నవ్య ఆలోచన

ఒకరోజు అడవిలో కాకికి మాంసపు ముక్క దొరికింది. చెట్టుకొమ్మన కూచొని దాన్ని తింటూ ఉండగా ఆ దారిన వెళ్తున్న నక్క కాకిని చూసింది. వెంటనే నక్కకు తన పూర్వీకులకు జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది (పూర్వపు కాకి నక్క కథ). కాకులకు తెలివి ఉండదు. నా జిత్తుమారితనంతో మా పూర్వీకుల మాదిరిగానే నేను కూడా ఈ కాకి దగ్గరి మాంసపు ముక్కను చేజిక్కించుకుంటాను అనుకుంది. వెంటనే కాకి ఉన్న చెట్టు కింద ఆగి కాకితో ఇలా సంభాషించింది. ”కాకి బావ! కాకి బావ! నీ స్వరం మధురంగా ఉంటుంది. నాకొక్కసారి వినాలని ఉంది ఒకపాట పాడవా!” అని అడిగింది. కాకి పాటపాడితే నోటిలోని మాంసపు ముక్క జారిపడుతందన్న దురాలోచనతో.
అప్పుడు కాకి ఇంకా ఉన్నతంగా ఆలోచించి, ”నక్క బావ! నక్కబావ! నీమాటెందుకు కాదనాలి అలాగే పాడతాను” అని అన్నది. నోటిలోని మాంసపు ముక్క కాలివేళ్ళ సందుల్లో ఇరికించి కావుకావు మని అరిచింది కాకి. నక్క ఉపాయం ఫలించక పోవడంతో నక్క ఇలా అంది. ”కాకి బావ! నువ్వు డాన్స్‌ కూడా బాగా చేస్తావు. ఒకసారి డాన్స్‌ చేయవా” అని అడిగింది. అప్పుడు కాకి మాంసపు ముక్కను నోట్లో పెట్టుకొని ఒకకాలితో కొమ్మను పట్టుకొని చిందులు వేసింది. మళ్లీ నక్క ఉపాయం విఫలమవడంతో నక్క ఇలా అన్నది. ”కాకి బావ! నువ్వు పాట పాడుకుంటా డాన్స్‌ చేయవా చూడాలని ఉంది” అన్నది. అప్పుడు కాకి ఇంకా తెలివిగా ఆలోచించి మాంసపు ముక్క ను చెట్టుకొమ్మన దాచి నోటితో కావుకావుమని అరుస్తూ, ఒక్కకాలితో డాన్స్‌ చేసి నక్కను చిత్తుచేసింది. నక్క జిత్తుమారితనం పనిచేయకపోవడంతో నక్కవెనుదిరిగి వెళ్లిపోయింది. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని నక్క తెలుసుకుంది.
– అయిత అనిత, 8985348424

Spread the love