మేలో 5.5 శాతంగా నమోదు
11 నెలల గరిష్టానికి చేరిక
కేంద్ర ప్రభుత్వ గణాంకాలు
మోడీ పాలనలో యువతకు నిరుద్యోగ సమస్య
న్యూఢిల్లీ : మోడీ పాలనలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది. ఈ ఏడాది మేలో ఇది 11 నెలల గరిష్టానికి చేరి.. ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య తీవ్రతను ఇది తెలియజేస్తోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ఇటీవల పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) నెలవారీ బులెటిన్‌ను విడుదల చేసింది. ఈ పీఎల్‌ఎఫ్‌ఎస్ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది మేలో భారత నిరుద్యోగ రేటు 5.5 శాతానికి చేరుకుంది. ఇది గత 11 నెలల్లో అత్యధిక స్థాయి కావడం ఆందోళనకరం. ఏప్రిల్‌లో ఈ రేటు 5.2 శాతంగా ఉండగా.. ఒక్క నెలలోనే 0.3 శాతం పాయింట్లు పెరగడం గమనార్హం.
ఏప్రిల్‌తో పోలిస్తే పెరిగిన నిరుద్యోగం
భారత్‌లో ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే.. మేలో నిరుద్యోగం పెరిగింది. ఈ పరిస్థితి దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సమస్యలను లేవనెత్తుతోంది. కేంద్రంలోని మోడీ సర్కారు వైఫల్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా మారిందని విశ్లేషకులు చెప్తున్నారు. నిరుద్యోగం మాత్రమే కాదు.. ఉద్యోగాలు చేస్తున్నవారి నిష్పత్తి కూడా తగ్గింది. వర్కర్ పాపులేషన్ రేషియో (డబ్య్లూపీఆర్) ఏప్రిల్‌లో 52.2 శాతంగా ఉండగా.. అది మేలో 51.4 శాతానికి పడిపోయింది. ఇది కూడా 11 నెలల కనిష్ట స్థాయిగా నమోదైంది. అంటే దేశంలో పని చేస్తున్నవారి వాటా తగ్గిందని అర్థం. ప్రతి వెయ్యి మందిలో ఎంత మంది ఉద్యోగాల్లో ఉన్నారో చూపించేదే వర్కర్ పాపులేషన్ రేషియో.
ఉపాధి అవకాశాలు క్షీణించాయి : ఎన్‌ఎస్‌ఓ
ఇక దేశంలో ఉద్యోగం చేస్తున్నవారు లేదా ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య కూడా తగ్గింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (ఎల్‌ఎఫ్‌పీఆర్) ఏప్రిల్‌లో 55 శాతంగా ఉంటే.. అది మేలో 54.4 శాతానికి తగ్గింది. ఇది కూడా 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది కూడా మరో ఆందోళనకరమైన విషయాన్ని సూచిస్తోంది. కొంతమంది ఉద్యోగం దొరకకపోవడంతో ఉద్యోగాల కోసం ప్రయత్నించడం కూడా మానేస్తున్నారనే సంకేతంగా దీనిని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఈ గణాంకాలపై ఎన్‌ఎస్‌ఓ కీలక వ్యాఖ్య చేసింది. ‘‘లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్కర్ పాపులేషన్ రేషియో రెండూ తగ్గడం, అదే సమయంలో నిరుద్యోగ రేటు పెరగడం వల్ల మార్కెట్ పరిస్థితులు బలహీనపడుతున్నట్టు కనిపిస్తోంది. ఉద్యోగాల్లో ఉన్నవారి సంఖ్య తగ్గడం, ఉపాధి అవకాశాలు మరింత వేగంగా క్షీణించడంతో నిరుద్యోగుల వాటా పెరిగింది’’ అని పేర్కొనడం గమనార్హం. ఇక మేలో ఆర్థిక కార్యకలాపాలు మందగించడం కూడా దీనికి ఒక కారణం అయ్యుండొచ్చని వివరించింది.
యువతలో నిరుద్యోగం మరింత ఆందోళనకరం
ఇప్పటికే పీఎల్ఎఫ్‌ఎస్ గత త్రైమాసిక గణాంకాలు యువతలో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉందని చూపించాయి. 15-29 ఏండ్ల వయస్సు గల యువతో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగం 14.3 శాతంగా ఉంది. అది జనవరి-మార్చి త్రైమాసికానికి 15 శాతానికి ఎగబాకింది. అంటే యువతలో ఉద్యోగ సంక్షోభం మరింత తీవ్రమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
పురుషులు, మహిళలు.. ఇద్దరిలోనూ పెరిగిన నిరుద్యోగం
మేలో పురుషులు, మహిళలు.. ఇద్దరిలోనూ నిరుద్యోగం పెరిగింది. పురుషుల్లో నిరుద్యోగం ఏప్రిల్‌లో 5.1 శాతంగా ఉంటే.. మేలో అది 5.4 శాతానికి పెరిగింది. ఇక మహిళల్లో ఏప్రిల్‌లో నిరుద్యోగం 5.4 శాతంగా ఉంటే.. మేలో అది 5.6 శాతానికి ఎగబాకింది. అంటే ఉపాధి క్షీణత ప్రభావం అన్ని వర్గాలపై పడుతున్నట్టు గణాంకాలు సూచించటం గమనార్హం. సాక్షాత్తూ ప్రభుత్వ విభాగం వెల్లడించిన గణాంకాలు మోడీ సర్కారుకు ఇబ్బందికరంగా మారనున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచంలోనే బలవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తోందని చెప్పుకునే కేంద్రం… దేశ యువతకు మాత్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతోందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.



