Tuesday, February 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'దేవాదుల' సాగదీత

‘దేవాదుల’ సాగదీత

- Advertisement -

భూ సేకరణే అసలు సమస్య..
2011 నుంచి నత్తనడక
2,136 ఎకరాలకు రూ.600 కోట్లు..
బీఆర్‌ఎస్‌ హయాంలోనూ ముందుకుసాగని వైనం
రూ.18,500 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
ఈసారైనా ముందుకు సాగేనా?


నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజనకు ముందు పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్ల బీఆర్‌ఎస్‌ హయాంలోనూ ముందుకు సాగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేం పూర్తిచేస్తామని అంటోంది. గడువు కూడా విధించింది. డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారనేది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా భూసేకరణ సకాలంలో పూర్తి కాకపోవడమే దేవాదుల ప్రాజెక్టుకు అడ్డంకిగా మారింది. తొలుత ఈ ప్రాజెక్టును రూ.6 వేల కోట్లతో చేపట్టగా, తాజాగా రూ.18,500 కోట్లకు అంచనా వ్యయానికి పెరగడం గమనార్హం. 2011లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు భూ సేకరణలో జరుగుతున్న జాప్యంతో ఈ 15 ఏండ్లు అయినా పూర్తికాలేదు. దాంతో ఏటేటా అంచనా వ్యయం తడిసిమోపడవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును రెండేండ్లలో పూర్తి చేస్తామని తొలుత ప్రకటించినా, పూర్తి చేయలేకపోయారు.

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి 2027 మార్చిలోపు పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. దేవాదుల ప్రాజెక్టు రెండో దశలో 786 ఎకరాలు, మూడో దశలో 1,350 ఎకరాలు మొత్తంగా 2,136 ఎకరాల భూమిని సేకరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ భూమిని సేకరించి ప్రాజెక్టు అధికారులకు అప్పగించకపోవడంతో గుత్తేదారులు సకాలంలో పనులను పూర్తి చేయలేకపోతున్నారు. మొదటి దశ పనులు ఎప్పుడో పూర్తయినా నేటికీ మరో 22 ఎకరాల భూ సేకరణ పూర్తి కాలేదు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో జనగామ జిల్లాలోని చీటకోడూరు రిజర్వాయర్‌ సమీపంలో పలువురు రైతులు కోర్టునాశ్రయించడంతో ఇక్కడ పనులు నిలిచిపోయాయి. 2001 నాటితో పోల్చితే నేడు భూముల ధరలు భారీగా పెరగడంతో భూములు కోల్పోతున్న రైతులు నష్టపరిహారాన్ని భారీగా డిమాండ్‌ చేస్తున్నారు.

2,136 ఎకరాలు పెండింగ్‌
దేవాదుల ప్రాజెక్టు రెండో దశ, మూడో దశ పనులు జరగాలంటే 2,136 ఎకరాల భూ సేకరణ అధికారులు పూర్తి చేయాల్సి ఉంది. దేవాదుల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.14,359 కోట్లను ఖర్చు చేశారు. కేవలం భూ సేకరణకు ఇప్పటి వరకు రూ.1,292 కోట్లు ఖర్చయ్యాయి. ప్రాజెక్టును పూర్తి చేయాలంటే మరో రూ.4,502 కోట్లు అవసరం కానున్నాయి.

పెండింగ్‌లో 2.38 లక్షల ఎకరాల సాగు
దేవాదుల ప్రాజెక్టు కింద రూ.5.56 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉండగా, మూడు దశల్లో 3.17 లక్షల ఎకరాలకు (57 శాతం) మాత్రమే సాగు నీరందించారు. మరో 2.38 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.

రూ.153 కోట్ల బిల్లులు పెండింగ్‌
దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో పలు పనులు పూర్తయినా రూ.153 కోట్ల బిల్లులు విడుదల కాలేదు. మూడో దశలో రెండో ప్యాకేజీలో రూ.35 కోట్లు, నాలుగో ప్యాకేజీలో రూ.30 కోట్లు, ఆరో ప్యాకేజీలో రూ.24.86 కోట్లు, 8వ ప్యాకేజీలో రూ.13 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -