నవతెలంగాణ – వనపర్తి
ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఐడి ఓసీలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి ఇంటర్ పరీక్షలపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయని, పరీక్షలకు సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరుకునేలా సూచనలు చేయాలని తెలిపారు. పరీక్షల విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పని చేయాలన్నారు. జిల్లాలో ఇంటర్జి పరీక్షల కోసం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాల ద్వారా 6,216 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 6,437 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, 10 ప్రశ్న పత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉంటాయని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు నిర్వహించాలని, పరీక్షా సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి సిబ్బంది కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో అవసరమైన్ ఫర్నీచర్ ఉండేలా చూడాలని, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోస్టల్ శాఖ వారు జవాబు పత్రాలను సరిగా రిసీవ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మంచినీరు, ఫాన్స్, టాయిలెట్స్ ఏర్పాట్లు మౌలిక సదుపాయాలు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ లు పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. సెల్ ఫోన్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఎట్టి పరిస్థితిలో పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని, ఎవరూ తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య, వైద్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



