Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపోరాట స్ఫూర్తికి ప్రతిరూపం సారంపల్లి: ఎమ్మెల్యే కడియం

పోరాట స్ఫూర్తికి ప్రతిరూపం సారంపల్లి: ఎమ్మెల్యే కడియం

- Advertisement -

నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ 
రైతాంగ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన సారంపల్లి మల్లారెడ్డి మృతి దేశ రైతాంగ ఉద్యమానికి, సీపీఐ(ఎం)పార్టీకి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు తీరని లోటని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడిగా, సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడిగా రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలపై మల్లారెడ్డి నిరంతరం పోరాడారని కొనియాడారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సీపీఐ(ఎం) కార్యాలయం ఎంబీ భవన్‌లో సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయానికి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డితో కలిసి కడియం శ్రీహరి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం మల్లారెడ్డి జీవితాంతం నిబద్ధతతో పనిచేశారని అన్నారు. అఖిల భారత కిసాన్ సభ నాయకుడిగా, కమ్యూనిస్టు ఉద్యమ నేతగా రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన ఆయన ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

“1987లో నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి నాకు వెన్నంటే నిలబడి అన్ని విధాలుగా ప్రోత్సహించిన వారిలో సారంపల్లి మల్లారెడ్డి అత్యంత ప్రథముడు. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ప్రతి పోరాటంలో నన్ను ముందువరుసలో నిలబెట్టి కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ నా రాజకీయ ఎదుగుదలకు ఎంతో సహకరించారు” అని కడియం శ్రీహరి తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి వంటి గొప్ప ప్రజా ఉద్యమ నాయకుడిని కోల్పోవడం వ్యక్తిగతంగా తనకు కూడా తీవ్ర విషాదమని అన్నారు. ఆయన మరణం భారత రైతాంగ ఉద్యమానికి, సీపీఐ(ఎం) పార్టీకి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు పూడ్చలేని నష్టమని పేర్కొన్నారు. మల్లారెడ్డి ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సారంపల్లి మల్లారెడ్డికి సీపీఐ(ఎం) నేతల ఘన నివాళి
సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, రైతు ఉద్యమ నేత కామ్రేడ్‌ సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయానికి స్టేషన్‌ఘనపూర్‌ మండల సీపీఐ(ఎం) నాయకులు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు ఇర్రి అహల్య, మండల కార్యదర్శి మునిగెల రమేష్‌ మాట్లాడుతూ.. రైతులు, కార్మికులు, పేదల హక్కుల కోసం సారంపల్లి మల్లారెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్రను సీపీఐ(ఎం) ఎప్పటికీ మరువదన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తోడెంగల ఐలయ్య, రంగరాయిగూడెం ఉపసర్పంచ్‌ మునిగే నర్సింహులు, మంద మహేందర్‌, కత్తుల రాజు, నాయకులు వంగపండ్ల సోమయ్య, జిల్లపల్లి కొమురయ్య, ఉప్పలయ్య, గొడిశాల యాదగిరి, రైతు సంఘం నాయకులు లింగనబోయిన కుమార్‌, మంద మొగిలి,  ఉప్పలయ్య, ఇప్పగూడెం మాజీ ఉపసర్పంచ్‌  గొడిశాల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -