వనమహోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు
16.06 కోట్ల మొక్కలు
నాటాలని లక్ష్యం
గుర్రంగూడ ఎకో పార్కులో ప్రారంభించనున్న
సీఎం రేవంత్ రెడ్డి
ఏర్పాట్లను పరిశీలించిన ఉన్నతాధికారులు
మొత్తం రూ.35.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం-2026కు అటవీ శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురువారం వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అటవీ దళాల అధిపతి (పీసీసీ ఎఫ్) వినయ్ కుమార్, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్, పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రెటరీ గుగులోతు రవి తదితర ఉన్నతాధికారులు గుర్రంగూడ ఎకో పార్కును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికా రులతో సమన్వయం చేస్తూ చేపట్టాల్సిన పనులపై సూచన లు చేశారు. వేదిక ఏర్పాటు, వీఐపీ ప్లాంటింగ్ ఏరియా, పార్కింగ్, భద్రత, తాగునీటి సదుపాయాలు, సందర్శకుల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహిం చారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి నాగలింగం మొక్క నాటి వనమహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్కను నాటనున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారు లు, విద్యార్థులు, స్థానిక ప్రజలు కూడా మొక్కలు నాటి హరిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కానున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 13,242 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 6.18 కోట్ల మొక్కలు, హెచ్ఎండీఏ పరిధిలో 4.50 కోట్ల మొక్కలు నాటనుండగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో 89.59 లక్షల మొక్కల పెంపకం, నాటకం చేపట్టనుంది. గత మూడు దశాబ్దాలుగా న్యాయ వివాదాలలో చిక్కుకున్న గుర్రంగూడ పార్క్ సుప్రీం కోర్టు తీరుతో అటవీ శాఖ చట్టబద్ధంగా గుర్తిస్తూ రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇందులో రూ.11.57 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇందులో 3.6 కిలోమీటర్ల భద్రతా ప్రహరీ గోడ, అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, సందర్శకుల సౌకర్యాలు, ఆధునిక మరుగుదొడ్లు, ప్రవేశ ద్వారాలు, యోగా షెడ్, గెజిబో, ఎకో ట్రయిల్ మార్గాలు, కానోపీ వాచ్ టవర్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
అదనంగా రూ.6.27 కోట్లతో పర్యావరణ పరిరక్షణ పనులు చేపట్టడంతో గుర్రంగూడ ఎకో పార్క్లో మొత్తం రూ.17.84 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో రూ.17. 66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాలు, రహదారుల వెంట విస్తృత స్థాయిలో మొక్కల నాటడానికి కార్యాచరణ రూపొందించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి వాటి మనుగడను నిర్ధారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ, హరిత తెలంగాణ సాధన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మొక్కల పండుగలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అటవీ శాఖ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ రోహిత్, మేడ్చల్ మల్కాజ్ గిరి డీఎఫ్ ఓ వేణుమాధవ్, ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.



