నిజామాబాద్ మార్కెట్ యార్డులో రాశులు
నాలుగు రోజుల తర్వాత బీట్.. 40 వేల బ్యాగుల తరలింపు
నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తున్న ట్రేడర్‌లు
క్వింటాకు సగటు ధర రూ.13 వేల నుంచి రూ.15 వేలు
దిగుబడి తగ్గిందని రైతుల ఆవేదన
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ‘పసుపు దనం’ ఆవరించింది. ఎటువైపు చూసినా పంట రాశులు దర్శనమిస్తూ ఎర్రటి ఎండకు నిగనిగలాడుతుండటంతో యార్డు ఆవరణలో పసుపువర్ణం ఉట్టి పడుతోంది. నాలుగు రోజుల సెలవు తర్వాత తాజాగా బుధవారం బీట్ నిర్వహించడంతో రైతులు పెద్దఎత్తున తమ పసుపు పంటను తరలించారు. బస్తాకు 60 కిలోల లెక్కన.. మొత్తం 40 వేల బస్తాలు మార్కెట్‌కు రావడం విశేషం. కమీషన్ ఏజెంట్‌లు.. ట్రేడర్‌లను తీసుకువస్తూ పసుపు కొమ్ములను చూయిస్తూ లాట్ నెంబర్ నమోదు చేయిస్తున్నారు. పంట నాణ్యతను బట్టి ధరను నిర్ణయిస్తున్నారు.
సాధారణ రోజుల్లో 5 గంటల వరకు బీట్ సాగనుండగా.. బుధవారం ఎక్కువ మొత్తంలో పసుపు రావడంతో 6 గంటల వరకు బీట్ నిర్వహించేందుకు మార్కెట్ కమిటీ అవకాశం కల్పించింది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ పసుపు సాగుకు పెట్టింది పేరు. పసుపు రైతుల పోరాటాలు రాజకీయంగా అనేక ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. ప్రస్తుతం పసుపు పంటను తవ్వి, ఉడకబెట్టి, పాలీష్ చేస్తూ మార్కెట్ యార్డుకు తరలించే పనులు జోరందుకున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సుమారు 22 వేల ఎకరాల్లో పసుపు పంట సాగైంది. జనవరి నెల చివరి నుంచి మే నెల వరకు పెద్దఎత్తున మార్కెట్ యార్డుకు తరలిరానుంది.
40 వేల బస్తాలు రాక
శని, ఆదివారం బీట్ జరగకపోగా.. శివరాత్రి నేపథ్యంలో మార్కెట్ యార్డుకు సోమ, మంగళవారం సెలవు ప్రకటించారు. దీంతో నాలుగు రోజుల తర్వాత బుధవారం బీట్ ప్రారంభించడంతో ఒక్కరోజే 60 కిలోల తూకం గల 40 వేల బస్తాలు మార్కెట్ యార్డుకు చేరుకున్నాయి. 24 వేల క్వింటాళ్ల పసుపు తరలిరావడంతో మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా పసుపు కొమ్ముల రాశులతో దగదగలాడుతోంది. గోల, తాడి, చూర మూడు రకాలుగా వేరు చేసిన పసుపు కొమ్ములను కమీషన్ ఏజెంట్‌ల వద్ద కుప్పలుగా పోశారు. రైతుల పేరుతో మార్కెట్ కమిటీ లాట్ నెంబర్ కేటాయించింది. కమీషన్ ఏజెంట్‌ల ఆధ్వర్యంలో ట్రేడర్‌లు పసుపు కొమ్ముల నాణ్యత పరిశీలిస్తూ లాట్ నెంబర్‌లు నమోదు చేసుకుంటున్నారు.
దేశీయంగా ఉన్న డిమాండ్ ప్రకారం నాణ్యతను బట్టి సాయంత్రం వేళ ధర నిర్ణరచారు. మొత్తం 6 వేల లాట్‌లు కేటాయించగా.. ఒక్కో లాట్‌కు గరిష్ట ధర నిర్ణయించిన ట్రేడర్ ధర ఫైనల్ చేసి, అంతకంటే తక్కువకు కోట్ చేసే ట్రేడర్‌ల ధరలను తొలగించారు.. రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధర నిర్ణయం జరిగింది. తన పంటను క్వింటాకు 13500లకు అమ్ముకున్నట్టు ఒక రైతు తెలిపారు. ధర నచ్చకపోతే తర్వాతి రోజు వరకు ఎదురుచూస్తున్నారు. అయితే శుక్రవారం పంటకు నాణ్యతను బట్టి గరిష్టంగా క్వింటాకు రూ.14,289, కనిష్టంగా రూ.9500 పలకగా.. సగటు రూ.12,820 ధర పలికినట్టు అధికారులు తెలిపారు. బుధవారం సైతం గరిష్ట ధర రూ.15 వేలు పలికినట్టు రైతులు చెబుతున్నారు.
భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి
గతేడాది ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో పసుపు చేనులో నీరు నిల్వ ఉండటంతో పసుపు మురిగి దిగుబడి తగ్గినట్టు రైతులు వాపోతున్నారు. ఎకరాకు సగటును 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. పలు చోట్ల 15-18 క్వింటాళ్ల వరకు మాత్రమే రావడంతో ఆందోళన చెందుతున్నారు. దిగుబడి తగ్గిన.. మంచి ధర వస్తేనే గట్టెక్కే అవకాశాలున్నాయని, లేకుంటే అప్పులపాలు అయ్యే పరిస్థితి ఉన్నట్టు వాపోతున్నారు.



