హ్యూగో ఛావేజ్ అధ్యక్ష పదవిని చేపట్టిన నాటినుండి వెనిజులా అప్రతిహతంగా అభివృద్ధి పథాన పయనిస్తున్నది. ఇదే క్రమంలో తనదైన రీతిలో ఒక విలక్షణమైన, విశిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థను కూడా నిర్మించుకుంది. నిజానికి అంతకుముందు వెనిజులాలో ప్రజారోగ్య వ్యవస్థ అనేదే లేదు. ఆ దేశంలో డాక్టర్లు ఉన్నప్పటికీ వారు పట్టణ ప్రాంతాలకు, సంపన్నుల నివాస ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేవారు. చావేజ్ ఈ పరిస్థితి మార్చేందుకు పూనుకున్నారు. దీనికి అన్ని విధాల సహకరించింది క్యూబా సోషలిస్ట్ ప్రభుత్వం. క్యూబా, వెనిజులాలు సమగ్ర ఆరోగ్య రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే వేలాది క్యూబా డాక్టర్‌లు నేరుగా వెనిజులా గ్రామీణ ప్రాంతాలలో, పట్టణాలలో, పేదల నివాస ప్రాంతాలలో సేవలందించేందుకు తరలివచ్చారు. వైద్య సేవలు అందించడమే కాదు. అక్కడ పేద ప్రజలను భాగస్వాములను చేసి ఒక ప్రజారోగ్య వ్యవస్థను సైతం వారు నిర్మింపజేశారు.
ఇది పేదలే తమకోసం తాము ఏర్పరచుకున్న ప్రజారోగ్య వ్యవస్థ. ఆ పేద ప్రజల నుండి డాక్టర్లను, వైద్య సిబ్బందిని తయారు చేయడానికి కూడా దోహద పడింది క్యూబా. తొలుత వెనిజులా విద్యార్థులు వైద్య విద్య కోసం క్యూబా వెళ్ళినప్పటికీ, ఆ తర్వాత వెనిజులాలోని ప్రత్యేక తరహా వైద్య విద్యాలయాలు స్థాపించబడినాయి. ఇంతటి ప్రజానుకూల కార్యక్రమాలను విచ్చిన్నం చేయడానికి అమెరికా ఎంతగానో ప్రయత్నించి విఫలమైంది. వీటన్నింటిని తట్టుకుంటూ క్యూబా తన అంతర్జాతీయ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ వస్తున్నది. క్యూబా సహాయంతో వెనిజులా అభివద్ధి చేసుకున్న ఈ ప్రజారోగ్య వ్యవస్థను చావేజ్ అనంతర పాలకులు సైతం నిరాటకంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ రచయిత స్టీవ్ బ్రోవర్ దీర్ఘకాలం పాటు వెనిజులాలో గడిపి తన ప్రత్యక్ష పరిశీలన ద్వారా ఎంతో సమగ్రంగా పాఠకులకు అందిస్తారు. ఒక నిజమైన ప్రజానుకూల ప్రజారోగ్య వ్యవస్థ ఎలా ఉండాలో ఈ పుస్తకం చాటి చెబుతుంది. ప్రజల పట్ల ప్రత్యేకించి పేద ప్రజానీకం పట్ల బాధ్యతాయుతమైన నిబద్ధతతో ఎలా పనిచేయాలో డాక్టర్లకు తెలియచెబుతుంది ఈ పుస్తకం. కె ఉషారాణి గారి అనువాదం బాగుంది.
కె.పి.అశోక్ కుమార్
9700000948



