డెహ్రాడూన్‌లో ఉరి వేసుకుని..
ఐ లవ్ యూ పాపా
నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్
డెహ్రాడూన్ : దేశంలో నీట్ అభ్యర్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఒత్తిడి, మానసిక క్షోభతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మరొక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు.24 ఏండ్ల రియా కుమారి అనే మహిళా అభ్యర్థి మంగళవారం ఉదయం పటేల్ నగర్‌లోని తమ నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందారు. నీట్ పరీక్ష ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను డెహ్రాడూన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “ఐ లవ్ యూ, పాపా; నన్ను క్షమించండి. ఇది ఎవరి తప్పు వల్ల కాదు; ఇది నా అసమర్థత వల్లే జరిగింది’’ అని కూడా ఆ లేఖలో ఉన్నట్లు సదర్ సర్కిల్ ఆఫీసర్ అంకిత్ కండారీ మీడియాకు తెలిపారు. ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నందుకు తల్లిదండ్రులను క్షమాపణలు కూడా కోరారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 21న జరగనున్న నీట్ రీ-టెస్ట్ (పునఃపరీక్ష) కోసం రియా కుమారి సన్నద్ధమవుతోంది. ఈ పరీక్షకు సిద్ధమవుతూనే డెహ్రాడూన్‌లోని ఒక కళాశాలలో చదువుతోంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. అయితే మంగళవారం ఉదయం రియా కుమారి గది లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని ఆమె తల్లి గమనించారు. తక్షణమే ఆమె తన భర్తకు సమాచారం అందించి, బలవంతంగా తలుపు తెరిచారు. కుమారి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఈ విషయంపై సమాచారం అందడంతో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కుటుంబం పోస్ట్‌మార్టంకు నిరాకరించడంతో మంగళవారమే రియాకుమారి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. “ఆమెపై ఒత్తిడి ఉందని, దానివల్ల ఆమె తీవ్ర మనోవేదనకు గురైందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది” అని అంకిత్ కండారీ తెలిపారు.
మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



