Tuesday, April 21, 2026
E-PAPER
Homeఆటలుహ్యాట్రిక్‌ కొడతారా?

హ్యాట్రిక్‌ కొడతారా?

- Advertisement -

ఢిల్లీతో సన్‌రైజర్స్‌ ఢీ నేడు
రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ది దూకుడుకు కొలమానాలు లేని విధ్వంసక శైలి. ప్రణాళికబద్దమైన వ్యూహంతో ముందుకెళ్లే జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌. నేడు ఉప్పల్‌ స్టేడియంలో ఈ రెండు జట్లు ఢీకొట్టేందుకు సై అంటున్నాయి. వరుస విజయాల ఊపుమీదున్న సన్‌రైజర్స్‌ హ్యాట్రిక్‌పై కన్నేసింది. సన్‌రైజర్స్‌ విశ్వరూపం ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలబడగలదా? ఆసక్తికరం.
నవతెలంగాణ-హైదరాబాద్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయ ఫార్ములా పూర్తి భిన్నం. కానీ ఫలితాల సాధనలో ఇరు జట్ల ప్రయాణం ఒకేలా సాగుతోంది. సన్‌రైజర్స్‌ ఆరు మ్యాచ్‌ల్లో మూడింట విజయాలు సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌19 లీగ్‌ దశ ద్వితీయార్థంలోకి అడుగు పెడుతుండగా.. బ్యాట్‌తో,బంతితో గాడిలో పడేందుకు జట్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ నేడు ఉప్పల్‌ స్టేడియంలో బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు తలపడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించగా, ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
సన్‌రైజర్స్‌కు ఎదురుందా?
సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ తడబడుతూనే అలవోకగా 200 ప్లస్‌ స్కోర్లు నిలకడగా సాధిస్తోంది. అభిషేక్‌ శర్మ దంచికొడుతుండగా, ట్రావిశ్‌ హెడ్‌ తనదైన ఇన్నింగ్స్‌ బాకీ పడ్డాడు. ఇషాన్‌ కిషన్‌ గొప్పగా ఆడుతున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ ఈ సీజన్‌లో సరికొత్త బాధ్యతల్లో కనిపిస్తున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌కు చిరునామా క్లాసెన్‌.. కానీ ఈ సీజన్‌లో బాధ్యతాయుతంగా రాణిస్తున్నాడు. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలినా.. విలువైన భాగస్వామ్యాలు నిర్మిస్తూ జట్టును నడిపిస్తున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 47.16 సగటుతో క్లాసెన్‌ 283 పరుగులు చేశాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్భుతంగా రాణిస్తున్నాడు. యువ ఆటగాళ్లు అనికెత్‌ వర్మ, సాలిల్‌ అరోరా అంచనాలను అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుస విజయాల జోరుమీదున్న సన్‌రైజర్స్‌.. బ్యాటర్లు మెరిస్తే భారీ స్కోరు బాదేందుకు ఎదురుచూస్తోంది. బౌలింగ్‌ విభాగంలో యువ పేసర్లు ప్రఫుల్‌ హింగే, సకిబ్‌ హుస్సేన్‌లు వరుస మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్నారు. గత మ్యాచ్‌లో ప్రఫుల్‌ హింగే ఎకానమీపై పట్టు కోల్పోయినా.. ఆఖర్లో ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్‌ శివాంగ్‌ కుమార్‌, పేసర్‌ ఈషన్‌ మలింగలతో కూడిన బౌలింగ్‌ లైనప్‌ ఆకట్టుకుంటోంది. బౌలర్లు సమిష్టిగా రాణిస్తే ఎంతటి ప్రత్యర్థికైనా తిప్పలు తప్పవు.

ఢిల్లీ మెరిసేనా?
ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సమతూకంతో కనిపిస్తోంది. బ్యాట్‌తో, బంతితో ఆ జట్టులో మ్యాచ్‌ విన్నర్లకు కొదవ లేదు. కొత్తగా యువ కెరటం సమీర్‌ రిజ్వీ ఈ జాబితాలో చేరాడు. కెఎల్‌ రాహుల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా.. కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ నిలకడగా రాణిస్తున్నాడు. డెవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌ క్యాపిటల్స్‌ మిడిల్‌ ఆర్డర్‌కు వెన్నుముక. ఆశుతోష్‌ శర్మ, నిశాంక సైతం నిలకడగా ఆడుతున్నారు. కరుణ్‌ నాయర్‌కు అవకాశాలు దక్కినా.. సత్తా చాటలేదు. విధ్వంసక బ్యాటర్‌ పృథ్వీ షా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. సన్‌రైజర్స్‌తో సమరంలో పృథ్వీ షాకు ఆడే అవకాశం లభిస్తుందేమో చూడాలి. బౌలింగ్‌ విభాగంలో రంజీ ట్రోఫీ హీరో అకిబ్‌ నబి, ముకేశ్‌ కుమార్‌ సహా లుంగిసాని ఎంగిడి, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, నటరాజన్‌లు ఫామ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయటంలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. దీంతో భారం అంతా బౌలింగ్‌ విభాగంపైనే కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -