Monday, February 23, 2026
E-PAPER
Homeదర్వాజచీకటిని చీల్చే వెలుగు కొరకు

చీకటిని చీల్చే వెలుగు కొరకు

- Advertisement -

ఎండుటాకుల పూరిగుడిసెల మీద,
ఆకాశాన్నంటే అద్దాల మేడల మీద,
అంటరాని పిచ్చి మొక్కల పువ్వులమీద,
మందార, సుగంధాల, మల్లెలమీద,
మనస్సులేని ముళ్ళకంచెల వికత నవ్వుల మీద,
అనాథల సమాధుల మీద
అందాల్ని ఆరేసుకున్న పూదోటలమీద,
ఉదయాన్నే ఉదతంగా ప్రవహించే మూసి మురుగుమీద,
దేశంలోని దౌర్భాగ్యాల్ని ముందేసుకుని
తన్నుకునే ఊరి అరుగుమీద,
అందరూ చూస్తుండగానే జరిగిన అత్యాచారాల మీద,
నెత్తుటి మరకలంటని రాజకీయ హంతకుల మీద,
బంజారాహిల్స్‌ రోడ్డుమీద రాత్రి పగిలిన
కాస్ట్లీ మందు సీసా ముక్కల మీద,
ఉస్మానియా మార్చురిలో గుర్తుతెలియని
శవం చెప్పే సాక్ష్యాలమీద,
తళతళ మెరిసే కార్మికుని చెమటచుక్కల ముత్యాల మీద,
పూటపూటకు దహించే పేదోడి కడుపుల్లో
ఆకలిమంటల మీద,
అధికార, ఆదిపత్యపు, అబద్ధాలతో దద్దరిల్లే అసెంబ్లీ మీద,
రాజ్యాంగాన్ని నిత్యం కాలరాస్తున్న నూతన పార్లమెంటు మీద,
ఎవ్వరి కంటికి చిక్కకుండా, చీకటిని పులుముకుని
పవిత్రతను కప్పుకొని రహస్య ఒప్పందాల్ని చేసుకుంటున్న
నకిలీలోకం సాగిస్తున్న అరాచకాల్ని వెలుగెత్తి చూపడానికి,
తేటతెల్లం చేయడానికి తొందరగా రా…
రాత్రి జరిగిన అగాయిత్యాల్ని మోసుకొచ్చే
వార్తా పత్రికల కంటే ముందే,
ఆర్‌.టి.సి. బస్సుకు ప్రజలు
అయస్కాంతంలా చుట్టూ అతుక్కోక ముందే,
ట్రాఫిక్‌ చలాన్లను పోలీసులింకా జులిపించక ముందే,
రా… వచ్చి,
నిన్నటి గతాన్ని మైమరచి అస్తవ్యస్తంగా మొరుగుతున్న
గురకల నుండి విముక్తిని కలిగించు,
నిద్ర శిధిలాల్ని తొలగించు,
మా ఎముకల్లో గడ్డకట్టిన మబ్బు తెరల్ని
ఈ ఉదయపు ఎండలో ఎండగట్టు
వెంకటేష్‌ విశ్వ, 9553762108

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -