రెండు ముఖాల మనుషులు

ఆకాంక్షకు మనస్సంతా పుండులా ఉంది. సుత్తెలు పెట్టి గట్టిగా కొడుతున్నట్టుంది. పెద్ద కట్టింగ్‌ ప్లేరులో పెట్టి బలంగా ఒత్తేస్తున్నట్టుంది. ఎంతో దు:ఖంగా, మరెంతో కోపంగా బుసలు కొడుతున్నట్టున్నది.
ఆకాంక్ష పదో తరగతి చదువుతున్న పల్లెటూరి అమ్మాయి. తల్లి దండ్రులు వ్యవసాయం చేసుకుని, దానితో పాటు కూలీ పనులు కూడా చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళ మూడో సంతానం ఆకాంక్ష. పెద్ద పిల్లాడు వాళ్ళ ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో, కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. చిన్న కూతురు చామంతి ఆవూరి ప్రభుత్వ పాఠశాలలోనే ఐదో తరగతి చదువుకుంటున్నది. ఆకాంక్ష కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నది.
పల్లెటూరి విద్యార్థి అయినా ఆకాంక్ష ఎంతో తెలివైన అమ్మాయి. ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటూ, అర్థం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించే అమ్మాయి. ఈ మధ్య టమాటాల ధరల గురించి పత్రికల్లోనూ, సాంకేతిక మాధ్యమాల్లోనూ వస్తున్న వార్తలు ఆమెను చీకాకు పరుస్తున్నాయి. అసలు ఈ ధరలు ఎవరు పెంచుతారో, ఎవరు నిర్ణయిస్తారో తనకు అర్థం కావడం లేదు. తామూ కూరగాయలు అమ్ముతారు కానీ, వాటి రేట్లు మార్కెట్లో అప్పటికే నిర్ణయమైపోయి ఉంటాయి. అందరూ అమ్ముతున్నట్టే తమ ఊరి రైతులూ అమ్ముతారు. బేరాలు ఆడేవాళ్ళు అంతకన్నా తగ్గించే కొంటారు.
పెరిగిన టమాటాల ధరల గురించి వందలమంది వీడియోలు చేసి పెడుతున్నారని వాళ్ళ అన్న చెప్పాడు. టమాటాలు అమ్ముతున్న రైతులు కోటీశ్వరులు ఔతున్నారట. టమాటాలు కొని అందరూ పేదవాళ్ళు ఔతున్నారట. ధనవంతులు తప్ప టమాటాలు ఎవరూ కొనలేక పోతున్నారట. ఇంత అన్యాయంగా చదువుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అని ఆ అమ్మాయి విచార పడుతున్నది. వాళ్ళు వందలు వేలు ఖర్చుపెట్టి సినిమాలు చూస్తారు. వేల రూపాయలు పెట్టి మందు తాగుతారు. తమ విలాసాలకోసం చేసే ఖర్చులు తగ్గించాలని అక్కడ ఎక్కడా బేరాలాడరు. అవి ఎక్కువ ధరలుగా అనిపించవు. ఎటొచ్చీ ఇప్పుడు టమాటాలు వందో రెండువందలో కొద్ది రోజులు అయ్యే సరికి ఇలా హడావుడి చేస్తున్నారు. రైతులు ఇవే టమాటాలు రెండు రూపాయలకు కిలో అమ్మిన సంగతి, ఆ రెండు రూపాయలు కూడా రాక రోడ్లమీద పారబోసిన సంగతి ఎవరూ ఎందుకు మాట్లాడరు. ఇలా ఆ అమ్మాయి ఈ మధ్య ఆలోచిస్తూ, బాధ పడుతున్నది.
అదో చిన్న ఊరు కనుక ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొందరు జిల్లాకేంద్రం నుంచి, మరికొందరు మరో పట్టణం నుంచి వచ్చి, డ్యూటీ చేసుకుని వెళ్తుంటారు.
అలా వచ్చే ఉపాధ్యాయుల్లో ఓ ఉపాధ్యాయుడంటే ఆకాంక్షకు చాలా ఇష్టం. ఆయన పాఠాలు ఎంతో బాగా చెప్పడమే కాదు, పేద ప్రజల పట్లా, కష్ట జీవుల పట్లా ఎంతో సానుభూతిగా మాట్లాడ్తాడు. మనకన్నా బలహీనుల పట్లా, పేదల పట్లా, స్త్రీల పట్లా ఆయన ఎంతో గౌరవాభిమానాలతో ఉండాలని చెప్తుంటాడు. అలాగే ప్రవర్తించాలని పిల్లలకు చెప్తుంటాడు. ఎదుటి వాళ్ళ కష్టాల పట్ల మనకు సానుభూతి, సహానుభూతి ఉండాలని, వాళ్ళ శ్రమను గౌరవించాలని, వాళ్ళే సమాజానికి వెన్నెముకలనీ… ఇలాంటి విషయాలెన్నో చెప్తాడు. అలాంటి వాళ్ళలోంచి వచ్చిన గొప్పవాళ్ళ చరిత్రలు కథలుగా ఆసక్తికరంగా చెప్తాడు. అందుకే ఆయన అంటే పల్లెటూరి శ్రమజీవుల పిల్లలకు ఎంతో ఇష్టం. ఆకాంక్ష లాంటి పిల్లలకు ఆయనే ఓ పెద్ద ఆదర్శం, ఓ రోల్‌ మాడల్‌. అయితే, అద్దంలాంటి స్వచ్చమైన ఆ అమ్మాయి నమ్మకాన్ని ఆరోజు చూసిన ఆ సంఘటన బళ్ళున బద్దలు చేసింది.
ఆదివారాలు, సెలవురోజులూ ఆకాంక్ష కూడా తన తల్లితో కలిసి పట్టణానికి కూరగాయలు అమ్ముకోవడానికి వస్తుంది. అక్కడ ఆదివారం అంగడి జరుగుతుంది. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి రైతులు కూరగాయలు తెచ్చి సాయంత్రం వరకూ అంగడిలో కూర్చుని అమ్ముకుంటారు. వాళ్ళంతా రోడ్డుకు ఇరువైపులా కూర్చుని అమ్ముకుంటారు. మారు బేరాలు చేసుకునే వాళ్ళకు అక్కడ షెడ్‌లు ఉన్నాయి. వాళ్ళు పంటలు పండించరు, కానీ రైతుల దగ్గర టోకుగా కొని వాటిని అమ్ముకుంటారు. తోవకు అటూ ఇటూ కూర్చునే రైతులు అటు పశువులనుంచీ, ఇటు టిక్కెట్లు అంటగట్టి డబ్బులకోసం వచ్చేవాళ్ళనుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ, తమ కూరగాయలు అమ్ముకుంటుంటారు. అక్కడ కూర్చుని అమ్ముకునే కొందరు ఆడవాళ్ళ దగ్గర చిన్న పిల్లలు కూడా ఉంటారు. తమ తల్లిదండ్రులకు సహాయంగా వచ్చిన చదువుకునే పిల్లలు కూడా అక్కడ కూరగాయలు అమ్ముతూ కనిపిస్తారు.
ఈ సారి ఆదివారం తొమ్మది గంటల ప్రాంతంలో మార్కెట్‌లో ఆ సార్‌ కనబడ్డాడు. కొంత దూరంలో ఓ రైతు దగ్గర కూరగాయలు కొంటున్నాడు. అతన్ని చూసి, తాను లేచి, అమ్మా ఇప్పుడే వస్తా అని తల్లికి చెప్పి అతన్ని పలకరించడానికి అటువైపు వెళ్ళింది. అతడు మరోవైపు తిరిగి టమాటాలు బేరం చేస్తున్నాడు. ఆ రైతు చెప్పిన దానికి సగం తగ్గించి అడుగుతున్నాడు. ”మరీ ఇంత దోచుకుంటున్నారేమిటీ?” అంటున్నాడు. అక్కడ కొనకుండా పక్కనున్న మరో రైతు దగ్గరికి వెళ్ళి అక్కడా అదే బేరం, గీచి గీచి బేరాలు ఆడుతున్నాడు.
ఆకాంక్ష నిశ్శబ్దంగా అతణ్ణి వెనుకనుంచి అనుసరిస్తూ, గమనిస్తున్నది. తగ్గించి ఇచ్చిన చోట మాత్రమే అతడు కొంటున్నాడు. అలా బేరాలు చేస్తూ అతడు ఆకాంక్ష తల్లి అమ్ముతున్న దగ్గరికి వచ్చి అడిగాడు. ఆమె వంకాయలు, బీరకాయలు, పుదీనా, పచ్చిమిరపకాయల రేట్లు చెప్పింది. నిజానికి అవి చాలా తక్కువధరలోనే ఉన్నాయి. కానీ అతడు ”ఏందమ్మా, ఇంత రేట్లా?” అంటూ వాటిని బాగా తగ్గించి బేరం చేసి, తగ్గించిన వాటిని కొని ముందుకు వెళ్ళాడు. ఆకాంక్షకు అతణ్ణి పలకరించాలని అనిపించలేదు. అతడు వెనక్కితిరిగి చూడకుండా ముందున్న తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు.
”ఈ కూరగాయలు పండించడానికి వీళ్ళు పెద్దగా కష్ట పడేదేమీ ఉండదు. కానీ వాళ్ళ ఇష్టమున్నంత ధరలు చేసి అమ్ముతారు. ఔను ఈ టమాటాలను చూడ్రాదు, ఎలా పెంచి దోచుకుంటున్నారో. టమాటాలు అమ్మి కొందరు కోటీశ్వరులైయ్యారని యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్నాయి. దొంగలైతే ఇళ్ళల్లో బంగారం ఉన్నా వదిలేసి టమాటాలు ఎత్తుకుపోతున్నారట. పెళ్ళిళ్ళకు టమాటాలు కట్నం ఇవ్వలేక పెళ్ళిళ్ళు జరగడం లేదట…నవ్వుతూ చెప్పున్నాడు”
”ఏమో మన ఉద్యోగం కన్నా వీళ్ళ పనే బాగుంది. టమాటాలైతే ఊరికే పండుతాయి. మనమేమో ఎంతైనా కొనక తప్పదు కదా” అంటున్నాడు ఆ సార్‌తో ఉన్న ఆ స్నేహితుడు.
అప్పుడే వెనక్కు తిరిగి ఆకాంక్షను చూశాడు ఆ ఉపాధ్యాయుడు. ”అరె!…ఆకాంక్షా? నువ్వు ఇక్కడీ” అన్నాడు సంతోషపడుతున్నట్టు. ఆకాంక్ష ఏమీ మాట్లాడకుండా నిలబడింది. కానీ ఆ సార్‌ స్నేహితుడు ”ఈ అమ్మాయి మీ స్టూడెంటా? అందుకేనా, చాలా సేపటినుంచి మన వెంటే వస్తోంది. నిన్ను పలకరించడానికేమో” అన్నాడు.
”ఓ..ఔనా” అన్నాడు సార్‌. కానీ అతని మొహంలో ఏదో ఇబ్బంది, అపరాధ భావన. తన మాటలన్నీ ఆ అమ్మాయి విన్నదేమో…ఎలా కవర్‌ చేయాలి?
”బాగున్నావా ఆకాంక్షా? కూరగాయలు కొనడానికి వచ్చావా?” అడిగాడు కానీ, ఆ మాటల్లో తడబాటు… తనకే తెలుస్తున్నది. ఆకాంక్ష అతని మాటలకు ఏమీ జవాబు ఇవ్వకుండా తల వంచుకున్నది. ఇక అక్కడ నిలబడలేక వెనుదిరిగి తల్లిదగ్గరకు వచ్చేసింది. ఆమెకు తట్టుకోలేనంత దు:ఖం, కోపం, బాధా వంటివన్నీ కలిగాయి.
ఆ రాత్రి ఆకాంక్షకు నిద్ర పట్టలేదు. ఏమిటీ మనుషులు. సాటి మనుషుల పట్ల, రైతుల పట్ల, ఇలా ఉంటారా? బడిలో మాకు ఆసార్‌ ఎలా కనిపిస్తాడు? ఇక్కడ ఇలా ఉన్నాడేమిటీ? చాలా మంది చెడ్డవాళ్ళను తాను చూసింది. కానీ మంచిగా కనిపించే వాళ్ళు కూడా ఇలా ఉంటారా? ఛీ, ఏం మనుషులు వీళ్ళు? ఎంత చదువుకుంటే మాత్రం ఏమిటి? టమాటాలు అమ్ముకునే రైతులు కోటీశ్వరులౌతారా? మరెందుకు వీళ్ళు చదువులూ, ఉద్యోగాలూ అంటూ ఎగబడుతున్నారు?
ఆ రోజంతా ఆ ఉపాధ్యాయునికి కూడా అశాంతిగానే గడిచింది. ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకున్నాయి. ఇన్నాళ్ళూ తను తొడుక్కున్న రెండో ముఖం చినిగిపోయింది. రేపట్నుంచి ఆ పిల్లలు తన గురించి ఏమనుకుంటారో, తనమీద వాళ్ళకు ఇంతకాలం ఉన్న ప్రేమ, గౌరవం లాంటివి సర్వం ఆవిరైపోతాయి. ఆ అమ్మాయి ఈ విషయాన్ని మిగతా పిల్లలకు, పెద్దవాళ్ళకు తప్పకుండా చెప్తుంది. తను అక్కడ నిర్మించుకున్న మంచితనపు కోట బళ్ళున బద్దలైపోయింది. ఆ రాత్రి అతనికి కూడా నిద్ర సరిగా పట్టలేదు. అర్థరాత్రి దాటిన తరువాత ఆకాశంలోంచి ఎన్నో ఉల్కల్లా రాలిపడుతున్నాయి. కలత నిద్రలో కలవరపెట్టే కలలు…
ఇది జరిగిన తరువాత వారం కూడా దాటలేదు. పత్రికల్లోనూ, టీవీల్లోనూ కొన్ని విచిత్రమైన వార్తలు వచ్చాయి. ఆ ప్రాంతమంతా అట్టుడికినట్టు ఉడికి పోతున్నది. ఏ కూరగాయలైనా కొన్నప్పుడు బాగుంటున్నాయి. మొదట ఆ జిల్లాకేంద్రంలో ప్రారంభమైంది అది. మార్కెట్లో కొన్నప్పుడు ఎంతో బాగున్న కూరగాయలు వండితే విషంకన్నా చేదుగా మారిపోతున్నాయి. ఎందుకలా మారుతున్నాయో ఎవరూ చెప్పలేక పోతున్నారు. మొదట ఆ నగరంతో ప్రారంభమైన ఆ విడ్డూరం వారం పది రోజుల్లో రాష్ట్రమంతా అంటుకుపోయింది. ఎవరు ఏ కూరగాయలూ తినలేని పరిస్థితి. మరో విచిత్రం ఏమిటంటే నగరాలకు దూరంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న పల్లెల్లో మాత్రం కూరగాయలు మామూలుగానే ఉంటున్నాయి.
ఈ విచిత్రం ఏమిటో ఎవరూ చెప్పలేక పోతున్నారు. ఎన్నో సంస్థలు, ప్రభుత్వ కమిటీలు, సైంటిస్టులు ఎవరూ ఏమీ చెప్పలేక పోతున్నారు. ఇదేదైనా కొత్తగా వచ్చిన వైరస్‌ ప్రభావం కావచ్చునంటున్నారు. కొందరు విదేశాల కుట్ర అంటున్నారు. అప్పుడే పది రోజులు దాటిపోయింది. ఇప్పుడు దేశమంతా దీన్ని గురించి తీవ్రంగా పట్టించుకుంటున్నది. అనేక వీడియోలు, వార్తలు వైరల్‌ అవుతున్నాయి. రేపు దేశమంతా ఇలాగే జరిగితే ఎలా? అనే టెన్షన్‌ మొదలైంది.
నగరాలనుంచి పల్లెలకు వచ్చి, అక్కడి రైతులకు అడిగినంత డబ్బిచ్చి, అక్కడే వండించుకుని తిని వెళ్ళడం మొదలైంది. కొందరు అక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు. నగరాలనుంచి రావడం తిని పోవడం కొందరు అక్కడే ఉండిపోవడం మొదలైన మూడోరోజుకు మరో విచిత్రం జరిగింది. నగరాలవాళ్ళు అక్కడికి వచ్చి వండించుకున్నవి కూడా అలాగే చేదుగా మారడం జరుగుతున్నది. రైతులు మాత్రం ఇళ్ళలో తమకోసం వండుకుంటే అవి బాగుంటున్నాయి. వేరే చోటునుంచి వచ్చిన వారికి మాత్రం అవి విషంకన్నా చేదుగా మారుతున్నాయి.
ఇప్పుడు ఈ వార్తలు ప్రపంచమంతటా కల్లోలాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద యుద్ధం లాంటిదే ప్రకటించాయి. ఇదంతా ప్రభుత్వం చేస్తున్న కుట్ర అనీ, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అనీ, విదేశీ కుట్ర అనీ, పాపం ప్రబలిపోయిందని, దీనికి శాంతి యజ్ఞాలు చేయించాలనీ ఎవడికి ఇష్టమైంది వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏ తెగులూ, వైరస్‌లూ, బ్యాక్టీరియాలు పాడుచేయలేని కూరగాయల విత్తనాలు అంటూ కొన్ని విదేశీ కంపెనీల పేరుతో విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. అవి పనిచేయవని తేలిపోయింది.
మరికొంత కాలం అలా గడిచిపోయింది. ఇప్పుడు అందరూ బక్కచిక్కిపోయారు. మాంసాహారం తినగలిగినవాళ్ళు అలా గడిపేస్తున్నారు. కోడిగుడ్లు వంటివి తింటున్నారు. కేవలం అన్నం, ఉప్పు, కారం, తొక్కులు, రొట్టెలు వంటి వాటితో గడిచిపోతుంది. ఇవి కూడా చేదెక్కితే ఎలా అనే భయం ఒకటి అందర్నీ వణకిస్తున్నది. అనుకున్నట్టే ఆరోజు కూడా వచ్చేసింది ఏ ఆహారమైనా నోట్లో పెట్టలేని రోజు వచ్చేసింది.
మనుషులు ఎవరైనా సరే, తినడానికి నోట్లో పెట్టుకున్న ఏ ఆహారమైనా అది చేదుగా మారడమే కాకుండా, ప్రాణాంతకమైన విషంగా మారుతోంది. ప్రపంచం అల్లకల్లోలంగా మారిపోయింది. ఇక మనుషులు ఎలా బతకాలి? కొందరు అంటున్నారు… ”అసలు, మనుషులుగా బతికి ఉండే లక్షణాలు ఏమైనా ఈనాటి మనుషుల్లో మిగిలాయా?… రెండు ముఖాలు వదిలేసి, సహజమైన ఒకే మంచి ముఖాలతో ఉండే మనుషులుగా మారితేనే, నిజమైన మనుషులుగా బతికితేనే ఇంకా ఈ మానవజాతి మిగిలి ఉంటుందేమో. లేకపోతే, ఇలాగే కొనసాగితే… ఈ ప్రకృతి మనుషులకు ఇంకా ఎంతకాలం ఇలా బతికే అవకాశం ఇస్తుంది?”
తనకు ఏదో జరిగిపోతోంది… ఊపిరాడ్డం లేదు…. గుండె ఆగిపోతుందేమో…దేవుడా!…
”హలో గుడ్మార్నింగ్‌ డాడీ! లేవండి. ఏడవుతోంది, నన్ను స్కూల్‌ దగ్గర డ్రాప్‌ చేయాలి. లేవండి డాడీ!” అంటూ తనను నిద్రలేపుతున్న కూతురు పిలుపుతో కళ్ళు తెరిచి, అయోమయంగా లేచి కూచున్నాడు. వంటింట్లోంచి కూరలు ఉడుకుతున్న వాసనలు.
– డా||వి.ఆర్‌.శర్మ, 9177887749

Spread the love