ఖాళీ చేయండి..లేకపోతే చట్టపరమైన చర్యలుంటారు
రేస్ కోర్స్ రోడ్డులోని 700 కుటుంబాలకు కేంద్రం హుకుం
పునరావాసంపై స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో ఆందోళన
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో పీఎం నూతన నివాస నిర్మాణం.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి వాడల్లో నివాసముంటున్న కుటుంబాలపై పడింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారిని ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు పంపింది. అక్కడి నుంచి ఖాళీ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దాదాపు 700 కుటుంబాలకు ఈ నోటీసులు అందాయని తెలుస్తున్నది. అయితే కచ్చితమైన గడువు తేదీని పేర్కొనకపోవడం, పునరావాసంపై ఎలాంటి స్పష్టతా లేకపోవడంతో అక్కడి స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రధాని నూతన నివాసం నిర్మాణం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నోటీసులు వచ్చినట్టు అంతా భావిస్తున్నారు.
రేస్‌కోర్స్ రోడ్ వెంట ఉన్న భాయిరామ్ క్యాంప్, మస్జీద్ క్యాంప్, డీఐడీ క్యాంప్ నివాసితులకు ఈ నోటీసులు అందినట్టు సమాచారం. నోటీసులో ఆ భూమిని ప్రభుత్వానికి చెందినదనీ, ఇకపై అక్కడ నివసించడం అనధికారికంగా పరిగణించబడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆదేశాలను పాటించకపోతే చట్ట ప్రకారం అక్కడి నుంచి తొలగింపు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భద్రతా కారణాలే దీనికి కారణమై ఉండొచ్చని తెలుస్తున్నది. రేస్‌కోర్స్ రోడ్ పరిసరాల్లో ప్రధాని అధికారిక నూతన నివాసం నిర్మాణంలో ఉండటంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారనీ, ఇందులో భాగంగానే ఈ నోటీసులని అంతా భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
రేస్ కోర్స్ రోడ్ ప్రాంతం అత్యంత సున్నితమైన భద్రతా జోన్‌గా పరిగణిస్తారు. గతంలోనూ ఇక్కడ ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నోటీసుతో అక్కడి స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. చాలా మంది ఏండ్లుగా అక్కడ నివసిస్తూ సమీప ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. ఖాళీ చేయాల్సిన గడువు, పునరావాసం, ప్రత్యామ్నాయాలపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదని వారు అంటున్నారు. కాగా వారు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదించి.. పునరావాసంపై స్పష్టత కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ చర్యలు రాజధాని సెంట్రల్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే విస్తృత ప్రణాళికలో భాగమని అధికారిక వర్గాలు చెప్తున్నాయి.



