నల్లమల మేలుకో

అదొక ఆకుపచ్చని అడవి. ఆ అడవిలో నివసించే పశు పక్షాదులకు, జంతుజాలానికి అక్కడ నివసించే ప్రజలకు అదొక ప్రత్యేకమైన పరిమితులు గల ప్రపంచం. అక్కడ ఎన్నో రకాల వనమూలికలు, రకరకాల గడ్డి జాతులతో కూడిన వృక్ష వైవిధ్యం వుంది. ఈనాడు ఎంతో అభివృద్ధి చెందామని తమ గతాన్ని మరచిపోయి అధికులమనుకునే వారికి ఈ నాటి ‘సమతుల్యత’ అంటే ఏమిటో తమ ఆచరణ ద్వారా జీవిస్తున్న మానవ సమూహాలు అక్కడ ఉన్నాయి.
నేటి ఆధునికం అని చెప్పుకునే పోకడలు, పాలనలు వాటి పరిమితులు దాటనంతవరకు ఆ ప్రాంతం మొత్తం మనుషులతో సహా రక్షించబడింది. ఉన్నంత వరకు ఆరోగ్యంగా, ఆనందమయ జీవితం గడిపారు. కానీ పాలనా పద్ధతులు తమ విచక్షణ కోల్పోయి అధికారాన్ని విస్తరించినప్పుడు అక్కడ నివసించే వారి హక్కులే కాకుండా అడవి సంపద కూడా తరిగిపోయింది. మానవ సమూహాలు, ప్రకృతి అవినాభావ సంబంధం కలిగి, ఒకరినొకరు కాపాడుకునే సమన్వయంతోనే అడవి రక్షింపబడుతుంది.
కానీ నేటి మితిమీరిన లాభాల వేటలో సమాజంలోని ప్రతి అంశం తన ఉనికి కోల్పోయినట్లుగానే, అక్కడున్న వృక్ష, జంతు మానవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. ఈ మితిమీరిన పరంపరలో అభివృద్ధిపేర, దేశ ప్రయోజనాల పేర నల్లమల ప్రాంతంపై అధికార దాడి జరుగుతున్నది. దానిలో భాగమే బిజెపి రాజ్యసభ సభ్యులు డా|| లక్ష్మణ్‌ గారి ప్రకటన. నల్లగొండ లోని ఒక సమావేశంలో ఈ ప్రాంతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకిగా వున్నదని, ఇక్కడున్న యురేనియం తవ్వకాలకు అడ్డు పడుతున్నదని చెప్పకనే చెప్పారు. ఇది కేవలం ఒక్కరి ఆలోచన మాత్రమే కాకుండా మొత్తం బిజెపి స్వభావాన్ని, కేంద్ర ప్రభుత్వ దుష్ట వైఖరిని తెలియజేస్తున్నది.
గత 9 సంవత్సరాలుగా దేశంలో బిజెపి మార్కు దేశ సంపదను లూటీ చేస్తున్న విధానాన్ని చూసిస్తున్నది. దేశాన్ని సుసంపన్నం చేయడానికి, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి కాకుండా, తమ పాలన నిరాటంకంగా కొనసాగటానికి పెంచిపోషించబడుతున్న వైషమ్యం, గుత్త పెట్టుబడిడారులకు ఆమ్ముకునే పాలనా విధానాలు అవలంభిస్తున్నది కేంద్ర బిజెపి ప్రభుత్వం.
అభివృద్ధి జపం చేస్తూ సహజ వనరులను, ప్రజలను కొల్లగొట్టే ప్రక్రియలు క్రమంగా కాలం చెల్లుతున్నాయి. ప్రజల్లో సమానత్వం, ప్రకృతిలో సమతుల్యం, పాలనలో పారదర్శకత, మానవ విజ్ఞానం ఆచరణలో పాటించేందుకు, వైవిద్యం, దాని పరిమితులు ఆటంక పరచకుండా, ఉన్న అవకాశాలను మెరుగుపరచి వాటి ఫలితాలు ప్రజలందరికి అందజేయడమే నిజమైన అభివృద్ధి.
అలా కాకుండా కేవలం కొంతమందికి సంపదనంతా కూడబెట్టి తాకట్టుపెట్టే సాంకేతిక, ఆర్థిక నమూనాలు అభివృద్ధి సూచికలుగా కనిపించవు. గురజాడ అప్పారావు అన్నట్టుగా దేశమంటే మట్టికాదు, దేశమంటే మనుషులు. పాడిపంటలు పొంగిపొరలే దారిలో మనం ప్రయాణించాలి. అంటే ‘నల్లమల ప్రాంతం’ అభివృద్ధి కావాలి. అక్కడున్న వృక్ష, జంతు జాలం, మానవులు రక్షించబడాలి. అక్కడున్న ప్రజలు సౌభాగ్యవంతులు కావాలి. అలా అభివృద్ధికి నోచుకోవాలంటే ఆ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు కల్పించాలి. దానికనుగుణంగా స్థానిక వనరులను అభివృద్ధి పరచి వినియోగించుకోవాలి. నల్లమల చుట్టూ పారుతున్న కృష్ణానదిని ఎత్తిపోతల ద్వారా స్థానిక చెరువులు, కుంటలు, వాగులు, వంకలను నింపాలి. అవసరమైన వనరులను అభివృద్ధి పరచాలి. ఇంకా సాగులోకి రాని భూములను సాగులోకి తేవాలి. భూమిలేని ప్రజలు భూవసతి కల్పించాలి. అటవీ హక్కులను పకడ్బంధీగా అమలుపరచాలి. పోడు భూములను పంచాలి. స్థానిక తెగలకు వారి భాషా వైవిధ్యాన్ని, మాండలికాన్ని బట్టి తగు భాషా విధానంతో కూడిన స్థానిక సంస్కృతికి తగిన చదువు కల్పించాలి.
ఈ పాటికే చదువుకున్న యువతీ యువకులకు స్థానికంగా అవసరముండే ఉద్యోగాలను సృష్టించి అవకాశాలు కల్పించాలి. తిండికి, బట్టకు దూరమవుతున్న చెంచులకు వారి అవసరాన్ని బట్టి తగిన పౌష్టికాహారాన్ని అందజేయాలి. పక్కా గృహాలను వారికి అనువైన రీతిలో ఏర్పాటు చేయాలి. పై స్థాయిలో అమలు జరుగుతున్న ప్రపంచీకరణ దృష్టితో కాకుండా స్థానిక పరిస్థితులను శాస్త్రీయంగా అర్థం చేసుకుని సమన్వయ పరిచే ప్రభుత్వ విధానాలు రావాలి. విధాన పరమైన దుందుడుకు పద్ధతులకు స్వస్థిపలికి, ప్రజలను రెచ్చగొట్టి, భంగపరిచే పాలకుల విధానాలు పోవాలి. ప్రజలతో స్నేహ పూర్వకమైన సంబంధాలు ఏర్పడి, వారి నిర్ణయాలు వారే స్వయంగా నిర్ణయించుకొని, తమ అభివృద్ధికి అనువైన పద్ధతులను తామే ఎంచుకుని సమన్వయ పరచుకునే విధంగా ప్రోత్సాహక పద్ధతులు పాటించాలి.
స్థానికంగా లభ్యమయ్యే ముడి సరుకులతో తయారయ్యే కుటీర పరిశ్రమలు ఏర్పరచి ఉపాధి అవకాశాలు కల్పించాలి. వెదురుతో బుట్టలు, వివిధ కళాకృతుల వస్తువులను తయారు చేయవచ్చు. దీనికొరకు ప్రస్తుతం ప్రజలలో వున్న కళాభిమానాన్ని సాంస్కృతిక అభిరుచులను అధ్యయనం చేసి, వాటికి తగిన కళాకృతుల రూపకల్పన రూపొందించాలి. స్థానిక తెగల జీవన పద్ధతులను శ్రద్ధగా అధ్యయనం చేస్తే వారిలో దాగివున్న జ్ఞానతృష్ణకు, కళాకృతులకు, స్థానిక వనరులకు, ప్రకృతికి హానిజరగకుండా ఏ విధంగా మలచుకుంటారో చూస్తే ముగ్దులవ్వాల్సిందే ఎవరైనా. వారిలో వున్నటువంటి సాంప్రదాయ, సాంప్రదాయేతర జ్ఞానతృష్ణను మనం బయటకు తీసి ప్రోత్సహించాలి. దీనివల్ల వారి జీవన మనుగడ కోసం తెలియని నూతన పద్ధతులను కూడా నేర్పడానికి అవకాశం వుంటుంది. ఆ విధంగా మనిషి కేంద్రంగా, స్థానిక పరిస్థితులను సమన్వయం చేసుకునే విధంగా చుట్టూ వున్న పరిసరాలను భంగపరచని పద్ధతిలో చేయవచ్చు.
నేడున్న ఉరుకుల పరుగుల అభివృద్ధి విధానాలు అన్ని చోట్ల యధాతదంగా అమలుకు చెల్లుబాటు కావు. పరిసరాలకనుగుణంగా స్థానిక అవకాశాల, పరిమితులకనుగుణమైన, నిలకడైన, సమ్మళిత పద్ధతులు అవలంభించాలి. స్థానికంగా తరచుగా అనారోగ్యానికి గురయ్యే కారకాలను గుర్తించి తగిన వైద్య పద్ధతులను ఎల్లవేళ్లలా అందుబాటులో వుంచాలి.
నల్లమల ప్రాంతం అమ్రాబాద్‌ మండలంలో 40 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరం సరిపడినంత వర్షాలు సకాలంలో పడేవి. ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండేవి. పంటలు బాగా పండేవి. మొత్తం ఆరుతడి పంటలు, చెరువుల కింద వరి పండేది. ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత తొణికిసలాడేది. మనుషులకు చేతినిండా పని, కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, ఆటలు పాటలు… ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం, మనుషుల మధ్య సోదరభావం వుండేది. ఇప్పుడు కాలుష్య వాతావరణం వలన, ఇతర సామాజిక పీడనల మూలంగా ప్రజల జీవితాలు అడుగంటి పోయాయి. స్థానికంగా చెరువులు, కుంటలు, కాలువలు ఎండిపోయాయి. స్థానికంగా వున్న దార వాగు, మానుబద్దవాగు ఇంతకు ముందు ఎప్పుడూ నీటితో కలకలలాడేవి. ఇప్పుడు నీళ్లు లేక కళావిహీనమయ్యాయి. దీని మూలంగా ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కుంటుబడి, భూములన్నీ ఎడారులుగా మారాయి. అంతేకాకుండా అడవి ప్రాంతంలో నీరు కరువు అవడంతో స్థానిక జంతు జాలానికి, వృక్ష సంపదకు నీటి సౌకర్యం లేకుండా పోయింది. ప్రజలు వలస బాట పట్టగా, జంతుజాలానికి అటవీ శాఖ తరపున నీరు అందించాల్సిన దుర్భిక్షం ఏర్పడింది.
తరతరాలుగా అక్కడున్న ప్రజలు, గిరిజనులు గిరిజనేతరులు కలిసిమెలిసి జీవనం సాగిస్తూ, అటవీ వనరులతో సమన్వయ భావంతో మెలిగారు. ఎప్పుడైతే బయటివారి జోక్యం, ప్రభుత్వాలు అవలంభించే దుందుడుకు చర్యలు, అభివృద్ధి నమూనాలు అమలు జరిపే ప్రయత్నం జరిగిందో అప్పటి నుండి అలజడి మొదలైంది. తరతరాలుగా తమ అడవిని కాపాడుకున్న ప్రజలే అడవికి పరాయివారు అయినారు. అటవీ శాఖ వారు ప్రజల కనీస అవసరాలను తీర్చుకోనీయడం లేదు. పశువులను మేపుకోవడం, వంట చెరకు, ఇతర అటవీ ఉత్పత్తులను సేకరించుకోనీడం లేదు. వేట పేరు చెప్పి ప్రజలు తమ పెంపుడు జంతువలైన కోళ్ల లాంటి వాటిని కూడా తమ ఇంటివద్ద తిననీయడం లేదు. అడవిలో వున్న ప్రజల మీద దాడి చేస్తూ ఇక్కట్ల పాలు చేస్తున్నారు.
స్థానిక ప్రజలకు, ఇతర అటవీ జంతువులకు మధ్యనున్న సంబంధాలను మెరుగుపరిచే సూచనలు, సలహాలు చేయడానికి బదులు ప్రజలను భయభ్రాంతులను చేసే పద్ధతులు అవలంభిస్తున్నారు. నీటి వసతి లేకపోవడం వల్ల అటవీ వుత్పత్తులు, పండ్లు, ఫలాలు తగ్గిపోయి వాటి మీద ఆధారపడిన జంతువులు రోడ్ల మీదికి, గ్రామాలపై పడుతున్నాయి.
ప్రభుత్వాలు తమ అనుచరులకు ఉపయోగపడే వేలకోట్ల రూపాయలు పథకాల అమలుకు పూనుకొంటూ ఈ ప్రాంతాన్ని, అక్కడున్న ప్రజలను రక్షించే బదులు రకరకాల పేర్లు చెప్పి అక్కడి ప్రజలను తరలించాలని చూస్తున్నారు.
అటవీ శాఖ ద్వారా దొంగచాటుగా ప్రజలను ఇక్కడి నుండి తరలించాలని చూస్తున్నది ప్రభుత్వం. ఇటీవల కేంద్రప్రభుత్వం అత్యంత విషాదకరమైన మణిపూర్‌ సంఘటనను చర్చించడానికి మీన మేషాలు లెక్కపెట్టిన కేంద్ర ప్రభుత్వం సందట్లో సడేమియాలాగా అటవీ సంరక్షణ పేర అడవులను, అక్కడ వుంటున్న ప్రజలను, ఖనిజ సంపదను, సహజ వనరులను నాశనం చేసే బిల్లు తన మంద బలంతో పాస్‌ చేయించుకున్నది. అదే మంద బలం గత 30 సంవత్సరాలుగా నానుతున్న మహిళా బిల్లు మాత్రం పాస్‌ చేయలేకపోతున్నది.
నల్లమల ప్రాంతంలోని అటవీ, రెవెన్యూ శాఖల వారు కూడబలుక్కుని స్థానికులు సాగుచేసుకుంటున్న భూములను తరచూ వివాదాస్పదం చేస్తున్నారు. దీనికి తగ్గట్లు ‘ధరణి’ పోర్టల్‌ తన దుష్ట పన్నాగాన్ని ప్రదర్శిస్తూనే వుంది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వివాదాలకు ప్రభుత్వ విధానాలు అవకాశం కల్పిస్తున్నాయి. వై.టి.పి. చట్టం, 5,6 వ షెడ్యూల్‌ నిబంధనలు పారదర్శకంగా కాకుండా పక్షపాత బుద్ధితో, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా మక్కికి మక్కీగా అమలుపరుస్తున్నారు. మూడు తరాలు లేక 75 సంవత్సరాలుగా అక్కడ వుంటున్న గిరిజనేతరులకు కూడా సాంప్రదాయ అటవీ హక్కులు కల్పించాల్సి వుండగా ఎవరు కూడా అటువైపు దృష్టి సారించడం లేదు. ఒకవైపు స్థానిక ప్రజలలో అనుమాన బీజాలు నాటుతూ, మొత్తంగా అటవీ ప్రాంతాన్నంతా ప్రజలకు సంబంధం లేకుండా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చాపకింద నీరులా జరుగుతున్నది. అవసరమైతే చట్టాలను మార్చి లేదా తొలగించి అటవీ భూమిని ‘అటవేతర భూమి’గా మార్చే చట్టాలు తెస్తున్నది కేంద్ర ప్రభుత్వం.
విద్యుత్‌, అభివృద్ధి, అణుబాంబుల పేరున నల్లమల అడవులలో వున్న ఖనిజ సంపదను, యురేనియంను వెలికి తీయడానికి నేటి ప్రభుత్వాలు సాహసిస్తున్నాయి. ప్రజలకు చెందని అభివృద్ధి, ఎవరి రక్షణ కోసమో ప్రభుత్వాలు ఆలోచించాలి. మానవ అవసరాలు తీర్చే ప్రత్యామ్నాయాలు అందుబాటులో వున్న వనరులకనుగుణంగా రూపొందించుకునే అవకాశాలున్నా వాటిని అవలంభించడానికి నేటి ప్రభుత్వాలు సిద్దంగా లేకపోవడం విచారకరం. ఈ అభివృద్ధి నమూనానైనా ప్రజలందరి ఉమ్మడి ప్రయోజనాలు సాధ్యమైనంత సమాన స్థాయిలో వుండే విధంగా నష్టం నివారించే విధంగా చూడాలి. తప్పదనుకుంటే నష్టాలు కనీస స్థాయికి తగ్గించే పద్ధతులను అవలంభించాలి. కానీ కేవలం కొంతమంది లాభం కోసం విశాల ప్రజల జీవించే హక్కుని హరించడం ఆమోదయోగ్యం కానేకాదు.
నల్లమల భూగర్భంలో వున్న ఖనిజాలు లేక యురేనియం వెలికి తీయడం వల్ల ఆ ప్రాంతమంతా బొందల గడ్డగా మారుతుంది. నీరు, గాలి, నేల కాలుష్యమై మనుషులు, జంతుజాలం, వృక్ష సంపద నాశనం అవుతుంది. అక్కడ నివాసముంటున్న ప్రజలమనుగడకే ప్రమాదం. కృష్ణానది, దానితో అనుసంధానమైన ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కట్లు పడతారు. అభివృద్ధి పేరు చెప్పి ఇక్కడి ప్రజలను తరలించాలని చూస్తున్నది ప్రభుత్వం. ఇక్కడున్న ప్రజలకు స్థానికంగా వున్న వనరులతో తరతరాల అనుబంధం వుంది. వాటి మంచిచెడ్డలు, ప్రస్తుతం వస్తున్న మార్పులన్నీ వారికి తెలుసు. అందువల్ల నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనుకుంటే స్థానిక వనరులతో శాస్త్రీయ పద్ధతిలో ఈ ప్రాంతానికి సరిపడే అభివృద్ధి నమూనాను తయారు చేసి అమలు పరచాలి. మద్దిమడుగు వైపు వున్న కృష్ణానది మీద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు బ్రిడ్జి నిర్మాణం చేయాలి. స్థానిక నీటి వనరులను అభివృద్ధి పరిచి పంట పొలాలకు పారించాలి.
కావున నల్లమల ప్రాంతం రక్షించబడాలంటే ఈ ప్రాంత వాసులు నిరంతరం జగరూకతతో అందరు కలిసికట్టుగా రాజకీయ పక్షపాతాలకు గురికాకుండా, చీలిపోకుండా; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులను గమనిస్తూ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక ప్రలోభాలకు గురికాకుండా ఐకమత్యంతో మెలగాల్సిన అవసరం వుంది. ఈ సమస్యతో బాధిత ప్రజలందరి మద్దతుతో నల్లమల ప్రాంతాన్ని రక్షించుకోవాలి. ప్రజలను విస్మరించే అభివృద్ధి నమూనాలను వ్యతిరేకిస్తూ, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాలను ముందుకు తీసుకురావాలి. ఎంతోమంది పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు అవలంభించిన పద్ధతులు మనకు అందుబాటులో వున్నాయి. జన విజ్ఞాన వేదిక ఎ.ఐ.పి.ఎస్‌.ఎన్‌ (ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌), కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌ లాంటి సైన్స్‌ సంస్థలు, సమగ్ర వనరుల అభివృద్ధి పథకాలు, నవీన శాస్త్ర సాంకేతిక అంశాలు, అపారమైన ప్రజానుభవాలు అందుబాటులో వున్నాయి. వాటన్నింటిని ఉపయోగించుకుని మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకోవాలి.
కొంతమంది మాట్లాడితే అభివృద్ధి, సంపద సృష్టించబడాలి అని చెప్పేవారు. అది కొంతవరకు నిజమైనా ఇంత వరకు అభివృద్ధి అయిన రంగాలు, సంపద ప్రజలందరకు కాకుండా, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా, దానితో ఏ మాత్రం సంబంధం లేని కేవలం కొంతమందికి చెందడం ఆలోచించాల్సిన విషయం.
ఈ భూమి మీద ప్రతి సామాన్య మానవునికి తన అవసరాలు తీర్చుకునే సంపద వున్నా ఇంకా ఆకలి, దారిద్రం, వనరుల లేమి, అశాంతి, ఆకలి దప్పులు, వివక్షలు, ప్రజల దైనదిత జీవితాలు బీడుబారి పోవడం జరుగుతూనే వుంది. ఇలా ఎందుకు జరుగుతున్నదీ ఆలోచించే సామాజిక విశ్లేషణలు జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా వనరులను ప్రజలకందించే సామాజిక దృక్పథం లేకపోవడమే కారణం. ఇంత తెలిసినా నేటి ప్రభుత్వాలు ఆ సంపద కేంద్రీకరణ విధానాల నుండి వైదొలగక పోతున్నాయి. ఇవి అమలు కావాలంటే విశాలమైన ప్రజా ఉద్యమాలు అవసరమౌతాయి.
మానవ జీవితం సుఖమయమవడానికి ఎదురయ్యే ప్రతి సవాళ్లను పరిష్కరించే స్థాయికి నేటి సైన్స్‌ విజ్ఞానం అభివృద్ధి చెందింది. కాని ఆ విజ్ఞానం ప్రజల దైనందిన సమస్యలను పరిష్కరించే సామాజిక రూపం దాల్చకుండా ఫ్యూడల్‌, భూస్వామ్య పెట్టుబడి సామాజిక నిర్మాణం అడ్డుపడుతున్నది. సంపదలాగే సైన్స్‌ విజ్ఞానం కూడా కొంతమంది గుత్తాదిపతుల చేతిలో బందీ అయింది. మానవ జాతిని విస్మరించే ప్రక్రియకు అభివృద్ధి అనే పేరు తగిలిస్తున్నారు. వనరులు అభివృద్ధి చెంది, సంపద సృష్టించబడి అవి ప్రజల పరమైతే కదా నిజమైన అభివృద్ధి. అలా కాకుండా వనరులు అభివృద్ధి చెంది, సంపద సృష్టించబడి, ప్రజలను వినియోగదారులుగా, బికారులుగా మార్చితే అది ప్రజాభివృద్ధి ఎలా అవుతుంది? ఆ అభివృద్ధి విస్తృతమైన ప్రజాజీవితాలను శాసించే స్థాయికి చేరి, దానికి విపరీతమైన లాభాల పోటీతత్వం తోడైతే ప్రజల జీవితాలే కాకుండా, ప్రకృతి వనరులు కూడా ధ్వంసమవుతాయి.
అందుకే ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు నూతన దృక్పథంతో తమ అబివృద్ధి పంధాలు మార్చుకోవాల్సిన అవసరం వుంది. అలా ప్రభుత్వాలు సంస్థలు, వ్యక్తులు తమ విధానాలు మార్చుకోవాలంటే విస్తృతమైన ప్రజా ఉద్యమాలు అవసరమవుతాయి. దీనికి ఇప్పుడున్న కొల్లగొట్టబడే ప్రపంచం కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ‘మరో ప్రపంచం’ సాధ్యమనే దృక్పథంతో మమేకం కావలసిన అవసరం వుంది. అది మాత్రమే ఈ భూగోళాన్ని, మానవ మనుగడను, జంతుజాలాన్ని, ప్రకృతి వనరులను సరైన మార్గంలో వుంచగలదు. అందుకే నల్లమల ప్రాంత ప్రజలు తమ ప్రాంతాన్ని రక్షించుకోవాలంటే ఈ విశాల ఐక్యవేదికలో భాగస్వాములై ఉద్యమించాల్సిన అవసరం వుంది.

డి. నరేందర్‌, 9441393922

Spread the love