నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండో విడత రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. కాటారం మండలం నస్తూరిపల్లి గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభలో స్వయంగా బటన్ నొక్కి నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఈ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానుండగా, రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. రెండో విడతలో మొత్తం 45 లక్షల 11 వేల 947 మంది రైతులకు రూ.5,563 కోట్లు జమ కానున్నాయి. ఇప్పటికే తొలి విడతలో రూ.3,590 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం, మూడో విడత నిధులను కూడా వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. మే నెలాఖరుకల్లా ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున లబ్ధిదారులందరికీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజాపాలన ఉత్సవాల భాగంగా నిర్వహించిన రైతు ఉత్సవాల సభలో ఈ ప్రకటనలు చేయడం విశేషం.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోవడాన్ని ప్రస్తావిస్తూ, లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. గతంలో కేవలం 9 రోజుల్లోనే రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేశామని, ఇప్పుడు రెండో విడతగా రూ.5,700 కోట్లకు పైగా జమ చేస్తున్నామని తెలిపారు. మిగతా నిధులను కూడా త్వరలోనే జమ చేస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, రాష్ట్రంలో 3.5 కోట్ల మంది పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొంటూ, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
రైతు భరోసా నిధుల విడుదలతో రైతుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. సాగు పనులకు ఆర్థికంగా బలం చేకూరుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు వ్యవసాయ రంగానికి ఊతమివ్వనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
రైతులకు భారీ ఊరట – రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



