Thursday, June 18, 2026
E-PAPER
Homeఆటలుగిల్‌, కిషన్‌ శతకోత్సవం

గిల్‌, కిషన్‌ శతకోత్సవం

- Advertisement -

అఫ్గాన్‌పై 170 పరుగులతో ఘన విజయం
2-0తో వన్డే సిరీస్‌ టీమ్‌ ఇండియా వశం
భారత్‌ 402/10, అఫ్గనిస్తాన్‌ 232/10

అఫ్గాన్‌పై భారత్‌ పంజా విసిరింది. కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌ (154), ఇషాన్‌ కిషన్‌ (125) ధనాధన్‌ సెంచరీలతో చెలరేగారు. మిశ్రమ మట్టి పిచ్‌పై దంచికొట్టిన భారత్‌ 402 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ పేపర్‌ గుర్నూర్‌ బరార్‌ (3/60), అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/45) నిప్పులు చెరిగే ప్రదర్శనతో ఛేదనలో అఫ్గనిస్తాన్‌ 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. 170 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. మరో వన్డే ఉండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

నవతెలంగాణ-లక్నో
అఫ్గనిస్తాన్‌పై రెండో వన్డేలో ఆతిథ్య భారత్ ఘన విజయం సాధించింది. బ్యాట్‌తో, బంతితో అఫ్గాన్‌పై ఎదురులేని ప్రదర్శన కనబరిచిన టీమ్‌ ఇండియా 170 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ (154, 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా రెండో సెంచరీ సాధించగా, ఇషాన్‌ కిషన్‌ (125, 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకంతో గర్జించాడు. టాప్‌ ఆర్డర్‌లో ఈ ఇద్దరు సెంచరీలకు తోడు రోహిత్‌ శర్మ (48, 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో భారత్‌ తొలుత భారీ స్కోరు చేసింది. 49.5 ఓవర్లలో 10 వికెట్లకు 402 పరుగులు చేసింది. ఛేదనలో అఫ్గనిస్తాన్‌ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/45), గుర్నూర్‌ బరార్‌ (3/60) మూడేసి వికెట్లు పడగొట్టి అఫ్గనిస్తాన్‌ను కుప్పకూల్చారు. అఫ్గాన్‌ బ్యాటర్లలో రెహమత్‌ షా (79, 89 బంతుల్లో 8 ఫోర్లు), సెదిఖుల్లా అటల్‌ (42, 50 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రెహ్మనుల్లా గుర్బాజ్‌ (41, 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్‌ గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. భారత్‌, అఫ్గనిస్తాన్‌ నామమాత్రపు ఆఖరు వన్డే శనివారం చెన్నైలో జరుగనుంది.

శతక గర్జన
యశస్వి జైస్వాల్‌ (4) మరోసారి నిరాశపరిచినా.. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (48) ఆకట్టుకున్నాడు. రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో రోహిత్‌ మెరిశాడు. శుభ్‌మన్‌ గిల్‌ (154)తో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. ధర్మశాల వన్డే ఫామ్‌ను లక్నోలో కొనసాగించిన శుభ్‌మన్‌ గిల్‌ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఇషాన్‌ కిషన్‌ సహజశైలికి భిన్నంగా నిదానంగా మొదలెట్టాడు. రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 52 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. అఫ్గాన్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న గిల్‌, కిషన్‌లు మూడో వికెట్‌కు 141 బంతుల్లో 224 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ తర్వాత టాప్‌ గేర్‌లోకి వచ్చిన కిషన్‌ 71 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయగా.. శుభ్‌మన్‌ గిల్‌ 77 బంతుల్లో వరుసగా రెండో శతకం అందుకున్నాడు. ఈ ఇద్దరు శతక గర్జన చేయటంతో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగింది. కిషన్‌ అవుటైనా.. గిల్‌ 150 మార్క్‌ను అందుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (26), వాషింగ్టన్‌ సుందర్‌ (19), కెఎల్‌ రాహుల్ (0) ఆఖర్లో ఆశించిన ప్రదర్శన చేయలేదు. డెత్‌ ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయిన భారత్‌ 49.5 ఓవర్లలోనే కుప్పకూలినా.. 402 పరుగుల భారీ స్కోరు చేసింది. అఫ్గాన్‌ బౌలర్లలో ఖరెటె (4/76), రషీద్‌ఖాన్‌ (3/48) రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -