తల్లి ప్రేమ

తల్లి ప్రేమఅది ఒక చిట్టడవి. కీకారణ్యం కాకపోయినా అనేక జంతువులు వున్నాయి. అన్ని అడవుల్లోలాగానే సింహమే రాజు. ఆ సింహానికి తన అడవిలోని జంతువులంటే అమిత ప్రేమ. వాటన్నింటి బాగోగులు చూస్తూ, మంచి రాజనిపించుకుంది. అందుకే దానిని రాజ సింహం అందాం.
రాజ సింహానికి సరదాలు కూడా ఎక్కువే. ఎప్పుడూ అడవిలోని జంతువులనన్నింటినీ చేర్చి ఏవో ఆటలు ఆడించేది. అప్పుడప్పుడూ పోటీలు పెట్టి బహుమతులు కూడా ఇచ్చేది. ఆ విధంగా ఆ అడవిలో అంతా చాలా సరదాగా, ఎప్పుడూ ఉత్సాహంగా వుండేవాళ్ళు.
ఒకసారి రాజ సింహానికి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడూ కాలక్షేపాలన్నీ పెద్ద పిల్లలకీ, పెద్ద జంతువులకే పెడుతున్నాను. పాపం చిన్నపిల్లలకి కూడా ఒక పోటీ పెడితే బాగుంటుందని. ఆలోచన వచ్చినదే తడవు కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి తన ఆలోచన గురించి చెప్పింది. రాజ సింహం ఆలోచనకి అడ్డుపెట్టేవాళ్ళెవరు? పైగా ఆలోచన కూడా బాగుందాయే. అందుకే అందరూ రాజ సింహం ఆలోచన చాలా బాగుందని పొగిడారు.
అయితే చిన్న పాపలకి ఏ పోటీ పెట్టాలో తెలియలేదు ఎవరికీ. పసిపిల్లలకేమీ తెలియదాయే. వాళ్ళు పోటీలో ఎలా పాల్గొంటారు? చాలాసేపు చర్చించిన తర్వాత అంతా కలిసి నిశ్చయించినదేమిటంటే పసిపాపలు పోటీలో పాల్గొనలేవు కనుక వాటి తల్లి దండ్రులు తమ పిల్లలని తీసుకుని పోటీకి రావచ్చు. వచ్చినవారిలో అన్ని విధాలా అర్హులైనవారికి బెస్ట్‌ బేబీ అవార్డు ఇవ్వాలి అని.
కమిటీలో సభ్యులంతా దీనికి ఆమోదించారు. ఆ పోటీ గురించి వివరాలన్నీ ప్రకటించారు. పోటీరోజు రానే వచ్చింది. ఆ రోజు అడవంతా కళ కళలాడుతోంది. జంతువులన్నీ పోటీ చూడాలనే కుతూహలంతో సమయానికన్నా ముందే రాసాగాయి. పోటీకి వచ్చేవారంతా పేర్లు నమోదు చేసుకుంటుంటే చూడ వచ్చినవారంతా అన్నీ చూస్తూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఎలుగుబంటి తన పిల్లని తీసుకువచ్చి పేరు నమోదు చేసుకుంది. అంతా నవ్వుకున్నారు. శరీరంనిండా జుట్టే వున్న ఎలుగుబంటి పిల్ల ఎలుగుబంటికి ముద్దు రావచ్చుగానీ, వేరేవాళ్ళు దానిని అందమైనదానిగా ఎలా అంగీకరిస్తారు అని.
ఏనుగు తన పిల్లని తీసుకు వచ్చింది. నడవలేక నడుస్తున్న దానిని చూసి జంతువులన్నీ ముందే నవ్వాయి. అది చూసి ఏనుగు పిల్ల తన తల్లి కాళ్ళకి అడ్డం పడసాగింది.
అలా వచ్చే ప్రతి జంతువు పిల్లలని చూసి పోటీ చూడటానికి వచ్చినవారంతా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ, ఎవరు గెలుస్తారో ఊహిస్తున్నారు. ఇంతలో వచ్చింది ఒక కోతి తన పిల్లని తీసుకుని. ఆ పిల్లకోతి చేష్టలని చూసి అందరూ పడీపడీ నవ్వారు. ఆ కోతి తన బిడ్డే అందరికన్నా అందంగా వున్నదని నమ్మకంతో కూడిన గర్వంగా వున్నది. కానీ కోతి పిల్ల చప్పిడి ముక్కు, పెద్ద కాళ్ళు, వంటి నిండా జుట్టు, ఎర్రటి మూతి అన్నీ చూసి పగలబడి నవ్వారు అంతా. ఆ కోతికి ఎంత నమ్మకమో తన బిడ్డని పోటీకి తీసుకు వచ్చింది, ఈ జంతువుల పిల్లల ముందు అది అసలు నిలుస్తుందా అని అనుకుంటూ నవ్వసాగారు. వారి నవ్వులు చూసి కోతి పిల్ల భయంగా తల్లిని హత్తుకు పోయింది.
కానీ ఆ కోతి మాత్రం వాటి ప్రవర్తనకి కొంచెం బాధ పడ్డది. మళ్ళీ తన బిడ్డని గుండెలకి హత్తుకుని ధైర్యం తెచ్చుకుంది. ఇంతలో పోటీ నిర్వాహకులు పోటీదార్లనందరినీ పిలిచి వారి వివరాలు తీసుకోవటం మొదలు పెట్టారు. అందర్నీ వారు ఒకటే ప్రశ్న అడగసాగారు… వారి బిడ్డ పోటీ గెలుస్తుందని వారెందుకు నమ్ముతున్నారు అని. ఒక్కొక్కటీ ఒక్కొక్క కారణం చెబుతున్నాయి.
తర్వాత కోతి వంతు కూడా వచ్చింది. దానినీ అదే ప్రశ్న వేశారు నిర్వాహకులు. ఒక్కసారిగా ఏం చెప్పాలో తోచలేదు కోతికి. చుట్టూతా అందరినీ చూసింది. అంతా వారిని చూసి నవ్వుతున్నారు. అంతే! కోతికి పౌరుషం వచ్చి సమాధానం చెప్పింది. ”మన అడవిలో మనవారి మధ్య జరిగే పోటీకదాని నేను నా బిడ్డని పోటీకి తీసుకు వచ్చాను. కానీ అంతా పరాయివారిని చూసి నవ్వినట్లు నవ్వుతున్నారు. నా బిడ్డ నాకు ముద్దు. అది అందంగా వున్నా, లేకపోయినా, దానికి తెలివి తేటలు వున్నా లేకపోయినా, నా బిడ్డ నాకు ముద్దు. నా కళ్ళతో చూస్తే అది చాలా అందంగా, తెలివిగలదానిలా కనిపిస్తుంది. పోటీలో ఎవరు గెలిచినా పర్వాలేదు. ఆ బిడ్డతల్లి సంతోషిస్తుంది కదా” అన్నది.
ఈ సమాధానాలన్నీ విన్న రాజ సింహం పోటీలో పాల్గొన్నవారందరినీ పరీక్షించిన తర్వాత ఆ కోతి సమాధానానికి మెచ్చుకుని కోతి పిల్లకి బహుమతి ప్రకటించింది. కారణం తెలిసి అన్ని జంతువులూ సంతోషించాయి. నిజమే కదా… బిడ్డ ఎలా వున్నా తల్లికి ముద్దే. అదే లేకపోతే, అవకరాలతో పుట్టే పిల్లలని తల్లులు దూరంగా పెడితే ఆ పిల్లల గతేమిటని ఆలోచించటం మొదలు పెట్టాయి.
– పి.యస్‌.యమ్‌. లక్ష్మి

Spread the love