కూలిరేట్ల పెంపు, భూపంపిణీ, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు
ఆర్థిక, సామాజిక అంతరాలపై పోరాట కార్యాచరణ రూపొందిస్తాం : నవతెలంగాణ ఇంటర్వ్యూలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ సంపన్నుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, కూలి రేట్లు పెంపు, ఉపాధి హామీ పరిరక్షణ కోసం గ్రామీణ పేదలను, వ్యవసాయ కార్మికులను, ఇతర కూలీలను ఐక్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు తెలిపారు. రానున్న కాలంలో చేపట్టనున్న పోరాటాలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం తమ సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల 20.21,22 తేదీల్లో మహబూబ్‌నగర్‌లోని కామ్రేడ్ అచ్యుతానందన్, కామ్రేడ్ సునీత్చోప్రా నగర్‌లోని లక్ష్మిదేవమ్మ ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర మహాసభల నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…
20న ప్రదర్శన, బహిరంగ సభ
ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్‌నగర్‌లోని మున్సిపల్ టౌన్‌హాల్ నుంచి భారీ ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఎంబీసీ గ్రౌండ్లో వేలాది మందితో బహిరంగ సభ జరుగనున్నది. బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎ.విజయరాఘవన్, ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సహాయ కార్యదర్శి, ఎంపీ శివదాసన్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షలు జి.నాగయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, తదితరులు హాజరుకానున్నారు. మహాసభకు వ్యవసాయ కార్మిక సంఘానికి చెందిన కేరళ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్, తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి అమృతలింగం, కర్నాటక కార్యదర్శి పుట్టా మధు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి లోకనాథం ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారని చెప్పారు. బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా నుంచి వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. బహిరంగ సభ అనంతరం మొదటిరోజు సాయంత్రం 600 మంది ప్రతినిధులు, పరిశీలకులతో ప్రారంభమయ్యే మహాసభలో కార్యదర్శి నివేదిక ప్రవేశపెడతారు. మహాసభలో సీఐటీయూ, గిరిజన, ఆదివాసీ గిరిజన, కేవీపీఎస్, రైతు, తదితర ప్రజాసంఘాలు, వ్యవసాయ కార్మికుల సంఘాల నాయకులు సౌహార్ధ సందేశాలు ఇస్తారు.
వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలపైనే ప్రధాన చర్చ
మహాసభలో 22 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం. ఆరు గ్యారంటీల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఏమైంది? ఇండిరమ్మ ఇండ్లను ఎందుకు ఇవ్వడం లేదు? కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల మేరకు పేదలకు భూ పంపిణీ చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షల హెక్టార్ల మిగులు భూమి ఉంది. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి సర్వే చేయాలి. రాష్ట్రంలో భూములు లేని 42 లక్షల మందికి వాటిని పంచాలి. పోడు భూములకు హక్కు పత్రాల ఇచ్చే విషయంలో తాత్సార్యం సరిగాదు. ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికులు, పేదలకు ప్రభుత్వ ఫలాలు అందేలా ఉద్యమ కార్యాచరణను మహాసభలో రూపొందిస్తాం.
గ్రామీణ పేదలను సంఘటితం చేస్తాం
గ్రామీణ సంపన్న వర్గ దోపిడీకి వ్యతిరేకంగా గ్రామీణ పేదలను, కార్మికులను, వలస కూలీలు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయేతర కార్మిక వర్గాన్ని సమీకృతం చేయడమే లక్ష్యంగా మహాసభ డైరెక్షన్ చేయబోతున్నది. మా సంఘం పేరును తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మికుల సంఘంగా పేరు మార్చబోతున్నాం.
ఆగస్ట్ 10న జైల్ భరో
వీబీజీగ్రామ్జీ యాక్ట్, నాలుగు లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు, విత్తనబిల్లు, ఆహారభద్రత చట్టాన్ని బలహీనపర్చడం వంటి కేంద్రం నిర్ణయాల ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానే గ్రామీణ వ్యవసాయ కూలీలు, కార్మికులపై ప్రభావం పడనున్నది. ఉత్పత్తిలో భాగస్వామ్యంగా ఉన్న పేదలపై డైరెక్టుగా కేంద్రం అటాక్ చేస్తున్నది. కార్పొరేట్లకు, కాంట్రాక్టర్లకు, సంపన్నవర్గాలకు ఆ నిర్ణయాలు ఉపయోగపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాల విధానాలతో ఆర్థిక అసమానతలు హెచ్చుస్థాయికి చేరుతున్నాయి. రానున్నకాలంలో అవి మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం పొంచి ఉంది. విద్య, వైద్య అవకాశాలను కూడా పేదలు పొందలేకపోతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేవు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు లేవు. సామాజిక అణచివేతలు పెరుగుతున్నవి. ఇలాంటి తరుణంలో దళితులు, గిరిజనులు, బహుజనులు, మహిళలు, సన్నచిన్నకారు రైతులు , కౌలు రైతులను ఆర్గనైజ్ చేసి ఆర్థిక అంతరాలకు, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నాం. మహాసభల అనంతరం రెండు నెలల పాటు చలో దళిత, గిరిజన వాడల కార్యక్రమం చేపట్టబోతున్నాం. వాటి అనుభవాల ద్వారా ఉద్యమాలు చేపడతాం. రాష్ట్రంలో ఆగస్టు 10న జైలు భరోభరో కార్యక్రమాన్ని 300 మండలాల్లో నిర్వహించబోతున్నాం.
ఉపాధి నుంచి కూలీలను దూరం చేసే కుట్ర
తెలంగాణలకు 21 కోట్ల పనిదినాలు అవసరం. కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టి కూర్చున్నది. వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు పని బంద్ చేయాలని కేంద్రం నిబంధన తెచ్చింది. రెండు పూటల ఫొటో విధానం తీసుకురావడం దారుణం. బడ్జెట్లో నిధులకు కోతపెడుతున్నది. పదేండ్లుగా చూస్తేగా సమ్మర్లో 40, 50 లక్షల మంది ఉపాధిపనికి కూలీలు వెళ్లేవాళ్లు. ఈసారి 16 నుంచి18 లక్షల మందే పని పొందారు. కనీసం వంద రోజుల పని కూడా గ్యారెంటీ లేకుండా పోయింది. తెలంగాణకు కేంద్రం నుంచి రూ.5 వేల కోట్లు రావాల్సి ఉంది. కోటాను కూడా సరిగా పంపిణీ చేయడం లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతూ కూలీలే పనికి దూరమయ్యేలా కుట్ర చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు 150 రోజుల పని, రూ.400 వేతనం, పట్టణ ప్రాంతాలకు విస్తరణ హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించింది.
అభివృద్ధికి కేంద్రీకృతం చేయొద్దు
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని రాష్ట్ర సర్కారు చెబుతున్నది. ఈ సంపద పేద వర్గాలకు చెందుతుందా? ఇది ప్రశ్నార్థకమే. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల చుట్టే అభివృద్ధి జరుగుతున్నది. గ్రామీణ జిల్లాల్లో అభివృద్ధి జరగట్లేదు. గ్రామీణ కార్మిక వర్గం సంపదకు దూరంగా ఉంటున్నది. అసమానమైన అభివృద్ధి ప్రజలకు క్షేమకరం కాదు. పేద, కష్టజీవులకు ఆర్థిక స్వావలంబన ఉండదు. వ్యవసాయ కూలీల్లో పురుషులకు రూ.400, మహిళలకు రూ.338 గా ఉంది. అది కూడా ఎక్కడ అమలు కావడంలేదు. ఈ వేతనాలతో పేదలు ఆర్థిక స్వావలంబన ఎలా సాధ్యం? వేతన సమస్యపై మహాసభలో చర్చిస్తాం. 2014లో వ్యవసాయ కూలీల వేతన సవరణ జరుగలేదు. కూలి, భూమి పోరాటాలు, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం వ్యవసాయేత కూలీలను, గ్రామీణ కార్మికులను సంఘటితం చేసి పోరాటాలు చేస్తాం.



