Tuesday, April 21, 2026
E-PAPER
Homeక్రైమ్రాజస్తాన్‌లోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

రాజస్తాన్‌లోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

– ప్రధాని మోడీ ప్రారంభానికి ఒకరోజు ముందు ఘటన
– ప్రాణనష్టం జరగలేదని అధికారుల వెల్లడి
జైపూర్‌:
ప్రధాని మోడీ చేతుల మీదుగా నేడు (ఏప్రిల్‌ 21) ప్రారంభం కావాల్సిన రాజస్తాన్‌లోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రిఫైనరీలోని క్రూడ్‌ డిస్టిలేషన్‌ యూనిట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. మంగళవారం ప్రధాని మోడీ అక్కడ పర్యటించి రిఫైనరీని ప్రారంభించాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ కూడా సోమవారం సాయంత్రం రిఫైనరీని సందర్శించనున్నారని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ప్రమాదంపై మాజీ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ఆందోళన
రిఫైనరీలో జరిగిన అగ్నిప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రిఫైనరీ రాజస్తానీయులందరికీ గర్వకారణమైన ప్రాజెక్ట్‌ అని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఈ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్న తరుణంలో ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

2013లోనే ఈ రిఫైనరీకి సోనియాగాంధీ శంకుస్థాపన
రాజస్తాన్‌లో అశోక్‌గహ్లోత్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2013లో సోనియాగాంధీ ఈ రిఫైనరీకి శంకుస్థాపన చేశారు. బలోత్రాలోని ఈ రిఫైనరీని దేశపు తొలి గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ రిఫైనరీ-కమ్‌-పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌గా తీర్చిదిద్దారు. హిందుస్థాన్‌ పెట్రోలియం, రాజస్తాన్‌ ప్రభుత్వం మధ్య జాయింట్‌ వెంచర్‌గా ఇది ఏర్పాటైంది. అప్పుడు ప్రాజెక్ట్‌ వ్యయం రూ.43,129కోట్లు. అనంతరం జనవరి 16, 2018లో నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనిని రీలాంచ్‌ చేసింది. ఈ మొత్తాన్ని రూ.79,459 కోట్లకు సవరించి ఈ ప్రాజెక్ట్‌ చేపట్టారు.

దేశంలోని అతిపెద్ద అనుసంధానిత రిఫైనరీ
4,400 ఎకరాల్లో విస్తరించిన ఈ రిఫైనరీలో ఇంధనంతో పాటు భారీగా పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్లాస్టిక్‌, వ్యవసాయ పైపులు, ప్యాకేజింగ్‌ ఫిల్మ్‌లు, ఆటో విడిభాగాలు, సింథటిక్‌ ఫైబర్‌, వైద్య పరికరాలు, పెయింట్లు, డిటర్జెంట్ల తయారీకి ఇక్కడ తయారయ్యే పెట్రోకెమికల్స్‌ ఉపయోగ పడతాయి. ఇది అందుబాటులోకి వస్తే దేశంలోని అతిపెద్ద అనుసంధానిత రిఫైనరీ- పెట్రో రసాయనాల కాంప్లెక్స్‌ల్లో ఒకటిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వార్షిక సామర్థ్యం 9 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు కాగా ఇందులో పెట్రోరసాయనాల ఉత్పత్తుల సామర్థ్యం 2.4 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా ఉంది.

ప్రధాని మోడీ పర్యటనకు సన్నాహాలు
ఇదిలా ఉండగా ప్రధాని మోడీ బచ్‌పద్రలో రిఫైనరీని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ముగ్గురు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌ (డీఐజీలు), 12 మంది సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీలు), సుమారు 5,000 మంది పోలీస్‌ సిబ్బందిని మోహరించనున్నారు.

వేదిక వద్ద 100కు పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు సౌకర్యవంతంగా ఉండేందుకు విస్తృత ఏర్పాట్లు చేశామని జోధ్‌పూర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీపీ) సత్యేంద్ర సింగ్‌ తెలిపారు. ఃఃవివిధ జిల్లాలను కలుపుతూ ఆరు వేర్వేరు మార్గాల్లో పార్కింగ్‌ సౌకర్యాలు కల్పించాం. వాహనాల రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్‌ మళ్లింపులు కూడా అమలు చేశాంఃః అని ఆయన అన్నారు. కార్యక్రమ వేదిక వద్ద కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు 100కుపైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఐజీపీ సత్యేంద్ర సింగ్‌ తెలిపారు. అయితే రిఫైనరీ దగ్ధమవటంతో..మోడీ బహిరంగసభకు పరిమితమవుతారా..? రిఫైనరీ సందర్శిస్తారా..? అన్నదానిపై చర్చనడుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -