Sunday, June 28, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్శ్రవణానందకార స్వరం

శ్రవణానందకార స్వరం

- Advertisement -

”భయం మనల్ని ఆపవచ్చు, కానీ మనలో ఉన్న ప్రతిభకు సంకల్పం తోడైతే ఆ భయమే పలాయనం చిత్తగిస్తుంది” ఈ మాటలకు సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లాకు చెందిన బరిగెల శ్రవణ్‌ కుమార్‌ జీవితం. చండూరు మండలం కొండాపురం అనే ఒక చిన్న గ్రామం నుంచి మొదలైన ఆయన ప్రయాణం.. భయాన్ని దాటి, స్వరాలను మీటి, సాహితీ శిఖరాలను అధిరోహించిన యువకుడి అద్భుతమైన ప్రయాణం. ఒక పల్లెటూరి యువకుడు తనలోని గాన కళను ఎలా ఆవిష్కరించుకున్నాడు, అక్షరాలతో ఎలా అనుబంధాన్ని పెంచుకున్నాడు అనే ఆసక్తికరమైన అతని విజయ ప్రస్థానం ఈ వారం జోష్‌ …

కొండాపురం గ్రామంలోని పచ్చని పొలాల మధ్య, బాబాయి మోహన్‌ దాస్‌ వెంట బాయి దగ్గరికి కాలక్షేపంగా వెళ్తున్నప్పుడు శ్రవణ్‌ కుమార్‌ హదయంలో సంగీత బీజాలు పడ్డాయి. బాబాయి చిన్నగా పాడుకునే పాటలను మనసులోనే అనుసరిస్తూ, ఆయన నేర్పిన ఒకటి రెండు పాటలతో శ్రవణ్‌ తనలో తానే పాడుకోవడం మొదలుపెట్టాడు. గుండెల్లో లయ ఉంది, గొంతులో మధురం ఉంది, కానీ స్కూలు వేదికపైకి ఎక్కాలంటే ఏదో తెలియని భయం. ఆ భయపు గోడలను బద్దలు కొట్టింది అతని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మ టీచర్‌. ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఆమె అందరితో పాటు శ్రవణ్‌ను కూడా పాడమన్నారు. కాళ్లు వణుకుతున్నా, గుండె వేగంగా కొట్టుకుంటున్నా తొలిసారిగా గొంతు విప్పాడు. ఆ వణుకుతున్న అడుగులే ఈరోజు ఆయనను వందలాది వేదికలపై సగర్వంగా నిలబెట్టాయి. అదే ఆరో తరగతిలో ఉండగా స్కూల్‌ కార్యక్రమానికి వచ్చిన చండూరు ఎంఈవో ముందు ‘ఏడావున్నావో నవ్వుల నా ఎంకి’ అంటూ శ్రవణ్‌ పాడిన పాటకు ఆ అధికారి ముగ్ధులయ్యారు. జేబులో ఉన్న పెన్ను తీసి బహుమతిగా ఇస్తూ శ్రవణ్‌ వీపు తట్టారు. ఆ పెన్ను కేవలం బహుమతి కాదు, శ్రవణ్‌ భవిష్యత్తును తిరగరాయబోయే అక్షరాయుధానికి తొలి నాంది.

అందివచ్చిన అవకాశాలు
అక్కడి నుంచి శ్రవణ్‌ వెనుదిరిగి చూసుకోలేదు. పాఠశాల, కళాశాల స్థాయిల్లో ఎన్నో బహుమతులు వరించాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఉండగా లెజెండ్‌ జె.కె ఏసుదాసు పుట్టినరోజు సందర్భంగా దేవరగిరి వ¶్యజిక్‌ అకాడెమి నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించి, స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్‌, ప్రముఖ రచయిత్రి బండారు సుజాతా శేఖర్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. వికారాబాద్‌లో డి.ఎడ్‌ చదువుతున్నప్పుడు పాటల పోటీల్లో తన స్వర సుధతో ప్రశంసా పత్రాలు సాధించారు.

పాడుతా తీయగా
2012లో ప్రతిష్టాత్మక ‘పాడుతా తీయగా’ సెలెక్షన్స్‌లో చివరి దశ వరకు వెళ్లడం, ఫోక్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ విష్ణు కిశోర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎంపిక కావడం ఆయన ప్రతిభకు మచ్చుతునకలు. ఓటములు ఎదురైనా, కొన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగినా శ్రవణ్‌ లోని కళాకారుడు నిరాశ చెందలేదు. జాతీయ ఉత్తమ సినీ విమర్శక అవార్డు గ్రహీత డా.ముడుంబై పురుషోత్తమాచార్య నల్లగొండలో నిర్వహించిన అన్నమయ్య కీర్తనల ఆలాపన 500ల కార్యక్రమంలో పాల్గొని పూర్వపు కలెక్టర్‌ ముక్తకేశ్వర రావు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఇది మరో మైలురాయి.

అక్షర శిల్పిగా… గాయకుడిగా..
సజన సాహితీ, ఉనికి సామాజిక సాంస్కతిక వేదికల సభలంటే ఇప్పుడు శ్రవణ్‌ పాట ఉండాల్సిందే. నల్లగొండ ఎన్జీ కళాశాలలో పీజీ చదువుతున్నప్పుడు, ప్రజాకవి కాళోజీ జయంతి సభలో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ గేయరచయిత డా. సుద్దాల అశోక్‌ తేజ ముందే ఆయన రాసిన పాటను పాడి, ఆయన నుంచి ప్రశంసలు అందుకోవడం శ్రవణ్‌ జీవితంలో మరువలేని ఘట్టం. కేవలం పాటలే కాదు, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో జరిగిన ఉగాది కవి సమ్మేళనంలో మహాకవి గుర్రం జాషువా పద్యాలను విరివిగా పాడుతూ, శాలువాల సన్మానాలు అందుకుంటూ పద్యగానంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. డా.ఏనుగు నర్సింహారెడ్డి (ఐఏఎస్‌) వంటి ఎందరో ప్రముఖ సాహితీవేత్తల అభినందనలు శ్రవణ్‌కు లభించాయి.

బంగారు పతకం నుంచి పుస్తక సజన వైపు..
తెలుగు భాషపై ఉన్న అమితమైన ప్రేమతో ఎన్జీ కళాశాలలో ఎం.ఏ తెలుగు సాహిత్యం చదివిన శ్రవణ్‌, తన గురువు డా. తండు కష్ణ కౌండిన్య ప్రోత్సాహంతో అక్షర సజన వైపు అడుగులు వేశారు. అమ్రాబాద్‌ అడవుల్లోని చెంచుల జీవితాలపై చేసిన క్షేత్ర పర్యటన ఆధారంగా వచ్చిన ‘అడవిలో అన్వేషణ’ పుస్తకంలో సంపాదకుడిగా వ్యవహరిస్తూ, తన తొలి వ్యాసాన్ని ప్రచురించారు. తుల శ్రీనివాస్‌ గారి ‘చింతల తొవ్వ’, డా.మమ్మద్‌ హసేన ‘నువ్వే ఒక సమూహం’ కవిత్వాలపై ఆయన రాసిన సమీక్షలు డిజిటల్‌ పత్రికల్లో అచ్చై విమర్శకుల ప్రశంసలు పొందాయి. ప్రస్తుతం తన పెద్దనాన్న (పోస్ట్‌మాన్‌) జీవిత చరిత్రను ‘అనుబంధాల వారధి’ పేరుతో పుస్తకరూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.

యువతకు ఆదర్శప్రాయుడు
ఎం.ఏ తెలుగులో గోల్డ్‌ మెడల్‌ సాధించడమే కాకుండా.. పొలిటికల్‌ సైన్స్‌, బి.ఎడ్‌, డి.ఎడ్‌ పూర్తి చేసి, ఇటీవల ప్రతిష్టాత్మక ‘స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌’ క్వాలిఫై అయిన శ్రవణ్‌ కుమార్‌ నేటి యువతకు ఆదర్శప్రాయుడు. ప్రస్తుతం సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌గా ఆన్‌లైన్‌ వర్క్‌ చేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగ సాధనకై శ్రమిస్తున్న అతని లక్ష్యం త్వరలోనే నెరవేరాలని ఆశిద్దాం. భయపడే ప్రతి ఒక్కరికీ శ్రవణ్‌ జీవితం ఒకటే చెబుతోంది.. ”నీలోని కళను నమ్ముకో, వేదిక ఏదైనా విజయం నీదే!”

– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -