– తొగుట సిఐ షేక్ లతీఫ్..
నవతెలంగాణ – రాయిపోల్
సమాజంలో జరుగుతున్న నేరాలు సైబర్ మోసాలు సామాజిక రుగ్మతులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్త వహించాలని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు. సోమవారం రాత్రి రాయపోల్ మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో పోలీస్ ‘కనువిప్పు’ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ నేరాలు సామాజిక రుగ్మతలు, ట్రాఫిక్ నియమాలు, మహిళ రక్షణ చట్టాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వలన కలిగే నష్టాలు వంటి ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలు, సైబర్ మోసాలు మరియు సామాజిక రుగ్మతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటిపిలు చెప్పకూడదని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని గ్రామస్థులకు వివరించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజల రక్షణ కోసం అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ కుంచం మానస, పోలీస్ సిబ్బంది,కళాబృందం,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



