స్వర్ణయుగం దిశగా అడుగు పడేనా?

ఆగస్టు 29, క్రీడా భారతావనికి పండుగ రోజు. ప్రపంచ హాకీ ఇప్పటివరకు చూసిన ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఆటగాడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా..
ప్రతి ఏడాది భారత్‌లో మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ పుట్టినరోజున జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతున్నారు. ఎన్నో రంగాల్లో భారత్‌ గత ఏడు దశాబ్దాల్లో అగ్రగామిగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో క్రీడా రంగం ఒకటి. క్రీడా రంగంలో అగ్రపథాన దూసుకెళ్లాలనే ఆశయం, బలీయమైన కోరిక ఉన్నప్పటికీ.. అందుకు అవసరమైన బలమైన సంకల్పం, ఆచరణీయ ప్రణాళికలే లేవు. మరో నెల రోజుల్లో ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు, మరో ఏడాదిలో విశ్వ క్రీడ సంరంభం ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న వేళ.. భారత క్రీడా రంగం వెలుగులోకి అడుగుపెట్టేందుకు సమాయత్తం అవుతుంది!!.
ఆయనే స్ఫూర్తి : మేజర్‌ ధ్యాన్‌చంద్‌ మారుమూల గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. ఎటువంటి వసతులు, సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల నుంచి ఎదిగాడు. చంద్రుడి వెలుగులో హాకీ స్టిక్‌తో సాధన చేసిన ధ్యాన్‌చంద్‌.. ఒలింపిక్స్‌లో భారత్‌కు హ్యాట్రిక్‌ పసిడి పతకాలు సాధించి పెట్టాడు. గ్రామీణ క్రీడాకారులు ధ్యాన్‌చంద్‌ స్ఫూర్తితో ప్రపంచ క్రీడా యవనికపై సత్తా చాటాలి. ధ్యాన్‌చంద్‌ హాకీ మాంత్రికుడిగా భారత్‌కు అద్వితీయ విజయాలు సాధించినా.. రిటైర్‌మెంట్‌ అనంతరం ఆయన జీవితం అంత సాఫీగా సాగలేదు. వీడ్కోలు అనంతరం క్రీడాకారులకు అందించాల్సిన ప్రోత్సాహకాల ప్రాముఖ్యతను సైతం ధ్యాన్‌చంద్‌ జీవితమే గుర్తు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
గ్రామీణ క్రీడలకు దన్ను : ఇటీవల కాలంలో గ్రామీణ క్రీడాకారులే అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం నందిని అగసర, జ్యోతి ఎర్రాజి, వెన్నం జ్యోతి సురేఖ, మమత, సౌమ్య గగులోతు సహా నిఖత్‌ జరీన్‌, మహ్మద్‌ హుస్సాముద్దీన్‌లు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారే. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ పట్ల గొప్ప ఆసక్తి కనిపిస్తుంది. నిఖత్‌ జరీన్‌, నందిని వంటి అథ్లెట్లు ప్రేరణగా గ్రామీణ ప్రాంతాల నుంచి మరెంతో మంది క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు ముందుకొస్తున్నారు.
అవగాహన శిబిరాలు : జాతీయ క్రీడా దినోత్సవం, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ గొప్పతనం ఆధునిక యువతకు తెలియజేసేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన శిబిరాలు నిర్వహిస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం నాడు ‘చలో మైదాన్‌’ పేరిట భారీ కార్యక్రమం రూపొందించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన క్రీడాకారులను విజయ గాథలను డాక్యుమెంటరీ రూపంలో విద్యార్థులు, యువతకు ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం నాడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ప్రపంచ హాకీలో ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా అదరగొట్టిన తీరును క్రీడా విశ్లేషకుల ప్రసంగాల ద్వారా యువతకు చేరువ చేయనున్నారు.
ప్రోత్సహిస్తే ఫలితాలు : ఆధునిక భారతంలో విద్య, వైద్యంతో పాటు క్రీడలు సైతం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మన దగ్గర వ్యవస్థీకృత క్రీడా రంగం లేదు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన క్రీడాకారులకు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు. పతకాలు సాధించి విజేతలుగా నిలిచిన తర్వాతే ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కానీ విజేతలుగా నిలిచేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు విముఖత చూపిస్తున్నారు. గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు, ప్రోత్సాహం అందిస్తే.. రానున్న ఆసియా, ఒలింపిక్‌ క్రీడల్లో భారత్‌ పతకాలు పండిస్తుంది. మరి, అందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికి సిద్ధమవుతాయో! చూడాలి.
ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం

Spread the love