సాయంత్రం 5:15 అవుతోంది. ఆఫీస్ నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్‌కి చేరుకున్నాను. ఎందుకో మనసు బాగోలేదు. కాసింత రిలాక్స్ అవుదామని వచ్చినా, అక్కడ కనిపించిన దశ్యాలు గడియారం ముళ్లలా నా ఆలోచనలను పరిగెత్తించి మరింత బరువెక్కించాయి. నాకంటే చిన్నవాళ్లు కూడా జంటలుగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు నేను ఒంటరిగా ఉండడం ఎందుకో… జీవితంలో ఒక వ్యక్తి లేకపోవడం నా హదయాన్ని తొలిచివేస్తుంది. ఒక బెంచ్ మీద కూర్చుని అలా చూస్తూ ఉండగా, దూరంగా బిర్లా మందిరం కంటపడ్డది. ఆ క్షణంలోనే అక్కడికి వెళ్లాలనిపించింది. వడివడిగా మెట్లెక్కి, ఆ ”శ్రీనివాసుడి” ముందర నిలబడి ఒక్కటే ప్రార్థన చేసుకున్నాను
”స్వామీ… తొందరగా నాకు పెళ్లి చేయి. ఈ ఒంటరి జీవితానికి ఒక తోడుని ఇవ్వు”.
ఆ మాటలు పెదవుల నుంచి జారిన క్షణంలోనే, తెలియకుండానే నా మనసు లోతుల్లో ఒక చిన్న నమ్మకం చిగురించినట్టు అనిపించింది. ట్యాంక్‌బండ్ నుంచి ఇంటికి వస్తుంటే రాజేష్ ఫోన్ చేశాడు.
”ఏరా లక్ష్మణ్… మళ్లీ ట్యాంక్‌బండ్ ఏనా?” అన్నాడు. రాజేష్ నా చిన్నప్పటి స్నేహితుడు. మా ఇద్దరి మధ్యన ఎలాంటి దాపరికాలు లేవు; అన్నీ నిర్భయంగా మాట్లాడుకునే అనుబంధం మాది.
నేను చేసే పని రికార్డ్ ట్రేసర్. రోజూ ఎన్నో ఫైల్స్ చూడటం, సంబంధిత సెక్షన్లకు పంపించడమే నా పని. ఆ రోజు ఉదయం కూడా ఆఫీస్ పనిలో మునిగిపోయి ఉన్నాను. అంతలో కమ్మని గులాబీ సువాసన తాకింది. తలెత్తి చూశాను. కుందనపు బొమ్మలా, అమాయకమైన చూపులతో ఒక అమ్మాయి నెమ్మదిగా నా వైపు వస్తోంది. కొన్ని క్షణాల పాటు నా కనులు రెప్పవేయడం మరిచిపోయాయి. ఆమె నా డెస్క్ దగ్గరకు వచ్చేసరికి గుండెదడ కొంచెం ఎక్కువైంది. చేతిలో ఫైల్, ముఖంలో ఎలాంటి ఆర్భాటం లేని చిరునవ్వు చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా ఉంది ఆమె.
నా పరధ్యానాన్ని భంగం చేస్తూ ఆమె మెల్లగా,
”సార్… ఇది ఆర్.టి సెక్షన్ కదా?” అని అడిగింది.
”అవును,” అని చెప్పాను కానీ, నా గొంతులో తెలియని తడబాటు. తన బ్యాగ్ నుండి ఒక కవర్ తీసి నాకు ఇచ్చింది. కవర్ తీసుకుంటుండగా ఆమె వేళ్లు క్షణం నా చేతిని తాకాయి. అంతే… ఆ స్పర్శ ఒక చిన్న అలలా నా మనసును తాకింది. చుట్టూ అందరూ తమ పనుల్లో మునిగిపోయారు. కానీ నా మనసు మాత్రం నా ఆధీనంలో లేదు. నిన్న బిర్లా మందిరంలో స్వామిని వేడుకున్న మాటలు గుర్తొచ్చాయి.
”ఇదేనా స్వామీ… నీ సమాధానం?” అన్న ఆలోచన నన్ను నేనే చిరునవ్వుతో నవ్వుకునేలా చేసింది.
”ఇక్కడ సైన్ చేయాలి” అని చెప్పాను.
ఆమె పేరు రాస్తూ, ”నా పేరు అనన్య,” అని మెల్లగా చెప్పింది. ఆ పేరు నా చెవుల్లో ఏదో సంగీతంలా మోగింది. ”అనన్య”… అపూర్వం.పేరు కూడా ఆమె లాగే మదువుగా ఉంది. ఫైల్‌ను రిజిస్టర్‌లో నమోదు చేసి సంబంధిత సెక్షన్‌కి పంపించాను. పని అయిపోయినట్టే. కానీ మనసులో మాత్రం ఏదో మొదలైన భావన. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో కూడా అదే ఆలోచన. ఇలాంటి చిన్న పరిచయం మనసుని ఇంత కలవరపెడుతుందా? అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను.
”మీరు కొత్తగా జాయిన్ అయ్యారా?” అని అడిగాను.
”అవును. ఈ రోజే. లీగల్ సెక్షన్‌లో,” అంది.
”ఓ.. అలాగా,” అని సాధారణంగా స్పందించినా, లోపల మాత్రం ఏదో చిన్న ఆనందం పుట్టుకొచ్చింది. ఆమె ఫైల్ తీసుకుని వెళ్లిపోతూ, ఒకసారి తిరిగి చూసి చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు వలన నాకు ఆ రోజంతా పని చేసినట్టుకూడా అనిపించలేదు. ఆ రోజు ఆఫీస్ అయిపోయాక కూడా, ఇంటికి వెళ్లినా మనసంతా అనన్య చుట్టూనే తిరిగింది. బిర్లా మందిరం మెట్లు, స్వామి విగ్రహం, నా వేడుకోలు… అన్నీ ఒకదానికొకటి కలిసిపోయాయి. తరువాతి రోజు ఉదయం ఆఫీస్‌కు కొంచెం ముందుగానే వచ్చాను. ఎందుకో తెలియదు… కానీ నా డెస్క్ వైపు వస్తూ ఆమె కనిపిస్తుందేమో అన్న ఆశ. కొద్దిసేపటికి అడుగుల శబ్దం వినిపించింది. తలెత్తి చూస్తే… అదే గులాబీ సువాసన.
”గుడ్ మోర్నింగ్, సార్,” అని ఈసారి ధైర్యంగా చెప్పింది అనన్య.
”గుడ్ మోర్నింగ్,” అని నేను కూడా ఈసారి తడబాటు లేకుండా చెప్పగలిగాను.
ఆ రోజు నుంచి చిన్న చిన్న మాటలు మొదలయ్యాయి. ఫైల్ పని పేరుతో, టీ బ్రేక్‌లో, లంచ్ టైమ్‌లో ఒకరికొకరం చూసుకొని కళ్ళతోనే మాట్లాడుకునేవాళ్లం. రోజు రోజుకి మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. డ్యూటీ అయిపోయాక కూడా రాత్రివరకు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం, సందేశాలు పంపించుకునేవాళ్లం.
ఒక సాయంత్రం ఆఫీస్ తరువాత ఆమెనే అడిగింది. మనసు ప్రశాంతం కోసం మీరు ఎక్కడికి వెళ్తారు అని. ట్యాంక్ బండ్ అని చెప్పాను.
”ట్యాంక్‌బండ్‌కు అప్పుడప్పుడూ వెళ్తుంటారా?”
నా గుండె ఒక్కసారి బలంగా దడదడలాడింది.
”అవును… నిన్ననే వెళ్లాను,” అన్నాను.
”అయితే… రేపు కలిసి వెళ్దామా?” అని అడిగింది, అదే అమాయకమైన చూపులతో.
ఆ క్షణంలో నాకు బిర్లా టెంపుల్ గంటల శబ్దం వినిపించినట్టు అనిపించింది. నేను ఏమీ మాట్లాడకుండా, కళ్లలోనే సమాధానం చెప్పినట్టు నవ్వాను. నా మనసులో మాత్రం ఇదే సమయం, అనన్యకి నా ప్రేమ విషయం చెప్పాల్సిన సమయం. ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం మెల్లగా చీకటి పడుతుంది. హుస్సేన్ సాగర్ నీటిమీద పడుతున్న వీధిలైట్ల ప్రతిబింబం అలలతో కలిసి అల్లకల్లోలంగా కదులుతోంది. చుట్టూ జంటలు నవ్వుకుంటూ నడుస్తున్నారు. ఎవరి ప్రపంచంలో వాళ్లే మునిగిపోయారు. మేమిద్దరం మాత్రం మాటలు లేకుండా పక్కపక్కనే నడుస్తున్నాం. ఆ నిశ్శబ్దం భారం కాదు… కానీ ఏదో చెప్పాలనే తొందర, గుండెలో దాచుకున్న మాటలు బయటికి రావాలనే ఆత త.కొన్ని క్షణాల తర్వాత ఆగి, ధైర్యం కూడబెట్టుకుని ఆమె వైపు చూశాను.
”అనన్య…” అన్నాను మెల్లగా.
ఆమె నా వైపు చూసింది. ఆ చూపులో ప్రశ్న ఉంది, ఆసక్తి ఉంది, కాస్త భయం కూడా ఉంది.
”నిన్ను చూసిన మొదటి రోజునుంచే నిన్ను ఇష్టపడుతున్నాను,” అన్నాను. మాటలు తడబడుతున్నాయి. ”ఇది క్షణికమైన భావం కాదు. నీతో జీవితం పంచుకోవాలని ఉంది. పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను.”
ఆ మాటలు చెప్పగానే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె సమాధానం ఏమై ఉంటుందో అన్న భయం ఒక్కసారిగా నన్ను చుట్టేసింది.
అనన్య కొద్దిసేపు ఏమీ మాట్లాడలేదు. నా వైపు కూడా చూడలేదు. ట్యాంక్‌బండ్ నీళ్ల వైపు చూస్తూ నిలబడి పోయింది.
చివరికి నెమ్మదిగా మాట్లాడింది.
”కానీ నా జీవితం అంత సులభం కాదు,” అంది. ”నాన్న లేరు. అమ్మ ఉంది. ముగ్గురు చెల్లెల్లు. వాళ్ల చదువులు, పెళ్లిళ్లు… అన్నీ నా భుజాల మీదే ఉన్నాయి. ఉద్యోగం నాకు అవసరం కాదు… బాధ్యత. ఇప్పుడే నా జీవితం గురించి నేను ఆలోచించుకునే స్థితిలో లేను.”
ఆమె క్షణం ఆగి, నన్ను చూసింది. ఆ చూపులో బాధ ఉంది, నిజాయితీ ఉంది.
”నన్ను తప్పుగా అర్థం చేసుకోకు,” అంది మెల్లగా. ”నీవు నాకు చాలా ముఖ్యమైనవాడివి. కానీ… నా కుటుంబం తర్వాతే నేను.”
ఆ మాటలు నా గుండెల్లో నిశ్శబ్దంగా దిగిపోయాయి. ప్రేమను తిరస్కరించిన మాటలు కావు అవి, జీవితం విధించిన నిజాలు మాత్రమే. మాటలేకుండా పక్కపక్కనే నడిచాం. ఆ మౌనంలోనే ఒకరికొకరం అర్థమయ్యాం.
”ఏవండీ… మీకు ఫోన్…” అంటూ నా భార్య నిఖిల లోపల్నుంచి పిలిచింది.
”ఎవరు?” అన్నాను.
”ఇంకెవరు… మీ ఫ్రెండ్ రాజేష్!”
”చెప్పురా రాజేష్…”
”ఏం లేదురా. నేను ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్తున్నాను. చెప్పుదామని కాల్ చేశాను.”
”అలానా! సరేరా. నేను వచ్చి బస్టాండ్ లో డ్రాప్ చేస్తాను.” ఉండు, నీ దగ్గరికే వస్తున్నాను.
బస్టాండ్‌కి చేరుకున్నాం. అప్పుడే రాజేష్ ఎక్కే బస్సు వచ్చింది.
”సరే గానీ… మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తావు?” అని అడిగాను.
”ఏమోరా… చెప్పలేం. కాస్త సమయం పట్టొచ్చు.”
”అదేం కుదరదు. మా మ్యారేజ్ డే కి ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నాయి. అప్పటికి నువ్వు తప్పకుండా రావాల్సిందే.”
”సరేలే రా… ట్రై చేస్తాను.”
అంతలో బస్సు కదిలింది. రాజేష్ చేతి ఊపుతూ వెళ్లిపోయాడు. కాసేపటికే డ్యూటీకి బయల్దేరాను. అనన్య గురించి నేను ఎప్పుడైనా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి రాజేష్. అతను కూడా కొన్నాళ్లు దూరమవుతుండటంతో, నా మనసులో దాచుకున్న ఆ జ్ఞాపకాలు మళ్లీ నాలోనే బంధీ అయిపోయినట్టనిపించింది.
ఆ రోజు ఆఫీసు అంతా హడావిడిగా ఉంది. జోనల్ మీటింగ్ వల్ల అనేక బ్రాంచ్‌ల వాళ్లు ఇక్కడికి వచ్చారు. ప్రతి ముఖం, ప్రతి మాట అన్నీ గందరగోళమే. ఆ గందరగోళంలోనూ నా మనసు మాత్రం ఒక్క పేరే వెతుకుతోంది… అనన్య. ఆమె గురించి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించానో నాకే తెలుసు. ఒక్కొక్కరిని అడిగాను. ఎవరో ”రిజైన్ చేసి వెళ్లిపోయింది” అన్నారు. ఇంకెవరో ”ఇప్పుడు రావడం లేదు” అన్నారు. ఎవరి మాటల్లోనూ స్పష్టత లేదు. నా మనసుకు మాత్రం ఏ సమాధానమూ సరిపోలేదు.
పన్నెండు సంవత్సరాలయ్యింది అనన్యను చూసి. ఒక్క ఫోన్ లేదు, ఒక్క సందేశం లేదు. అయినా ఆమె జ్ఞాపకం మాత్రం ఒక్క రోజూ నన్ను వదల్లేదు. ఆమె కోసం ఎంత వెతికానో నాకే తెలుసు. పాత పరిచయాలను, కామన్ ఫ్రెండ్స్‌ను, సోషల్ మీడియాలో పేర్లను వెతికాను. కానీ ఎక్కడా ఆమె జాడ దొరకలేదు. ఎందుకు నన్ను వదిలి వెళ్లిపోయిందో ఇప్పటికీ అర్థం కాలేదు. నా తప్పేమైనా ఉందా? లేక పరిస్థితులే ఆమెను దూరం చేశాయా? సమాధానం లేని ప్రశ్నగానే అది మిగిలిపోయింది.
ఇప్పుడు నాకు పెళ్లయింది. పిల్లలున్నారు. బాధ్యతలతో నిండిన జీవితం ఉంది. బయటకు చూస్తే అన్నీ సవ్యంగా ఉన్నట్టే కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం ఇంకా ఆమె గురించే ఆలోచనలు. అనన్య చివరిసారి నన్ను చూసిన ఆ క్షణం ఇప్పటికీ కళ్లముందు నిలిచే ఉంది. ఆ రోజు ఎవరో నా లోపలి ప్రాణాన్ని తీసేసినట్టుగా అనిపించింది.
తనను ఎంతగా ప్రేమించానో మాటల్లో చెప్పలేను. ఆమెనే నా భవిష్యత్తుగా, నా భార్యగా ఊహించుకున్నాను. కానీ ఒక్కసారిగా తనకు ట్రాన్స్ఫర్ వచ్చిందని ఆమె వెళ్లిపోయింది. వెళ్లిపోయింది మాత్రమే కాదు పూర్తిగా నాకు కనిపించకుండా పోయింది. నేను కాల్ చేసి మళ్లీ కలవమని చెప్పేంతవరకు కలవద్దని నాతో ప్రామిస్ చేపించుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత ఆమెను మళ్లీ ఎప్పుడూ చూడలేదు. ఫోన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా, నన్ను నా జ్ఞాపకాలతోనే ఒంటరిగా వదిలేసింది. కాలం గడుస్తోంది…జీవితం ముందుకు సాగుతోంది…కానీ నా మనసు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయింది, అనన్య నన్ను వదిలి వెళ్లిపోయిన ఆ క్షణంలోనే. ఆ రాత్రి ఇంటికి చేరేసరికి పిల్లలు నిద్రలో ఉన్నారు. ఇంట్లో నిశ్శబ్దం. నిఖిల హాలులో కూర్చొని టీవీ చూస్తోంది. నన్ను చూసి మామూలుగా నవ్వింది. ఆ నవ్వులో తప్పేమీ లేదు. బాధ్యత ఉంది, నమ్మకం ఉంది, జీవితం ఉంది. కానీ నా మనసులో మాత్రం ఆ నవ్వు దాకా చేరే శక్తి లేదు.
”ఆఫీసులో మీటింగ్ ఎలా జరిగింది?” అని అడిగింది.
”బానే ఉంది” అన్నాను. అంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోయాను.
బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పడుకున్నాను. కళ్లుమూసినా నిద్ర రాలేదు. గడియారపు టిక్‌టిక్ శబ్దం గుండె కొట్టుకునే శబ్దంతో కలిసిపోయింది. ఆ చీకటిలో, ఎక్కడినుంచో అనన్య స్వరం వినిపించినట్టుగా అనిపించింది.
”నన్ను నమ్ముతావు కదా?”
ఆమె చివరిసారి అడిగిన ప్రశ్న.
ఆ రోజు స్టేషన్‌లో ఆమె నిల్చుంది. చేతిలో చిన్న బ్యాగ్. కళ్లలో చెప్పలేని భయం.
”ఇది మనిద్దరికీ మంచిదే” అంది.
”నేనే కాల్ చేసే వరకూ నన్ను వెతకవద్దు. ప్లీజ్…”
ఆ మాట అనగానే నా గొంతు మూగబోయింది. ప్రశ్న అడిగే ధైర్యం కూడా లేకుండా తల ఊపాను. అదే ఆమె విషయంలో నేను చేసిన పెద్ద తప్పేమో ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ ఒక్కసారి అయినా ఆమె ఎందుకు అలా వెళ్లిపోయిందో తెలుసుకోవాలని ఉంది.
నన్ను కాపాడేందుకా?
లేదా తనను తాను శిక్షించుకునేందుకా?
సమాధానం తెలియని ప్రశ్నలతోనే నేను జీవిస్తున్నాను.
ఉదయం లేవగానే నిఖిల, పిల్లలతో కలిసి నా దగ్గరికి వచ్చింది. పిల్లల చేత కేక్ తయారు చేయించి, నా కోసం చిన్న సర్‌ప్రైజ్ కూడా ప్లాన్ చేసింది. ”ఈసారి పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేద్దాం” అని పిల్లల కంటే ఎక్కువ ఉత్సాహంగా చెప్పింది. ఆమె ముఖంలో కనిపించిన ఆనందం చూస్తుంటే, ఈ ఇంటి సంతోషం కోసం ఎంత నిశ్శబ్దంగా కష్టపడుతుందో అర్థమైంది. నా జీవితంలో ఎన్నో మౌనాలను ప్రశ్నించకుండా భరించి, ఈ కుటుంబాన్ని ప్రేమతో నిలబెట్టింది నిఖిలే. అంతలో ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు చూసి మనసు కాస్త ఊపిరి పీల్చుకుంది. అది రాజేష్.
”నేను వస్తున్నాను రా” అన్నాడు.
ఆ మాట విన్నాకే మనసుకి ఓ ధైర్యం వచ్చినట్టైంది. వాడు ఉంటే… నాకు తెలియని ఓ బలముంటుంది.
ఆ రోజు సాయంత్రం పార్టీ. చుట్టూ హడావిడి. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు… ఇంటంతా సందడిగా మారిపోయింది. ఏర్పాట్లలో మునిగి, సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. పార్టీని అందరూ కలిసి ఎంజారు చేశాం. నవ్వులు, మాటలు, ఫోటోలు… అలా అలా క్రమంగా రాత్రి అయింది. ఒక్కొక్కరుగా అతిథులు వెళ్లిపోవడం మొదలైంది. అందరూ వెళ్లిపోయాక, నేను రాజేష్ ఇద్దరం డాబాపైకి వెళ్లాం. చల్లని గాలి, నిశ్శబ్దమైన ఆకాశం, చేతిలో గ్లాసులు. మందు సిప్ చేస్తూ పాత జ్ఞాపకాలు, చిన్నపాటి మాటలతో సమయం గడుస్తోంది.
అంతలో రాజేష్ ఒక్కసారిగా మౌనమయ్యాడు. తర్వాత నన్ను చూసి,
”లక్ష్మణ్… నీతో ఒక విషయం చెప్పాలి,” అన్నాడు.
”ఏంటి?” అన్నట్టు అతని వైపు చూశాను.
”నేను ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లాను కదా… అక్కడ నాకు ఒక అద్భుతం జరిగింది,” అన్నాడు.
”ఏం జరిగిందో చెప్పరా… తొందరగా,” అన్నాను.
”నాకు అనన్య కనబడింది.”
”జోక్ చేయకురా… ఫస్ట్ మందు తాగు,” అన్నాను.
”లేదురా… నిజంగా చెప్తున్నాను. కావాలంటే చూడు. తనతో నేను దిగిన ఫోటో ఇది,” అన్నాడు.
ఆ స్క్రీన్ వైపు చూడటానికి నాకు ధైర్యం చాలలేదు. ఆ ఫోటోలో ఉన్న ఆమె… నిజంగా అనన్యే.
”ఇది… ఎలా సాధ్యమైంది?” అని నా గొంతు నాకు వినిపించలేదు.
నా గుండె మరింత వేగంగా కొట్టుకుంటోంది. చెమటలు పట్టాయి. ఊపిరి బరువైంది. నా టెన్షన్ చూసి రాజేష్ నా భుజంపై చేయి వేసి, ”కూల్ రా… కూల్‌గా ఉండు, ఇది… తను నీకు ఒక లెటర్‌ని ఇచ్చింది,” అన్నాడు. ఆ లెటర్ తాకిన క్షణంలోనే నా వేళ్లలో వణుకు పుట్టింది. పన్నెండేళ్ల మౌనం… లెటర్‌ని తెరవడానికి ధైర్యం రావడం లేదు. చివరికి… నెమ్మదిగా లెటర్ తెరిచాను. అందులో ఆమె చేతిరాత.
ప్రియమైన లక్ష్మణ్‌కు, ఎలా ఉన్నావు? నీ భార్య, పిల్లలు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా విషయాలు నీ దగ్గర దాచినందుకు నాపై ఏమాత్రం కోపం పెట్టుకోకపోతే చాలు. ఈ లేఖ చదువుతున్నప్పుడు ఒక్క క్షణం నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయమని మాత్రమే కోరుకుంటున్నాను.
మా నాన్నగారు చనిపోయిన తర్వాతే నాకు ఆ ఉద్యోగం వచ్చింది. నాకు ముగ్గురు చెల్లెల్లు. నాన్న చివరి శ్వాస తీసుకుంటూ, ”చెల్లెల్లను, అమ్మను చూసుకో” అని నా చేతిలో బాధ్యత పెట్టి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచే ఇంటి మొత్తం భారం నా భుజాల మీద పడింది. ఉద్యోగంలో చేరాను… బాధ్యతలు నన్ను పెద్దదాన్నిగా మార్చాయి, కానీ జీవిత ప్రయాణంలో మాత్రం అలసిపోయాను.
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పిన రోజుల్లోనే నాకు ఇంకో నిజం తెలిసింది. కొన్ని ఆరోగ్య పరీక్షల కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు, నా భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టే ఒక విషయం తెలిసింది. రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పలేమని, జీవితం నేను ఊహించిన దారిలో సాగకపోవచ్చని డాక్టర్లు చెప్పారు. ఆ క్షణంలోనే నా కలలన్నీ ఒక్కసారిగా ఆగిపోయినట్టనిపించింది. బయటకు నేను మామూలుగానే కనిపించినా, లోపల మాత్రం ఒక తెలియని భయం నన్ను నిత్యం వెంటాడసాగింది.
నిన్ను చూసిన మొదటి రోజే నా మనసులో తెలియకుండానే ప్రేమ పుట్టింది. నీవు నాతో ఎన్నోసార్లు ”నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పావు. కానీ నా ఆరోగ్య పరిస్థితి తెలిసి ప్రేమ పేరుతో నీ భవిష్యత్తును చీకటిలోకి నెట్టే హక్కు నాకు లేదనిపించింది. అందుకే నిన్ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. పరిస్థితులు నీ ప్రేమకు దగ్గరయ్యే ధైర్యాన్ని నాకు ఇవ్వలేదు. నీవు నా జీవితంలో అత్యంత ఆప్తమైన వ్యక్తివి. ”లక్ష్మణ్… నేనూ నిన్నే ప్రేమిస్తున్నాను” అని చెప్పాలని కలలు కన్నాను. కానీ కాలం నాకు అనారోగ్యపు రూపంలో ఆ అవకాశం ఇవ్వలేదు.
ఎన్నాళ్లని నా కోసమే నువ్వు ఎదురు చూస్తావు? మీ ఇంట్లో పెళ్లి ఒత్తిడి పెరిగింది. ఆ పరిస్థితుల్లో నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ పక్కన ఇంకొక అమ్మాయిని ఊహించుకోవడమే నాకు కష్టం అనిపించింది. తట్టుకోలేకపోయాను. అందుకే నీకు చెప్పకుండా ట్రాన్స్ఫర్ పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను. నన్ను కలవద్దని, ఫోన్ చేయవద్దని నీ దగ్గర మాట తీసుకున్నాను ఎందుకంటే నీ స్వరం వింటే నేను తిరిగి నీ దగ్గరకు వచ్చేసేదాన్నేమో అన్న భయం.
ఆ తర్వాత చెల్లెల్ల పెళ్లిళ్లు అయ్యాయి. అమ్మ కూడా నన్ను వదిలి వెళ్లిపోయింది. ఇన్నాళ్లు నన్ను నడిపించిన బాధ్యతలన్నీ ముగిశాక, ఒకరోజు నిశ్శబ్దంగా కూర్చుని నా జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాను. అప్పుడు నాకు తెలిసింది, కాలం ఎంతో దూరం తీసుకెళ్లినా, నా హదయంలో మాత్రం ఒక జ్ఞాపకం చెక్కుచెదరకుండా నిలిచి ఉందని. అది నువ్వు. మన మధ్య దూరం పెరిగింది, జీవితాలు వేర్వేరు దారుల్లో నడిచాయి. అయినా నా మనసు మాత్రం నీ జ్ఞాపకాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేకపోయింది.
లక్ష్మణ్… నిన్ను వదిలేశానని అనుకోకు. నీ జీవితమైనా బాగుండాలని, మరొకరిని పెళ్లి చేసుకునేలా నిన్ను పురికొల్పి, నా కళ్లారా నీ పెళ్లిని చూసి వచ్చేశాను. ఆ రోజు నా గుండె ముక్కలైనప్పటికీ, నీ ముఖంలో కనిపించిన సంతోషమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నువ్వు సంతోషంగా ఉంటే, అదే నా జీవితానికి అర్థం. కలిసి జీవించే అదష్టం మనకు దక్కకపోయినా, నిన్ను ప్రేమించిన జ్ఞాపకం మాత్రం నా చివరి శ్వాస వరకు నాతోనే ఉంటుంది.ఇప్పుడు దైవసన్నిధిలో ధ్యానం చేస్తూ రోజులను గడుపుతున్నాను. నువ్వు ఇప్పుడు ఒకరికి భర్తవు, ఇద్దరు పిల్లలకు తండ్రివి, నీ తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకువి. నీ జీవితానికి, నీ బాధ్యతలకు నేను దూరంగా ఉండటమే మంచిదని భావించాను. అందుకే ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాను. నీకు చెప్పకుండా, నీకు దూరంగా వెళ్లిపోయినందుకు నన్ను క్షమిస్తావని ఆశిస్తున్నాను. ఎక్కడ ఉన్నా… నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు చాలూ.
నీ… అనన్య.
పన్నెండు సంవత్సరాలుగా నన్ను వెంటాడిన ప్రశ్నకు సమాధానం దొరికింది. కానీ ఆ సమాధానం ఆనందాన్ని ఇవ్వలేదు. ఒక విచిత్రమైన ప్రశాంతతను మాత్రమే ఇచ్చింది. అనన్య నన్ను వదిలిపెట్టలేదు. ప్రేమించింది. అందుకే దూరమైంది. లేఖ చదవడం పూర్తయ్యేసరికి నా కళ్లలో నీళ్లు ఆగలేదు. తన ప్రేమలో స్వార్థం లేదు, తన దూరంలో కూడా బాధ్యతే ఉంది. మా ఇద్దరి మార్గాలు వేరు అయినా, ఆ ప్రేమ వ్యర్థం కాలేదు. కలిసి జీవించకపోయినా, ఒకరి జీవితాన్ని మరొకరు నిలబెట్టిన అనుబంధంగా అది మిగిలిపోయింది. ఇక నా ప్రయాణం నేను సాగాలి… నేను నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి నిఖిలను చూశాను. ఆమె నవ్వులో నమ్మకం ఉంది. నా పిల్లల కళ్లలో భవిష్యత్తు ఉంది.
అనన్య నా గతం.
నిఖిల నా వర్తమానం.
ఈ రెండింటి మధ్యే నా జీవితం.
– గాజోజి శ్రీనివాస్, 9948483560



