కాలుష్య రహిత నగరం నిర్మించి తీరుతా
ఎవడు అడ్డొచ్చినా.. ఏడ్చీనా భారత్ ప్యూచర్ సిటీ ఆగదు .. వచ్చే ఎన్నికల్లో హరీశ్ దమ్ముంటే సిద్ధిపేటలో గెలవాలి .. మూసీ ప్రక్షాళన చేసి భువనగిరి, నల్లగొండ ప్రాంతాలకు స్వచ్ఛమైన నీరు అందిస్తా
మూసీ కార్పొరేషన్ కోసం పార్టీ మారి ఆయన ఏం వెలగబెట్టాడు
ఎల్బీనగర్ ప్రాంత ప్రజలకు అండగా ఉంటా : గుర్రంగూడ వనమహోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
మొక్కనాటిన ముఖ్యమంత్రి
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కాలుష్య రహిత నగరాన్ని నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లుతుందని, ఎవరు అడ్డుకోవాలని చూసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఏడ్చుకుంటు పొర్లాడినా కాలుష్య రహిత భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మించి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో కేబీఆర్ పార్కుకు దీటుగా ఎల్బీనగర్ ప్రాంత ప్రజలకు కూడా 420 ఎకరాల పార్కు నిర్మాణం చేసేందుకు.. నిధులు ఇచ్చి పార్కును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ప్రాంతంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని, 420 ఎకరాల్లో పార్కును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఎల్బీనగర్ ప్రాంత ప్రజలంటే తనకు అభిమానమని, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత… తనను ఎంపీగా గెలిపించింది ఈ ప్రాంత ప్రజలేనని గుర్తు చేశారు. ఆ రోజు మనం నమ్ముకున్న వారు మనల్ని మోసం చేసి… మంత్రి పదవి కోసం ఒకరు.. కార్పొరేషన్ పదవి కోసం ఒకరు కన్నతల్లిలాంటి పార్టీని వదిలి వెళ్లారని పార్టీ మారిన నేతలను ఉద్దేశించి అన్నారు. ‘నా సొంత ఊరు కొండరెడ్టి పల్లికి వెళ్లితే ఎంత అనుభూతి ఉంటుందో… ఈ ప్రాంతానికి వచ్చినా అంతే అనుభూతి ఉంటుంది` అని సీఎం అన్నారు. గత ప్రభుత్వాలు ఒక ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే పని చేశాయని.. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంత అభివృద్ది పట్ల ఆలోచన చేయలేదన్నారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కోహెడకు తీసుకెళ్లి తాత్కాలిక షెడ్లు వేస్తే అవి గాలికి ఎగిరిపోయాయని తెలిపారు. ఆ మార్కెట్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
అది త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేసి.. అంతర్జాతీయ పెట్టుబడులు ఈ ప్రాంతానికి తీసుకోచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే… కొంత మంది దుర్మార్గులు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నరని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆగేది లేదని అన్నారు. మూసీ ప్రక్షాళన చేపట్టి భువనగిరి, నల్లగొండ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిదామంటే అందులోనూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. భువనగిరి ప్రాంతాల్లో మూసీ ప్రవహించే ప్రాంతాల్లో పిల్లలకు పెండ్లి అయ్యే పరిస్థితి లేదన్నారు. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితిలో మూసీని శుద్ధి చేసుకుందామంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ ప్రక్షాళన చేసి తీరుతానని సీఎం తేల్చి చెప్పారు. అటవీ భూమిని కొంత మంది కబ్జాపెట్టి ప్రయివేటు భూమిగా సృష్టించే క్రమంలో న్యాయ స్థానంలో అనుభవం గల న్యాయవాదులను పెట్టి అటవీ భూమిని కాపాడటంలో ప్రభుత్వం విజయం సాధించందన్నారు. హైడ్రా అంటే గత పాలకులకు వణుకు పుడుతుందన్నారు. ఫ్యూచర్ సిటీలో కెమికల్ కంపెనీలు పెడుతానని ఓ పోడుగాయన అంటుండు.. దమ్ముంటే ఆయన వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేటలో గెలవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావును ఉద్దేశించి సీఎం వ్యాఖ్యనించారు.
అటవీ భూముల కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో ఆటవీ భూములను కాపాడటమే కాకుండా.. ఆ ప్రాంతలోని జీవించే వన్య ప్రాణులను కాపాడుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇందులో భాగంగానే వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందన్నారు. సుప్రీం కోర్టులో 16 ఎకరాల భూమి కోసం ప్రత్యేక చొరవ తీసుకుని విజయం సాధించమన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులు రావాలని, ఆటవీ శాఖకు సంబంధం లేని భూమిని తీసుకునే ప్రయత్నం చేస్తే.. ఆర్టిఫిషల్ ఉపయోగించుకుని లేని మొక్కలను, జీవులను చూపించారన్నారు.
వన మహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా విజయవంతం చేద్దాం :
మంత్రి కొండ సురేఖ
ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. “ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క” నాటాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన వచ్చిందన్నారు. గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని 424 ఎకరాల 31 గుంటలతో రిజర్వ్ ఫారెస్ట్‌గా అభివృద్ధికి కార్యాచరణ చేపట్టామన్నారు. ప్రతి ఏటా అటవీ సంరక్షణలో నిబద్దతతో పనిచేస్తున్న సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు.



