కార్మిక శ్రేణులు ఐక్యం కావాలి
రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పేరుతో ప్రయివేటీకరణకు కుట్ర
విద్యుత్ సవరణ బిల్లుతో ప్రజలకు ఇబ్బందులు :సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
కరీంనగర్‌లో ‘ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ – ఉద్యోగ కార్మికుల కర్తవ్యం’ సదస్సు
నవతెలంగాణ – కరీంనగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వరంగ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని, వాటి పరిరక్షణే ధ్యేయంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవన్‌లో యు.శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన ‘ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ – ఉద్యోగ కార్మికుల కర్తవ్యం’ సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ ప్రగతికి చోదక శక్తులుగా ఉన్న సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు ఆమోదం పొందితే, విద్యుత్ రంగం పూర్తిగా ప్రయవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘నో క్రాస్ సబ్సిడీ’ విధానం ద్వారా పెట్టుబడిదారులకు, వ్యాపార సంస్థలకు బిల్లులు తగ్గి, గృహ వినియోగదారులపై అదనపు భారం పడుతుందని వివరించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్‌లో స్మార్ట్ మీటర్లపై తీవ్ర ప్రజావ్యతిరేకత రావడంతో యోగి ప్రభుత్వం వాటిని తాత్కాలికంగా నిలిపివేసిందని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. పాలకులు కుర్చీల కోసం కొట్లాడుకున్నా, ప్రజలను దోచుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటేనని విమర్శించారు.
ఆర్టీసీ, సింగరేణి సంస్థలపై ప్రయివేటు నీడ
పర్యావరణం పేరిట ఎలక్ట్రిక్ బస్సులను ప్రమోట్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, వాటిని ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తోందని వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌పోర్ట్ సవరణ చట్టం ద్వారా ప్రయివేటు బస్సులకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తూ ఆర్టీసీని దెబ్బతీస్తున్నారని అన్నారు. తెలంగాణకు మణిహారం లాంటి సింగరేణిని కూడా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రెండు బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్మికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఈసీఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రావు సేవలను కొనియాడారు.
గల్లీ గల్లీలో చైతన్య ఉద్యమం
ఎల్బీసీ, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ వంటి ప్రధాన సంస్థల్లో రెగ్యులర్ ఉపాధిని తగ్గిస్తూ, కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ విధానాలను తీసుకురావడం వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందరెడ్డి అన్నారు. సదస్సులో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, కోశాధికారి రాజేశం, సహాయ కార్యదర్శి పున్నం రవి, ఎన్ఐసీ యూనియన్ కార్యదర్శి పెనుగొండ బసవేశ్వర్, యునైటెడ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్వాల స్వామి, జిల్లా అధ్యక్షులు సంతోష్, కార్యదర్శి శ్రీనివాస్, ఐసీఈయు కరీంనగర్ సహాయ కార్యదర్శి పెనుగోండ బసవేశ్వర్, ఎస్ డబ్ల్యూఎఫ్ కరీంనగర్ కార్యదర్శి వీరగొని శ్రీనివాస్, ఉద్యోగులు, కార్మిక యూనియన్ నాయకులు పాల్గొన్నారు.



