Sunday, June 28, 2026
E-PAPER
Homeసోపతిపెద్దల తప్పులకు పిల్లలు బలి!

పెద్దల తప్పులకు పిల్లలు బలి!

- Advertisement -

జుట్టుపోలుగాడు : మావా కేతిగా మా పోరగాన్ని సి.ఎం. రేవంత్‌రెడ్డి స్కూల్లో జేర్చినా. ఇక నాకు బెంగలేదు. ఫుడ్‌, బెడ్‌, బుక్స్‌, యూనిఫామ్స్‌ అన్ని అక్కడే.
కేతాగాడు : ముఖ్యమంత్రి స్కూలా.. అదేందిరా.
జుట్టుపోలుగాడు : నీకింకా తెల్వదా ఏంది. దానిపేరే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌. నియోజకవర్గానికి ఒకటి. ఒక్కో స్కూల్‌కు 200 కోట్ల బడ్జెట్‌. ఇక చూస్కో నా సామిరంగా… 119 నియోజకవర్గాల్లో అలాంటి సూల్స్‌లో పిల్లలు చదువుకుంటే ఆ పిల్లల భవిష్యత్తే మారిపోద్ది.
కేతిగాడు : ముఖ్యమంత్రి అంటే అన్ని స్కూల్స్‌కు ముఖ్యమంత్రిగాని కొన్ని స్కూల్స్‌కే ముఖ్యమంత్రి అంటే ఎలా..?
జుట్టుపోలుగాడు: నీతో ఇదే గొడవ. ఏ ముఖ్యమంత్రి చేయని పని మన ముఖ్యమంత్రి చేస్తుంటే, మెచ్చుకోవడం మాని ప్రశ్నిస్తావేంది?
కేతిగాడు : చదువు అందరికీ సమానంగా దక్కాలి కదా .
జుట్టుపోలుగాడు: అదేరా నేను అనేది. కార్పొరేట్‌ విద్యకు ధీటుగా ఇలాంటి స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తుంటే పొగడవేంది. కుల మతాలకు అతీతంగా, పేదా – ధనికా బేధం లేకుంగా అందరూ సమానంగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతోనే సి.ఎం. ఈ స్కూల్స్‌ను ఏర్పాటు చెస్తున్నారు. నీవేమన్నా అనుకో.. నాకు మాత్రం ఇదో గొప్ప ముందడుగు. అందరూ కలసి ఆటపాటలతో ఎలాంటి వత్తిడి లేకుండా చదువుకోవడం ఎంత అదృష్టం. మా పోరగాడికి అది దక్కింది.
కేతిగాడు : నీవే అంటున్నావ్‌ అది అదష్టం అని. ఆ అదృష్టం ప్రతి కష్టజీవి బిడ్డకు దక్కాలనేది నేనంటున్నా. అందరూ సమాన అవకాశాలతో చదువుకోవటం బాలల అభివద్ది హక్కులో భాగం. పైగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఆ పని చేస్తున్నాయిగా.. మొదట్లో అన్ని బాగానే ఉంటాయి. తర్యాత తర్వాతే ప్రమాణాలు తప్పి సర్వసాధారమై పోతాయి.
జుట్టుపోలుగాడు : అయితే ఏంటట. సాంఘిక సంక్షేమశాఖ, ఎస్‌.సి, ఎస్‌.టి, గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదువు కుంటున్నప్పుడు మళ్లీ వాళ్ళ కులాల అడ్డుగోడలు, ఆ సామాజిక అంతరాలు అలానే నిలిచిపోతున్నాయి కదా.. అవన్నీ పోవాలనే సీ.ఎం రేవంత్‌ రెడ్డి ఇలాంటి స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నాడు. నీవెన్నయినా చెప్పు. కామన్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమే అన్నిటికన్నా ఉత్తమం.
కేతిగాడు : నిజమే మనుషులందరూ సమానమే అన్న భావన పిల్లల్లో చిన్నప్పటి నుండే కలగడం ఎంతో మంచిది. కానీ ఆ పేరుతో కొంతమందికే న్యాయం జరగడం, మిగతా పిల్లలు అన్యాయం కావడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఈ కారణాన వేలాది స్కూల్స్‌ మూతపడటం, పిల్లలు బడి చదువుకు దూరం కావడాన్ని నేను సమర్థించలేను:
జుట్టుపోలుగాడు : ఎవరు సమర్ధించమన్నారు. బడులు, ఉపాధ్యాయులు ఉన్నా, పిల్లలు హాజరుకాకపోవడాన్ని ఏమనాలి మరి? కూలినాలి చేసుకునే పేద తల్లితండ్రులు సైతం తమ పిల్లల్ని కాన్వెంట్‌ స్కూల్‌కే పంపిస్తున్నారు తెల్సా.
కేతిగాడు : కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్టు, సర్కారు బడులు కుంటుబడటానికి అనేక కారణాలు. కార్పోరేట్‌ విద్యాసంస్థలు కల్పించే ఆశలు మోసాలు ఒకటైతే, సౌకర్యాల కొరత, కొందరి ఉపాధ్యాయుల అసమర్ధత మరొకటి. అటు ప్రైవేటు విద్యాసంస్థల లాభాల దోపిడీని కట్టడి చేయలేక, ఇటు సర్కార్‌ బడుల్లో జరిగే అవినీతిని, నిర్లక్ష్యాన్ని అడ్డుకోలేక ప్రభుత్వం చతికిలబడుతున్నది.
బంగారక్క: ”ఏది ఏమైనా అంతిమంగా నష్టపోతున్నది పాపం పసికూనలైన మన పిల్లలేకదా.. పెద్దలుగా మనం చేస్తున్న తప్పులకు పిల్లలు బలైపోతున్నారు. ఇక్కడ జరుగుతున్నంత దారుణంగా ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ బడి చదువులు దెబ్బతినడం లేదు. సొంతంగా రాయడం రానివాళ్లు పదవ తరగతిలో పట్టుమని పదిశాతం మంది కూడా లేకపోవడం ఎంతటి వినాశకరం? ఈ పైన పటారం లోన లొటారం చదువులకు అందరం బాద్యులమే. అమెరికా బాగా డబ్బున్న పెట్టుబడిదారీ దేశం. అయినా అక్కడ 90 శాతం మంది పిల్లలు ప్రభుత్వ బడుల్లోనే చదువుతున్నారు. ఎక్కడైనా విద్యాబోధన స్వేచ్ఛగా సాగాలి. అప్పుడే అజ్ఞానం,మూఢత్వం పటా పంచలవుతుంది. స్థిరమైన వ్యక్తిత్వంతో దుర్మార్గాలను ప్రశ్నించేతత్వం అలవడుతుంది. మన తెలంగాణలో 40 శాతం మంది మాత్రమే సర్కారు బడుల్లో చదువుతున్నారు. అదీ అరకొర చదువులతో. పేదరికం వలన, దురాచారాల వలన డ్రాపౌట్స్‌ పెరుగుతున్నారు. విలువలతో కూడిన విద్యే నిజమైన విద్య అని అంబేద్కర్‌ చెప్పాడు. సత్యాన్వేషణ, శ్రమ గౌరవం, మానవత్వం, సమానత్వం, ప్రజాస్వామ్యం విలువలు పాటించేలా నాణ్యమైన విద్యాబోధన సాగాలి. అప్పుడు మాత్రమే మన పిల్లలకు మనం న్యాయం చేయగలం.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -