హామీలను నెరవేర్చకుండా మోసం
వాటిని ఎండకట్టాలి : బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-హుస్నాబాద్‌రూరల్
ఎన్నికల సమయంలో ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నేడు ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సాయి ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృతజ్ఞతకు, ఆశకు మధ్య పోటీలో ఆశ చూపిన కాంగ్రెస్ గెలిచిందన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల గొంతుకగా ఉన్నామన్నారు. హుస్నాబాద్‌కు బీఆర్‌ఎస్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని, తెలంగాణ ఉద్యమ తొలినాళ్ల నుంచే ఈ ప్రాంత ప్రజలు పార్టీకి అండగా నిలిచారన్నారు. కేసీఆర్‌కు హుస్నాబాద్‌పై ప్రత్యేక నమ్మకం ఉండేదని, ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించేవారన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణలో బీజేపీ ఊసే లేదన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీఆర్‌ఎస్ మాత్రమేనని.. అందులో ఏ సందేహం లేదన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. డబుల్ ఓట్లు, చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాల్లో ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అసలైన ఓటర్ల జాబితా సిద్ధం చేయడంలో సహకరించాలని పిలుపునిచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టు, రైతు సంక్షేమం, దళితబంధు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల పనితీరుపై తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మి కాంతారావు, బీఆర్‌ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్, బీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఆశ చూపి అధికారంలోకి కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



