Tuesday, April 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనెర్రపల్లి గగనతలంపై రాకెట్‌ ప్రయోగం

నెర్రపల్లి గగనతలంపై రాకెట్‌ ప్రయోగం

- Advertisement -

– అంబరాన్ని తాకిన విద్యార్థుల గురు భక్తి
– ఉపాధ్యాయుల సమక్షంలో చారిత్రాత్మక ప్రయోగం
– విద్యార్థుల రాకెట్‌ అద్భుత విజయం
– 2.8 కి.మీ ఎత్తుకు దూసుకెళ్లి రికార్డు సృష్టించిన ఎస్‌ఆర్‌ఎస్‌ఎల్వీ పీ1
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం

భారతీయ అంతరిక్ష పరిశోధన రంగంలో పాఠశాల స్థాయి విద్యార్థులు సరికొత్త చరిత్ర లిఖించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు అంకితమిస్తూ, విద్యార్థులే స్వయంగా డిజైన్‌ చేసిన ఎస్‌ఆర్‌ఎస్‌ఎల్వి పి1 2026 హై-పవర్‌ రాకెట్‌ హైదరాబాద్‌ శివార్‌లోని నెర్రపల్లి గ్రామంలో విజయవంతంగా నింగికి ఎగసింది. ఎస్‌ఐఎన్‌ఎస్‌ఎంఈ ఫౌండేషన్‌, అంతరిక్ష ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రయోగం, దేశంలోనే పాఠశాల విద్యార్థులు చేపట్టిన మొట్టమొదటి ‘కే-క్లాస్‌’ మోటార్‌ రాకెట్‌ ప్రయోగంగా రికార్డు సృష్టించింది.
లక్ష్యానికి రెట్టింపు దూరం..
ఈ మిషన్‌ ఆద్యంతం అత్యంత పకడ్బందీగా సాగింది. నిర్వాహకులు తొలుత 1 కిలోమీటరు ఎత్తును లక్ష్యంగా పెట్టుకోగా విద్యార్థుల అద్భుత ఇంజినీరింగ్‌ సత్తా చాటుతూ రాకెట్‌ ఏకంగా 2.8 కిలోమీటర్ల ఎత్తుకు దూసుకెళ్లింది. ప్రయోగం అనంతరం ‘డ్యూయల్‌ పారాచూట్‌ డిప్లారుమెంట్‌’ వ్యవస్థ విజయవంతంగా పనిచేయడంతో రాకెట్‌ సురక్షితంగా భూమికి చేరింది. హైదరాబాద్‌లోని ‘సార్థకి’ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థుల బృందం ఈ రాకెట్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది.
వైజ్ఞానిక పండుగలా ప్రయోగ వేదిక
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు నెర్రపల్లి పరిసర ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. ప్రయోగ స్థలి వద్ద వివిధ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 30కి పైగా సైన్స్‌ ప్రాజెక్టులను సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. రాకెట్‌ ప్రయోగానికి ముందు విద్యార్థులు నిర్వహించిన డ్యాన్స్‌లు, నాటికలు, సంగీత ప్రదర్శనలు అందరినీ అలరించాయి. రాకెట్‌ నింగిలోకి ఎగరగానే విద్యార్థుల కేరింతలు, చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది.
తదుపరి లక్ష్యం.. చెన్నై తీరాన 10 కిలోమీటర్లు
ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని ఎస్‌ఐఎన్‌ఎస్‌ఎంఈ ఫౌండేషన్‌ ప్రతినిధి ఇషాంత్‌ దూబే వెల్లడించారు. 5 కిలోమీటర్ల ఎత్తు లక్ష్యంగా తదుపరి ప్రయోగం ఈ ఏడాది అక్టోబర్‌లో ఉంటుందని వెల్లడించారు. అటుపై 8 కి.మీ, చివరగా తమిళనాడులోని చెన్నై తీరంలో 10 కిలోమీటర్ల ఎత్తుకు రాకెట్‌ను ప్రయోగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 10,000 మంది విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానాన్ని, ఎండ్‌-టు-ఎండ్‌ రాకెట్‌ ఇంజనీరింగ్‌ను చేరువ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి అంతరిక్ష యోధులని చాటిచెప్పిన ఈ ప్రయోగంపై విద్యావేత్తలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -