ప్రజా సమస్యలపై పోరాటాల్లో భాగస్వాములు కావాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు : దేవ్‌జీ
ఎంబీ భవన్‌లో సీపీఐ(ఎం) నేతలతో మాజీ మావోయిస్టుల భేటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజాసమస్యలపై కలిసి పనిచేద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ.. మాజీ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. సమస్యలపై జరిగే పోరాటాల్లో భాగస్వాములు కావాలని వారికి సూచించారు. మాజీ మావోయిస్టులు దేవ్‌జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక్క, సంజీవ్, బండి ప్రకాశ్ భేటీ గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌కు విచ్చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతోపాటు ఆ పార్టీ ప్రతినిధులతో వారు ఈ సందర్భంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాల గురించి సుమారు రెండు గంటలకుపైగా చర్చించారు. అనంతరం జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడుతూ దేశంలో మావోయిస్టులను ఏరివేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను చేపట్టటం దాని నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా అది నరమేధాన్ని కొనసాగించిందని చెప్పారు. సీపీఐ(ఎం), ఇతర వామపక్ష పార్టీలు, ప్రజాస్వామిక వాదులు కేంద్ర ప్రభుత్వ తీరును ఖండించారని గుర్తు చేశారు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చిన వారు ప్రజాఉద్యమాల్లో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని కోరారు. వారి మీద ఉండే ఆంక్షలను ఎత్తేయాలని ప్రభుత్వానికి సూచించారు.
జనజీవన స్రవంతిలో కలవకుండా ఉండిపోయిన మిగతా మావోయిస్టులపై నిర్బంధాన్ని కొనసాగించొద్దని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలు పెరుగుతున్నాయనీ, పెట్టుబడిదారులు పెద్దఎత్తున దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వాటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ముందుకొస్తున్నాయని చెప్పారు. సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం, మతోన్మాదానికి, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటాల్లో కలిసొచ్చే వారికి సీపీఐ(ఎం) ఆహ్వానం పలుకుతోందని అన్నారు. ఆపరేషన్ కగార్ సందర్భంగా వామపక్షాలు, కాంగ్రెస్, ప్రజాస్వామికవాదులు ఆ నిర్బంధాన్ని వ్యతిరేకించాయని గుర్తు చేశారు. ఆయా పార్టీలను కలవడంలో భాగంగానే మాజీ మావోయిస్టులు తమతో భేటీ అయ్యారని వివరించారు. ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేద్దామని అన్నారు. ఇందులో రాజకీయ అంశాలకు ప్రాధాన్యత లేదని వివరించారు.
మర్యాదపూర్వకంగానే కలిశాం : దేవ్‌జీ
ఆపరేషన్ కగార్‌ను ఆపాలనీ, కర్రెగుట్టలో నిర్బంధం తొలగించాలనీ, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని వామపక్ష పార్టీలు, శాంతి చర్చల కమిటీ, ప్రజాసంఘాలు కోరాయని మాజీ మావోయిస్టు దేవ్‌జీ అన్నారు. ఆ మేరకు ఆయా పార్టీలు, సంఘాలు పలు ఉద్యమాలను కూడా నడిపాయని వివరించారు. తాము ప్రజా జీవితంలోకి వచ్చాక ఆపరేషన్ కగార్‌ను ఆపాలనే రాజకీయ పార్టీలన్నింటినీ కలవాలనే కార్యక్రమాన్ని తాము తీసుకున్నామని చెప్పారు. ఇటీవల సీపీఐ కార్యాలయానికి వెళ్లామనీ, ఇప్పుడు సీపీఐ(ఎం) కార్యాలయానికి వచ్చామని తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులపై సీపీఐ (ఎం) నేతలతో చర్చించామని అన్నారు. రాజకీయ పార్టీ స్థాపించడంపై మాట్లాడటానికి ఇది సందర్భం కాదన్నారు. ఏ పార్టీలో చేరడం లేదనీ. ఆ విషయాలపై చర్చించుకోవడానికి ఇది సరైన సందర్భం కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, టి సాగర్, ఎండీ అబ్బాస్, సీనియర్ నాయకులు జి రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరాం నాయక్, టి స్కైలాబ్‌బాబు, మల్లు నాగార్జునరెడ్డి, పి ఆశయ్య, ఉడుత రవీందర్ తదితరులు పాల్గొన్నారు.



