే నచ్చలేదు..” అంది.
”నాకు మూడెకరాలు ఇవ్వకుంటే నాన్న ఆత్మ శాంతించదే. అమ్మ.. నాన్నకు పెట్టిన పిండాలు కాకులు కూడా ముట్టవే అమ్మా..” అంటూ ఏడుస్తోంది.
ఒక ముసలాయన చెప్పాడు.
”వద్దే భారతీ.. ఆ మూడెకరాల విలువ.. నీ కారు ధరంత కూడా కాదే.. అయినా నువ్విక్కడుండేదానివా.. ఎవుసం చేసే దానివా..?” చుట్ట పీలుస్తూ చెప్పాడు.
నిరంజన్‌కి తన భార్య ఏడ్పు విచిత్రంగా తోచింది. తనకు మూడెకరాలిమ్మని ఏడ్వటం ఆశ్చర్యపోయాడు. ఏనాడు కూడా తన తండ్రి మూడెకరాలు ఇస్తానన్నాడని చెప్పలేదు అనుకున్నాడు.
అంతలోనే ఆమెరికా నించి కొడుకు వీడియో కాల్‌ చేయటంతో బయటికెళ్లాడు.
”మీ అమ్మ తాతయ్య పొలం కోసం ఏడుస్తోందిరా.. నాకైతే ఆశ్చర్యంగా వుంది” అన్నాడు.
కొడుకు కూడా ఆశ్చర్యపోయాడు.
”డాడ్‌.. వాట్‌ ఏ ఫన్నీ.. అమ్మకు మూడెకరాలు ఎందుకు డాడ్‌. నేను అమెరికాలో కొనిస్తాని చెప్పు డాడ్‌.. వూరికే మామయ్యల్ని ఇబ్బంది పెట్టకని చెప్పు. అసలే తాతయ్య పోయిన దుఃఖంలో ఉన్నరు వాళ్లు..” అన్నడు.
”సరే.. జాగర్త.. నేను మళ్లా కాల్‌ చేస్త..” అని ఫోన్‌ కట్‌ చేసి ఇంట్లోకి వచ్చాడు.
అప్పటికే.. సగం మంది ఆడబిడ్డ కట్నం ఇవ్వాల్సిందేనని.. ఇంకొందరు ఇదేం పాపపు బుద్ది.. ఆస్తి లేనోల్లకిచ్చినా అర్థముంటంది కానీ…” అంటూ గుసగుసలాడారు.
పెద్దకొడుకు రాజేందర్‌ భార్య సైగతో.. ఇంట్లోకి వెళ్లి మూడెకరాలు భూమి కాగితాలు తెచ్చి భారతి చేతిలో పెట్టాడు.
ఊరంతా చూస్తుండగా ఇవ్వడం మంచిదని ఇచ్చాడు. రెండో కొడుకు, కోడలు ఆశ్చర్యపోయారు. భారతి ఆ కాగితాల్ని గుండెలకు హత్తుకొని తండ్రి జ్ఞాపకాలతో మరికొంతసేపు ఏడ్చింది.
”ఈ మూడెకరాలు చాలా? మాకు పంచిన పది ఏకరాల్లో ఏమైనా ఇవ్వాలా..” కోపంతో అన్నాడు జలంధర్‌. భారతి శాంతంగా చెప్పింది.
”అన్నా.. కూతురికి ఎంత ఆస్తి వున్నా.. పిడికెడు మట్టి తల్లిగారింటి వాళ్లు ఇస్తే తెగ సంబరపడిపోద్ది. అత్తగారింటివాళ్లు ఎంత ఆస్తిపరులైనా.. ఆవగింజంత బంగారం పుట్టింది వారు ఇస్తే ఆ సంతోషం వేరే అన్నా.. మీరందరూ అనుకోవచ్చు.. మాకున్న ఆస్తి ముందు ఈ మూడెకరాలెంత.. కాని ఈ మూడెకరాలే మావారి ఆస్తికన్నా వంద రెట్లు ఎక్కువ.
ఆడపిల్లకు పుట్టిల్లు మీద ప్రేమ, మమకారం, అన్నదమ్ముల పట్ల అనురాగం, ఆత్మీయత గుర్తు రావాలే తప్ప.. మా ఆస్తిలో ఒక భాగం ఆడబిడ్డకు పోయిందే అన్న భావన రానీయకండిరా.. అత్తారింటికి వెళ్లిపోయాక.. మా అన్నదమ్ములు మమ్మల్నేం పట్టించుకోవట్లేదనే అభిప్రాయం రానీయకండిరా..
ఎంత కోటిశ్వరుల ఇంటికి అమ్మాయినిచ్చినా.. పుట్టింటి గడపే గుర్తుకొస్తుందిరా.. ఈ ఆడబిడ్డ కట్నమనేది.. మాకూ.. మన కుటుంబానికి కొండగుర్తులా వుండాలనే తప్ప మీ మనసు నొప్పియ్యాలని నాకు లేదురా.. ఆడబిడ్డ పుట్టింటిని మర్చిపోతే.. అనర్థం.. అన్నదమ్ములకు అరిష్ఠం రా….
ఆడపిల్ల గుర్తుతెలియని పరాయివాడితో వెళ్లిపోతుందంటే.. ఇరవయ్యేళ్ల ఆ ఇంటి వ్యక్తుల్ని.. వస్తువుల్ని.. నవ్వుల్ని, పువ్వుల్ని, పండగల్ని, పరిసరాల్ని మరిచి వెళ్లటమంటే ఎంత గుండె నిబ్బరం వుండాలిరా.. ఆ నిబ్బరానికి నిదర్శనం ఈ ఆడబిడ్డ కట్నం. తల్లిగారింటి వైపు తన చూపు వుండాలనే కదరా ఈ ఆడబిడ్డ కట్నం. ఏ కోడలైనా.. ఒకింటి ఆడబిడ్డే..
ఆ బాధని ఎంత గుండెల్లో దాచుకున్న దాగనిది.
అందుకే.. భూమి పంపకాలప్పుడు.. ఇల్లు పంపకాలప్పుడు ఆడబిడ్డలు గుప్పెడు మట్టిని ఆశిస్తారు. నాన్నగారు చనిపోయే ముందు రోజు నాతో ఒక మాటన్నారు.
”భారతీ… నా ముగ్గురు కొడుకుల్లో చిన్నవాడు అమాయకుడే. మిగితా ఇద్దరితో సమానంగా పంచిచ్చిన.. వాడి భూమి కొంత కెనాల్‌ కోసం పోతే.. మరికొంత భూమి హైవేలో పోయింది. ఇంకో నాలుగెకరాల భూమిలో పత్తిపంట కాసి నష్టపోయాడు. నా దగ్గరుంచుకొన్న మూడెకరాలు వాడికివ్వాలని వుంది. కానీ, మిగితా ఇద్దరు నాతో గొడవ పెట్టుకుంటారనే భయంతో వున్నాను. ఎలాగైనా వాడి కుటుంబానికి నువ్వే ఆసరాగా వుండాలని చెప్పాడు. నాన్న చివరి కోరిక రా అది. కాలికి ముల్లు గుచ్చుకుంటే కంట్లోంచే కదా నీళ్లచ్చేది. ఆడబిడ్డల గుణమేరా ఇది. చిన్నన్న కాపురం నిలబడాలంటే.. ఈ భూమి కాగితాలు వాడికిద్దాం రా.. అంది భారతి. చిన్నకొడుకుతో పాటు.. అక్కడున్న వాళ్లందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
భారతి భర్త నిరంజన్‌ మాత్రం ‘వెల్డన్‌ డార్లింగ్‌’ అంటూ చప్పట్లు కొట్టాడు.
– కె.వి. నరేందర్‌,
94404 02871

Spread the love