– విద్యార్థినికి తానే స్వయంగా షూ తొడిగించి లేస్ కట్టిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం కౌలాస్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో నిర్వహించిన విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీమణి తోట అర్చన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు అవసరమైన షూస్‌ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తానే స్వయంగా విద్యార్థినికి షూ తొడిగించి లేస్ కట్టి అందరి హృదయాలను గెలుచుకొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని అన్నారు. చిన్నపిల్లల అవసరాలను గుర్తించి వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం విద్యతో పాటు పిల్లల మౌలిక అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని తెలిపారు. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూసి స్థానికులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.



