Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి

ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి

- Advertisement -

– మండల ప్రత్యేక అధికారి రాజా గంగారాం 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాల్లో ఇంటి పన్నుల వసూళ్లల్లో వేగం పెంచాలని మండల ప్రత్యేక అధికారి రాజా గంగారం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఇంటి పన్నుల వసూళ్లే కీలకమన్నారు. ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించి ఇంటి పన్నులను వసూలు చేయాలని, 100శాతం పన్నుల వసూల్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను  వేగవంతం చేయాలని సూచించారు. 

ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించుకొని లబ్ధిదారులు తక్షణమే ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు. గతంలోని మార్కౌట్ పనులు పూర్తి చేసుకొని ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులు కూడా పిల్లర్లు, పునాదుల పనులను మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే వారికి సంఘాల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. చివరి దశకు వచ్చిన ఇండ్ల మిగిలి ఉన్న పనులను పూర్తి చేయించి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. నర్సరీల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించోద్దని సూచించారు. వేసవి ఎండలు ముదురుతున్నందున మొక్కల సంరక్షణకు షెడ్ నేట్లను ఏర్పాటు చేయించాలని సూచించారు. జాతీయ కుటుంబ భద్రత పథకంలో అర్హులైన వారిని చేర్పించాలన్నారు.ఈ సమావేశంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -