నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఔట్సోర్సింగ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 632 మంది టైపిస్ట్ కం. కంప్యూటర్ ఆపరేటర్లు పనిచేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ శాఖలో రెగ్యులర్ పోస్టుల నియామకం కోసం ఈ సిబ్బంది సర్వీసును నిలుపుదల చేయాలని మెమోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ సిబ్బంది 20 ఏండ్లుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో రెవెన్యూ శాఖలో విస్తృతమైన సేవలను అందిస్తున్నారని తెలిపారు. రెవెన్యూ శాఖలో ముఖ్యమైన పాత్రను పోషించారని గుర్తు చేశారు. 2023లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి – సమాన వేతనం చెల్లిస్తుందని ఆశించారని తెలిపారు. రెండేండ్లు గడిచినా ఈ దిశగా ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. రెగ్యులర్ పోస్టుల్లో కొత్తవారిని రిక్రూట్ చేసే పేరుతో అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఈ సిబ్బందిని తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. జనవరి 31న రెవెన్యూ శాఖ జారీ చేసిన మెమోను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి : సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



