మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్, జనగణనతో ముడిపెట్టిన కేంద్రం
వాటితో సంబంధం లేకుండా ఆ చట్టాన్ని అమలు చేయాలి
పార్లమెంటు సమావేశాల రెండోరోజు ఢిల్లీలో ధర్నా
అదే రోజు అన్ని రాష్ట్రాల్లో లోక్‌భవన్ల ముందు ఆందోళన
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి
నగదు బదిలీ వద్దు .. పీడీఎస్‌ను పటిష్టం చేయాలి
మహిళలపై దాడులనుఆపాలి:
ఐద్వా జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ
పీకే శ్రీమతి, కనినికా ఘోష్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా వ్యతిరేకి అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పికె శ్రీమతి, కనినికా ఘోష్ విమర్శించారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. అందుకే మహిళా రిజర్వేషన్ల బిల్లుతో డీలిమిటేషన్, జనగణన అంశాలతో ముడిపెట్టిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలును జనగణన, డీలిమిటేషన్ పేరుతో నిరవధికంగా వాయిదా వేయాలని చూస్తోందన్నారు. ఇది మహిళలను మోసం చేయడమే అవుతుంన్నారు. డీలిమిటేషన్, జనగణనతో సంబంధం లేకుండా 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 17 నుంచి 19 వరకు ఢిల్లీలో జరుగుతున్న సీఈసీ సమావేశంలో రెండు ముఖ్యమైన తీర్మానాలు చేశామని చెప్పారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపైనా పడిందనీ, ముఖ్యంగా రవాణా రంగంపై ఎక్కువగా ఉంని అన్నారు. దీంతో నిత్యావసరాల సరుకుల ధరలు కూడా పెరిగాయని చెప్పారు.
మహిళల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నామని బీజేపీ చెప్పడం పెద్ద అబద్ధమని అన్నారు. ఎన్నికలప్పుడు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను కేంద్రం కొనసాగించే అవకాశం లేదన్నారు. నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నదని చెప్పారు. రేషన్ దుకాణాల్లో 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కావాల్సింది నగదు బదిలీ కాదనీ, పీడీఎస్‌ను బలోపేతం చేయాలని కోరారు. మహిళలు, అమ్మాయిలపై హింస, దాడులు, లైంగిక దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీ మహిళలపై మరింత ఎక్కువవుతున్నాయని చెప్పారు. దాడులకు గురైన బాధితుల్లో హిందువులు, ముస్లింలు అన్న తేడా లేదన్నారు. జీడీపీలో మహిళల పాత్ర కీలకంగా ఉందన్నారు. మహిళలపై దాడులు, హింసను ఆపాలనీ, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలకు హక్కులు ఇవ్వాలనీ, హామీలు కాదని అన్నారు. విపక్షాల మద్దతుతో లోక్‌సభలో ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియమ్ – 2023 ను వెంటనే అమలు చేయాలని సూచించారు. ఆ చట్టంలో ఉన్న 334A(1) నిబంధనను తొలగించాలన్నారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ అమలును జనగణన, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టారని అన్నారు.
ఇది మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా ఆలస్యం చేసే విధానమని చెప్పారు. 2010లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ఆ సమయంలో బృందాకరత్ రాజ్యసభలో ఉండి ఈ పోరాటంలో భాగమయ్యారని అన్నారు. కానీ అప్పట్లో లోక్‌సభలో అది ఆమోదం పొందలేదని చెప్పారు. 2023లో మళ్లీ బిల్లు తీసుకొచ్చారనీ, ఎన్నో ఏండ్లుగా మహిళా సంఘాలు, ప్రజా ఉద్యమాలు చేసిన పోరాటాల ఫలితమే ఈ బిల్లు అని అభివర్ణించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రెండురోజు ఢిల్లీలో పార్లమెంటు ముందు అన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని అన్నారు. అదేరోజు అన్ని రాష్ట్రాల్లోని లోక్‌భవన్‌ల ముందు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని చెప్పారు. ప్రధాని మోడీకి మహిళలు మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేస్తారని అన్నారు.
అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో 2/3వ వంతు బలం లేకున్నా అప్రజాస్వామికంగా డీలిమిటేషన్, జనగణనతో కలిపి మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని చూస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే టీఎంసీ, శివసేనకు చెందిన కొందరు ఎంపీలు బీజేపీకి మద్దతిస్తున్నారనీ, మరికొన్ని ప్రాంతీయ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా మద్దతిచ్చే అవకాశం ఉందని అన్నారు. ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయాలనుకోవడం సరైంది కాదన్నారు. 2021లో జరగాల్సిన జనగణన ఇంకా ఎందుకు జరగలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో ప్రధాని, మంత్రివర్గం ఉందా?అని అడిగారు. మహిళల భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీ ఎజెండాను అమలు చేయాలని చూస్తున్నదని విమర్శించారు. 2011 నుంచి 2026 వరకు జనాభాలో అనేక మార్పులొచ్చాయనీ, దళితులు, ఆదివాసీల జనాభా పెరిగిందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనలో వారు జనాభా ఆధారంగా సీట్లు పెరిగే అవకాశం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించాయని అన్నారు. డీలిమిటేషన్‌తో నష్టపోతామన్న అందోళన అక్కడి ప్రజల్లో ఉందన్నారు. డీలిమిటేషన్ కమిషన్‌తో సంబంధం లేకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పు అని విమర్శించారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కొన్ని చోట్ల గోధుమలు ఇస్తున్నారని చెప్పారు.
ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. రేషన్ దుకాణాల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలనీ, ఖమ్మంలో మైనర్ బాలికకు న్యాయం చేయాలని ఆందోళనలు చేశామని అన్నారు. ఖమ్మం ఘటనపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఖమ్మం బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చారని అన్నారు. రెండో విడతలో వారికే ప్రాధాన్యత ఇస్తే ఆందోళన చేపడతామన్నారు. విద్యావైద్యంపై ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా కలిసి సర్వే చేస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత సమస్యలపై అధికారులకు మెమోరాండం సమర్పిస్తామని అన్నారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని కోరారు. ఆరు గ్యారంటీల అమలుకు పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు సుధా సుందర్‌రామన్, రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.



