Thursday, February 19, 2026
E-PAPER
Homeజాతీయంమోగిన రాజ్యసభ ఎన్నికల నగారా

మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా

- Advertisement -

పది రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఈసీ షెడ్యూల్‌
తెలంగాణలో రెండు స్థానాలకు ఎన్నికలు
మార్చి 16న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు వెల్లడి

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నగారా మోగింది. దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ స్థానాలు ఏప్రిల్‌ 2026లో వివిధ తేదీల్లో ఖాళీ అవుతున్నాయి. వీటిలో తెలంగాణ నుంచి రెండు స్థానాలు (కెఆర్‌ సురేష్‌ రెడ్డి – బీఆర్‌ఎస్‌, అభిషేక్‌ మను సింఘ్వీ- కాంగ్రెస్‌) ఉన్నాయి. వీరి పదవీకాలం ఏప్రిల్‌ 9తో ముగియనుంది. 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. మార్చి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 6 నామినేషన్ల పరిశీలన చేస్తారు. మార్చి 9 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఆ రోజే సాయంత్రం 5 గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు.

మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఏడుగురు రాజ్యసభ ఎంపీల పదవీకాలం ఏప్రిల్‌ 2న పూర్తి కానుంది. ఇందులో ఎన్సీపీ సీనియర్‌ నేత శరద్‌ పవర్‌, శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఉన్నారు. తమిళనాడు నుంచి ఆరుగురు, పశ్చిమ బెంగాల్‌ నుంచి ఐదుగురు, ఒడిశా నుంచి నలుగురు ఎంపీల పదవీకాలం కూడా ఏప్రిల్‌ 2తోనే ముగియనుంది. తమిళనాడు నుంచి డీఎంకే సీనియర్‌ ఎంపీ తిరుచ్చి శివ, అన్నాడీఎంకే సీనియర్‌ ఎంపీ తంబిదురై తదితరుల పదవీకాలం ముగియనుంది. అలాగే పశ్చిమ బెంగాల్‌ నుంచి సీపీఐ(ఎం) ఎంపీ బికాష్‌ రంజన్‌ భట్టాచార్య, టీఎంసీ ఎంపీ సాకేత్‌ గోయల్‌ తదితరుల పదవీకాలం ముగియనుంది. బీహార్‌ నుంచి ఐదుగురు, అసోం నుంచి ముగ్గురు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, హర్యానాల్లో ఇద్దరు చొప్పున, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక ఎంపీ పదవీకాలం ఏప్రిల్‌ 9తో ముగియనుంది.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌
నోటిఫికేషన్‌ విడుదల : ఫిబ్రవరి 26
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ : మార్చి 5
నామినేషన్ల పరిశీలన : మార్చి 6
నామినేషన్ల ఉపసంహరణకు.. : మార్చి 9
పోలింగ్‌ : మార్చి 16 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గం||ల వరకు)
ఓట్ల లెక్కింపు : మార్చి 16, సాయంత్రం 5 గం||లకు (పోలింగ్‌ ముగిసిన వెంటనే)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -