ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
విద్యా కమిషన్ నెంబర్ చారకొండ వెంకటేష్
నవతెలంగాణ – మిడ్జిల్
మిడ్జిల్ మండల కేంద్రంలో నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా కమిటీ మెంబర్ చారకొండ వెంకటేష్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు అనుభవాగ్నులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య ప్రభుత్వం అందిస్తుందని, విద్యా బలోపేతానికి ప్రజా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించలేదని అన్నారు. పాఠశాలకు గేటుకు తాళం వేయడంతో పత్రికల్లో వార్తలు రావడంతో సీఎంఓ ఆదేశాల మేరకు.. ఉపాధ్యాయుల పనితీరుపై, మధ్యాహ్న భోజనం, పాఠశాలలో ఉన్న సమస్యలపై విద్యార్థుల నుండి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడ కూడా విద్యా కమిషన్ లేదని, తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో ఉన్న సమస్యలను, ఉపాధ్యాయుల పనితీరుపై విద్యా కమిటీ పని చేస్తుందని చెప్పారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చేది ఉపాధ్యాయులేనని, ఉపాధ్యాయులే సరిగా లేకుంటే విద్యార్థులను ఎలా క్రమశిక్షణ ఉంటారని ప్రశ్నించారు.
ప్రభుత్వ అందించిన మెనూ ప్రకారంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ అయితే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న సమస్యలు అర్థం చేసుకుంటారని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో పెండింగ్ లో ఉన్న పనులకు నిధులు మంజూరు చేస్తామని వెంటనే పనులు ప్రారంభించాలని సర్పంచ్ శంకర్ కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు బాలయ్య, బుచ్చయ్య, విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



