Sunday, September 13, 2026
E-PAPER
Homeదర్వాజనీటి పిడుగు - ఒక నెత్తుటి చరిత్ర

నీటి పిడుగు – ఒక నెత్తుటి చరిత్ర

- Advertisement -

పర్వతాల నుదుటిపై
మంచు కాదు
ఒక నల్లని హెచ్చరిక పేరుకుంది.
ఆకాశపు నరాలు తెగిపోయాయా?
హిమాలయాల గుండెలో
ప్రళయ శంఖం పగిలిందా?
నీరు కాదు అది
పర్వతాల మీద నుంచి దూసుకొచ్చిన
నీటి పిడుగు!
నిన్నటి వరకు నవ్విన ఇళ్లు
ఈరోజు అలల సమాధులయ్యాయి.
వీధులు దారులు కావు
మరణం పరుగెత్తిన మార్గాలయ్యాయి.
ఒక తల్లి పిలుపు
అలల గర్జనలో కలిసిపోయింది
ఒక చిన్నారి బొమ్మ
జ్ఞాపకంగా కొట్టుకుపోయింది.
వేలాది ప్రాణాలు
నీటి అక్షరాల్లో
మరణ వాక్యాలయ్యాయి.
ఇది వరద కాదు
భూమి గుండెల్లో పేలిన నీటి బాంబు!
ఎత్తైన భవనాలు
అలల ముందు ఆటబొమ్మలయ్యాయి
మనిషి బలం
ప్రకృతి ముందు భ్రమగా మిగిలింది.
నేపాల్!
నీ పర్వతాల కన్నీళ్లు
ఒక నెత్తుటి చరిత్రను రాశాయి.
కొండల నుంచి దిగింది నీరు
కానీ తీసుకెళ్లింది
జీవితాలను, కలలను, జ్ఞాపకాలను.
ప్రతి అలకూ ఒక పేరు ఉంది
ఆహుతైన మనిషి పేరు.
ప్రతి నిశ్శబ్దం వెనుక
ఒక కుటుంబం యొక్క అరుపు ఉంది.
ప్రకృతి శత్రువు కాదు
మన నిర్లక్ష్యానికి అద్దం!
నేపాల్ ప్రళయం
ఒక విపత్తు మాత్రమే కాదు
నీటితో రాసిన
మానవాళికి చివరి హెచ్చరిక!
డా॥ కొరుప్రోలు హరనాథ్, ‪97035 42598

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -