రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
నవతెలంగాణ – మిరుదొడ్డి
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంయుక్త-శ్రీధర్ అన్నారు. పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి, రైతులు మోసపోవద్దని సూచించారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ శ్రీనివాస్ తో కలిసి ఏఎంసి చైర్మన్ సంయుక్త-శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలగకుండా గ్రామీణ ప్రాంతాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుందన్నారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం క్వింటాలు వరి ధాన్యానికి 2389/- మద్దతు ధర కేటాయించడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. మాయ మాటలు నమ్మి దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి రైతులు మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఐకెపి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం నర్సమ్మ, సీసీ వైకుంఠం, ఐకెపి సిబ్బంది పద్మ, సత్తిరెడ్డి సభ్యులు పలువురు పాల్గొన్నారు.



