Monday, June 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్యూబా మాజీ ఉప ప్రధానమంత్రి రామిరో వాల్డెస్ కన్నుమూత

క్యూబా మాజీ ఉప ప్రధానమంత్రి రామిరో వాల్డెస్ కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : క్యూబా విప్లవ యోధులలో ఒకరైన, మాజీ ఉప ప్రధానమంత్రి రామిరో వాల్డెస్ మెనెండెజ్ (94) ఆదివారం రాత్రి హవానాలో కన్నుమూశారు. రామిరో వాల్డెస్ క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఈయన దీర్ఘకాలం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. అంతేకాదు క్యూబన్ గూఢచార వ్యవస్థ వ్యవస్థాపకుడు. నియంత ఫుల్హెన్సియో బాటిస్టా పాలనను కూలదోసిన విప్లవ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు.

విప్లవ నాయకులు ఫిడెల్ కాస్ట్రో, రౌల్ కాస్ట్రో, చే గెవారాలతో కలిసి గ్రాన్మా నౌకలో ప్రయాణించిన యోధులలో ఒకరు. అనంతరం శాంటా క్లారా యుద్ధంలో చే గెవారాతో భుజం భుజం కలిపి పోరాడారు. చే గెవారా నేతృత్వంలోని గెరిల్లా విభాగంలో రెండో కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అమెరికా మద్దతుతో జరిగిన కుట్రలు, దాడి ప్రయత్నాలను ఎదుర్కొనే క్రమంలో దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన విశేష కృషి చేశారు. ఫిడెల్ కాస్ట్రో, రౌల్ కాస్ట్రో ప్రభుత్వాల్లో వివిధ కీలక పదవులు చేపట్టారు. రెండుసార్లు అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఆయన, అనంతరం ఉప ప్రధానమంత్రిగా కూడా సేవలందించారు.

1932 ఏప్రిల్ 28న ఆర్టెమిసా ప్రాంతంలోని పేద కుటుంబంలో జన్మించిన రామిరో వాల్డెస్, ప్రజా సేవా జీవితంలో దాదాపు ఏడు దశాబ్దాలపాటు చురుకుగా కొనసాగారు. 2010లో వెనిజులా ఇంధన రంగానికి ప్రధాన సలహాదారుగా కూడా పనిచేశారు. 2021లో పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసి, పదవీ విరమణ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేసిన క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ డియాజ్-కానెల్, రామిరో వాల్డెస్ జీవితం మొత్తం విప్లవ ఆదర్శాలకు, దేశ నాయకత్వానికి, సహచరులకు అంకితమైందని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -