– వచ్చే వారం తర్వాత ఎప్పుడైనా
– నాలుగేండ్లలో తొలిసారిగా డీజిల్ పెంపు ?
– ఇంధన రేషనింగ్‌తో ట్రక్కుల నిర్వాహకుల ఇక్కట్లు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ట్రక్కుల నిర్వాహకులు ఇంధన రేషనింగ్‌కు, అలాగే నాలుగేండ్లలో తొలిసారిగా గణనీయంగా డీజిల్ ధరల పెరుగుదలకు సన్నద్ధమవుతున్నారు. దాదాపుగా 8 వారాలుగా పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్నా ఇప్పటివరకైతే ధరల్లో ఎలాంటి మార్పులేదు, కానీ ఇక ఆ పరిస్థితికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశమైన భారత్ ఇప్పటివరకు ఈ యుద్ధం కారణంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వచ్చినా కీలక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అటు వినియోగదారులకు ఇటు ప్రభుత్వ చమురు శుద్ధి కర్మాగారాలకు ఇబ్బందులు కలగకుండా రక్షణ చర్యలు తీసుకుంటూ వచ్చింది. కానీ ఇక ఇప్పుడు ధరలు పెంచేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. వచ్చే వారంతో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగియనుంది. మరోపక్క యుద్ధం కొనసాగుతూ ఒత్తిళ్ళు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెంపు చర్యలు తప్పవు. ట్రక్ డ్రైవర్లు ఇప్పటికే అనధికారికంగా ఇంధన రేషనింగ్ అమలవుతోందని ఆరోపిస్తున్నారు. దానివల్ల తాము తరచుగా తమ ట్యాంక్‌లను నింపుకోవడానికి ఆగాల్సి వస్తోందని, ఫలితంగా డెలివరీలు ఆలస్యమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
‘ఎన్నికల తర్వాత డీజిల్ ధరల్లో పెరుగుదల తప్పదు.’ అని అఖిల బారత మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు శైలేంద్ర గుప్తా వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే దాదాపు పది శాతం ట్రక్కులు తిరగకుండా నిలిచిపోయాయి. ఇక ఇంధన ధరలు కూడా పెరిగినట్లైతే ఈ సంఖ్య 30శాతానికి పెరగవచ్చు.’ అని పేర్కొన్నారు.
ఒక పరిమితి వరకు నెలవారీ కొనుగోలు చేసే వారికి గతంలో ఇచ్చిన రాయితీలను ఇప్పటికే పెట్రోల్ పంపులు ఉపసంహరించుకున్నాయి. దేశంలోని సరుకు రవాణాలో ఎక్కువ భాగం రోడ్ల ద్వారానే సాగుతుంది. దాదాపు 70శాతం ట్రక్కులు సరుకు రవాణాలోనే వున్నాయి.
అంటే డీజిల్ అనేది మన ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటిది. నయారా ఎనర్జీ లిమిటెడ్ వంటి ప్రయివేటు సంస్థలు ఇప్పటికే ధరలు పెంచగా, రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్, దాని భాగస్వామి బిపి పిఎల్‌సి తమ సరఫరాల్లో రేషన్ అమలు చేస్తున్నాయి. రిటైల్ ఇంధన ధరల్లో పెరుగుదల వున్నా, బలహీనమైన మారకపు రేటు వున్నా ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
అఖిల భారత పెట్రోలియం డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు అజరు బన్సాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వ విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి రేషనింగ్ లేదన్నారు. అయితే ఇతర ఆంక్షల కారణంగా తలెత్తే పర్యవసానాలను మాత్రం ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు.”ప్రయివేట్ రిఫైనరీలు అమ్మకాల్లో కోతలు విధిస్తుండడంతో ప్రభుత్వ రిటైల్ కేంద్రాల వద్ద డిమాండ్ అసాధారణంగా పెరుగుతోంది. దీనివల్ల కొన్ని చోట్ల స్టాక్ అయిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దాంతో వారు అమ్మకాల్లో కోతలు విధిస్తున్నారు.” అని బన్సాల్ తెలిపారు.
భయాందోళనలతో ఇంధనం కొనుగోలు చేయవద్దని ఆదివారాలు కూడా రిటైల్ ఔట్‌లెట్‌లు సాధారణంగానే పనిచేస్తాయని కేంద్రం చెబుతోంది. పెట్రోల్ లేదా డీజిల్‌కి సంబంధించి రెగ్యులర్ రిటైల్ ధరల్లో ఎలాంటి పెరుగుదల వుండదని చెప్పింది.పెట్రోల్, డీజిల్‌పై స్థానిక పన్నులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది. వినియోగదారుల ప్రయోజనాల కోసం ఎగుమతి లెవీలను పెంచింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో బారెల్ ముడి చమురు ధర సగటున 95డాలర్లుగా వుంటే ప్రభుత్వం పంప్ ధరలను లీటరు గ్యాసోలిన్, డీజిల్‌కు రూ.8నుంచి 15వరకు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అనుభూతి సహారు నేతృత్వంలోని స్టాండర్డ్ చార్టర్డ్ పీఎల్‌సీ ఆర్థికవేత్తలు గత శుక్రవారం ఇచ్చిన ఒక నివేదికలో పేర్కొన్నారు. అలాగే వంట గ్యాస్ ధరలు కూడా పెంచాల్సి వస్తుంది. ఒకవేళ బారెల్ ధర సగటున 85 నుండి 90 డాలర్ల మధ్య వున్నట్లైతే రిటైల్ ఇంధన ధరలు లీటరుకు రూ3 నుండి 7 వర కు పెరగవచ్చని పేర్కొన్నారు. సోమవారానికి బ్రెంట్ ముడి చమురు ధర బారెల్‌కు 96డాలర్లుగా వుంది.
ఇక ఇంధన ధరల పెంపు తప్పదా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



