Friday, June 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రభుత్వ పాఠశాలలను 
బలోపేతం చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను 
బలోపేతం చేయాలి

- Advertisement -

అసంపూర్తి భవనాలను వెంటనే పూర్తి చేయాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, యూనిఫామ్స్ అందించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల సందర్శన

నవతెలంగాణ-ముషీరాబాద్‌/సిటీబ్యూరో
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను తక్షణమే పరిష్కరించి, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ‌ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆయన ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవసరాల కోసం 2021లో అదనపు భవన నిర్మాణాన్ని ప్రారంభించినా, నేటికీ అది పూర్తికాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శించారు. సుమారు 800 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో సరిపడా గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే నిధులు విడుదల చేసి, అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

​ప్రయివేటు ఏజెన్సీల చేతిలో నాణ్యత కరవు
మధ్యాహ్న భోజన పథకం అమలుపై జాన్‌‌వెస్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజన నిర్వహణను ప్రయివేటు సంస్థకు అప్పగించారని, కానీ, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదని అన్నారు. సరైన బియ్యం, నాణ్యమైన పదార్థాలు వాడకపోవడం వల్ల విద్యార్థులు బడి భోజనం తినలేక, ఇండ్ల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకవైపు బ్రేక్‌ఫాస్ట్ పెడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం కనీసం మధ్యాహ్న భోజనాన్ని సక్రమంగా అందించలేకపోవడం సిగ్గుచేటన్నారు. పాఠశాలలు ప్రారంభమైనా నేటికీ విద్యార్థులకు యూనిఫామ్‌లు అందలేదన్నారు. అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ విద్యను కాపాడాలని కోరారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ ‌కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.దశరథ్, ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్.వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్, అశోక్ రెడ్డి, నాగేందర్, రజనీకాంత్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -