టూరిస్టులు పెరిగేలా ప్రణాళికలు
అధునాతన బోట్లు అందుబాటులోకి :పర్యాటక శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక, సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలోను ఇప్పటికే చేపట్టిన, ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. సోమవారం హిమాయత్‌నగర్‌లోని పర్యాటక అభివద్ధి సంస్థ (టీజీటీడీసీ) కార్యాలయంలో టీజీటీడీసీ చైర్మెన్ పటేల్ రమేష్‌రెడ్డితో కలిసి ఆయన పర్యాటకశాఖపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ పర్యాటక ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల ప్రగతి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. అంతేగాక వివిధ పర్యాటక ప్రాజెక్టుల పనులను చేపట్టి ఎప్పటిలోగా పూర్తి చేసే నెలవారీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో రూ. 274.93 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల పురోగతిని జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుత పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్ ల తయారీ, నూతన కాటేజీల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన స్వదేశీ దర్శన్, ప్రసాద్, సాస్కీ, సీడీబీడీ ద్వారా చేపట్టిన పనులు- నిధుల విడుదల, ఆరు ప్రత్యేక పర్యాటక ప్రాంతాల (ఎస్‌టీఏలు- ఆధ్యాత్మికం, వారసత్వం, ఎకో-వెల్నెస్, హస్తకళలు, జల, బౌద్ధ సర్క్యూట్ల) కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, నాగార్జునసాగర్, రామప్ప-వరంగల్, యాదగిరిగుట్ట-పోచంపల్లి, సోమశిల-ఆలంపూర్ ప్రాంతాలకు సంబంధిం చిన డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్, కొత్త బోటింగ్ యూనిట్ల ప్రతిపాదనలు, గిరిజన పర్యాటకం, హరిత హోటళ్ల నిర్వహణ- మరమ్మత్తులు, హౌస్ బోట్లు, కల్చరల్ టూరిజం, రవాణా సౌకర్యం, మౌలిక వసతుల కల్పన, తదితర అంశాలపై మంత్రి జూపల్లి అధికారులతో చర్చించారు.
రామప్ప ఆలయ సమీపంలోని అనువైన ప్రాంతాల్లో అదనపు కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అవసరమైన చోట సాంప్రదాయ బోట్‌ల స్థానంలో ఆధునాతన బోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలనీ, సోమ శిలలో అదనపు బోటును కూడా అందు బాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎత్తయిన ప్రాంతాల్లో, అనువైన వాటర్ బాడీల వద్ద రష్యా, చైనా వంటి దేశాల్లో ఉన్న క్యాంటీ లివర్ వ్యూ పాయింట్స్ (గ్లాస్ స్ట్రక్చర్స్) ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.
వారసత్వ సంపదను సంరక్షించడంతో పాటు పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. తద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగి ఆదాయం సమకూ రుతుందని గుర్తు చేశారు. చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం అవసరమై తే పర్యాటక శాఖ నుంచి నిధులు మంజూరు అయ్యేలా చూస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన పలు పర్యాటక ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులను సైతం సకాలంలో పనులు చేపట్టి నిర్ధిష్ట గడువు ప్రకారం పూర్తి చేసి ప్రజలకు ముఖ్యంగా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆయా పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర పర్యాటక రంగ అభివద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని, విస్త్రృత ప్రచారం కల్పించి మరింత అభివద్ధి పథంలో తీసుకెళ్లాలని మంత్రి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతూ, పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూల వాతావరణం సష్టించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించేందుకు హంపీ థియేటర్లు నిర్మించాలనీ, తద్వారా స్థానిక కళాకారులకు జీవనోపాధి లభిస్తుందని చెప్పారు. ఈ సమీక్షలో టీజీటీడీసీ ఛైర్మెన్ పటేల్ రమేష్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, ఎండీ గౌతమి, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.
బోటింగ్ యూనిట్ ప్రతిపాదనలు
1. ఇన్యధ్రమ్మ చెరువు, బుచ్చిరెడ్డిపాలెం మధిర ఖమ్మం
2. వైరా చెరువు, వైరా, ఖమ్మం
3. పాలేరు చెరువు, ఖమ్మం
4. పర్ణశాల, భద్రాచలం, ఖమ్మం
5. బోరంచ, మెదక్
6. గుడి చెరువు, సిరిసిల్ల
7. కోకాపేట చెరువు, కోకాపేట, రంగారెడ్డి
8. కొండపోచమ్మ సాగర్, తుర్కపల్లి, సిద్దిపేట
9. దౌలతాబాద్, కోడంగల్, వికారాబాద్
10. నల్లచెరువు, కూకట్‌పల్లి, హైదరాబాద్
11. ప్రగతినగర్, కూకట్‌పల్లి, హైదరాబాద్
12. శామీర్‌పేట హైదరాబాద్




