నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని ఏఐ సమ్మిట్ ప్రాంగణం ఎదుట యూత్ కాంగ్రెస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. పీఎం మోడీ రాజీపడ్డారని నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలిస్ సిబ్బంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పీఎస్‌కు తరలించారు. యూఎస్ ట్రేడ్ ఒప్పందంలో బీజేపీ తీరును నిరసిస్తూ మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాహుల్ గాంధీయే ఈ ఆందోళలను ప్రేరేపించారని ఆరోపించగా, ఏఐ సమ్మిట్‌లో అనేక లోటుపాటులు ఉన్నాయని, ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు బీజేపీ ప్రభుత్వం తీస్తుందని మండిపడ్డాయి.
కాగా, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ను ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహిస్తోంది. పలు అంతర్జాతీయ ఏఐ, టెక్ కంపెనీలకు చెందిన సీఈవోలు, ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. దేశ, విదేశాలకు చెందిన అతిథులు భారీ సంఖ్యలో వస్తున్నారు. అయితే, సదస్సు నిర్వహణలో అనేక లోపాలు బయటపడ్డాయి. చాలా మంది అతిథులు ఈ అంశంలో నిర్వాహకులపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.
అతిథులకు కలిగిన అసౌకర్యాలపై కేంద్ర మంత్రి కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.
‘‘ఇది ప్రపంచంలోనే తొలి, అతిపెద్ద ఏఐ సదస్సు. దీనికి వస్తున్న స్పందన అద్భుతం. ఇప్పుడు నిర్వహణ చాలా బాగుంది. నిన్న జరిగిన గందరగోళానికి క్షమాపణలు. ఇంకా ఎవరైనా, ఏదైనా సమస్య ఎదుర్కొంటే నిరభ్యంతరంగా చెప్పొచ్చు. మీరు సదస్సును మరింత ఎక్కువ ఆస్వాదించేలా చర్యలు తీసుకుంటున్నాం. నిన్నటి నుంచి వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశాం. రాత్రి పగలు కష్టపడుతున్నాం’’ అని అశ్విని వైష్ణవ్ చెప్పారు.



