నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించేందుకు పాలనలో మంచి దక్షతను సంపాదించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రొబేషనరీ గ్రూప్ -1 అధికారులకు సూచించారు. మంగళవారం సుమారు 54 మంది ప్రొబేషనరీ గ్రూప్ -1 అధికారులు శిక్షణలో భాగంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో మంగళ బుధ రెండు రోజులపాటు శిక్షణ పొందే నిమిత్తం జిల్లాకు రావడం జరిగింది. ముందుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వారితో సమావేశమైన జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా వివరాలను, తెలియజేశారు.
తెలంగాణలోనే నల్గొండ జిల్లా అతిపెద్ద జిల్లా అని, 566 రెవెన్యూ గ్రామాలు, 869 గ్రామపంచాయతీలు ఉన్నాయని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 16 లక్షల 18 వేల జనాభా ఉందని, 61% అక్షరాస్యత ఉన్న జిల్లాలో సుమారు 77% ప్రజలు వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. జిల్లాలో మారుమూల గిరిజన ప్రాంతాలు, నాగర్జున సాగర్ ప్రాజెక్టు కింది కమాండ్ ఏరియాలో ఉండే మిర్యాలగూడ, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాలలో కమ్యూనికేషన్ సదుపాయాలు కొన్ని గ్రామాలలో ఉన్నాయని తెలిపారు.
గ్రూప్ -1 శిక్షణ అధికారులు వారి శిక్షణలో భాగంగా గ్రామాలకు వెళ్లి అధ్యయనం చేసిన అనంతరం ముఖ్యమైన పారామీటర్స్ పై నివేదిక తయారు చేసుకోవాలని సూచించారు. ఇది భవిష్యత్తు పరిపాలనలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో అమలు చేస్తున్న అనేక పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని పథకాలు అమలు అవుతున్నాయని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు, ఉపాధి హామీతో మొదలుకొని, పెన్షన్లు అన్ని పథకాల కింద లబ్దిని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ కి జమ చేయడం జరుగుతున్నదని చెప్పారు.
సన్న దాన్యం పండించిన రైతులకు క్వింటాలుకు రూ.500/- బోనస్ ఇస్తున్నదని, అన్ని పథకాలలో మధ్య దళారీ వ్యవస్థ లేదని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వీటన్నిటిపై అధ్యయనం చేసి భవిష్యత్తులో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేయాలని ప్రొభేషనరీ అధికారులకు పిలుపునిచ్చారు. ఈ శిక్షణ భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని, అందువల్ల ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాగా 54 మంది శిక్షణ గ్రూపు-1 అధికారులు మంగళ బుధ రెండు రోజులపాటు జిల్లాలోని కొండమల్లేపల్లి మండలం చెన్నమనేనిపల్లి, పీఏ పల్లి మండలం ఆర్ఆర్ గూడెం, చింతపల్లి మండలంలోని గొల్లపల్లి, దేవరకొండ మండలం మైనంపల్లి, తూర్పుపల్లి, వేములపల్లి మండలం శెట్టి పాలెం, లక్ష్మీదేవి గూడెం, మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్, యాద్గార్ పల్లిలలో సందర్శించి గ్రామీణ ప్రాంతంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గ్రామీణ జీవన విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, ఎం సి హెచ్ ఆర్ డి కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.



