ఆఫ్‌ లైన్‌

Off Line”నాన్నా.. చాలా బోరింగ్‌గా ఉంది. వేసవి సెలవుల్లో కూడా ఇక్కడేనా? తాతయ్య వాళ్ళ ఊరు వెళ్దాం నాన్న. ప్లీజ్‌.. నాన్న!” అని అర్జున్‌ వాళ్ళ నాన్న విజరును బతిమాలుతున్నాడు.
విజరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో సొంత ఊరైన కోనపల్లిని వదిలి హైటెక్‌ సిటీలో పెద్ద అపార్ట్‌మెంట్లో అద్దెకు ఉంటున్నారు. విజరుకి పని ఒత్తిడి వల్ల సొంత ఊరుకు వెళ్ళడం కుదరడం లేదు. తండ్రి రాఘవయ్య ఒక్కరే అక్కడ ఒంటరిగా ఉంటున్నారు.
విజరు పండుగకు ఊరెళ్ళినప్పుడు ”నాన్న నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏముంటావు? మాతోపాటు రా” అంటే వినేవాడు కాదు. ”ఉన్న ఊరును, బంధువులను, బలగాన్ని వదిలి నేను నగరానికి రాలేను రా” అనేవాడు తండ్రి రాఘవయ్య.
అర్జున్‌ ఎప్పటినుండో తాతయ్య దగ్గరికి వెళ్దాం అని అడుగుతుండడంతో ”సరే అర్జున్‌. ఈ వీకెండ్‌ వెళ్లి తాతయ్యని ఇక్కడికి తీసుకొద్దాం”అని కొడుకుకు సర్ది చెప్పాడు విజరు. అర్జున్‌ సంతోషంతో ఎగిరి గంతులేశాడు.
”హారు సిద్దూ.. వాట్‌ ఆర్‌ యు డూయింగ్‌” అంటూ అర్జున్‌ తన మిత్రుడుకి ట్యాబ్‌ నుండి మెసేజ్‌ చేశాడు. ”ఐయాం ఫైన్‌! వాట్స్‌ గోయింగ్‌ ఆన్‌ అర్జున్‌” అన్నాడు సిద్దు.
”రేపు తాతయ్య దగ్గరికి వెళ్తున్నాం. తాతయ్య గారు ఈ సమ్మర్‌ మొత్తం నాతోనే ఉంటారు. ఇక్కడికే తీసుకొస్తున్నాం” అని సంతోషంగా చెప్పాడు అర్జున్‌.
మరుసటి రోజు తెల్లవారుజామునే విజరు అర్జున్‌ తో పాటు కోనపల్లికి కారులో వెళ్లి తండ్రిని నగరానికి తీసుకొచ్చాడు.
రాఘవయ్యకు ఇష్టం లేకపోయినా ఈ నెలరోజులు మనవడితో గడపవచ్చు అనుకొని నగరానికి వచ్చారు. ఆరోజు నుండి అర్జున్‌ తాతయ్యతో పాటే గడిపేవాడు.
మరుసటి రోజు తాతయ్య నాలుగు గంటలకే నిద్రలేసి ”లే మనవడా.. అలా బయటికి వెళ్లొద్దాం” అన్నాడు. ”ఏంటి తాతయ్య! నిద్ర పట్టడం లేదా?” అని అడిగాడు అర్జున్‌.
”హాయిగా నిద్రపోయాను మనవడా! నువ్వు నా పక్కనే ఉన్నావు కదా! నాలుగు గంటలు దాటింది. కాసేపు అలా చల్లటి గాలికి నడిస్తే ఆరోగ్యంతో పాటూ మనసు ప్రశాంతంగా ఉంటుంది” అని చెప్పాడు. ఇష్టం లేకపోయినా తాతయ్య కోసం అర్జున్‌ నడుచుకుంటూ తాతయ్యతో బయలుదేరాడు.
నడక పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి స్నానం చేశారు. తాతయ్య మితమైన ఆహారం తీసుకోవడం చూసి ”తాతయ్యా… ఇంకొంచెం తిను” అని అన్నాడు అర్జున్‌. ”రుచికరంగా ఉందని కడుపునిండా తింటే బరువు పెరగడమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎంత మంచి ఆహారం అయినా మితంగానే భుజించాలి. అప్పుడే ఆరోగ్యం, ఆనందం” చెప్పాడు తాతయ్య.
”ఓహో! అలాగా తాతయ్య!” నేను ఎక్కువ తినడం వల్లనే కొంచెం బొద్దుగా ఉన్నాను” అని మనసులో అనుకున్నాడు అర్జున్‌.
అర్జున్‌ తన వద్ద ఉన్న ట్యాబ్‌ పట్టుకొని చూస్తున్నాడు. ”ఏంటి మనవడా! ఏముంది దాంట్లో..”
”ఏం లేదు తాతయ్య. దీంట్లో అనేక రకాల ఆటలాడుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు” చెప్పాడు అర్జున్‌.
”ఫోన్లో మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది. పద అపార్ట్‌మెంట్లో మీ ఫ్రెండ్స్‌ ఉన్నారు కదా! వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్లను నాకు పరిచయం చేయవా?” అన్నాడు తాతయ్య.
”సరే తాతయ్య.. పరిచయం చేస్తాను పద” అని టాబ్‌ పక్కకు పెట్టి అపార్ట్‌మెంట్‌ కిందికి వెళ్ళారు. చీకటి పడేంత వరకు ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకున్నాడు అర్జున్‌. ఇక్కడ ఉంటున్నాడే గానీ ఎప్పుడూ ఇలా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకోలేదు. ఆరోజు చాలా కొత్తగా, ఆనందంగా అనిపించింది అర్జున్‌కి.
రాత్రి తాతయ్య దగ్గర పడుకుని అనేక కొత్త విషయాలను నేర్చుకుంటూ.. మంచి మంచి కథలు వింటూ హాయిగా నిద్రపోయేయాడు. నెల రోజులు చూస్తుండగానే గడిచిపోయాయి.
తాతయ్య ఊరికి వెళ్ళారు. తాతయ్య వెళ్లిన తర్వాత ట్యాబ్‌ ఓపెన్‌ చేసి చూడగానే తన స్నేహితుల నుండి కొన్ని వందల మెసేజ్‌లు, కాల్స్‌ వచ్చాయి.
”ఏరా అర్జున్‌.. ఎప్పుడూ ఆన్‌లోన్‌లోనే ఉండే నువ్వు సమ్మర్‌ మొత్తం ఆఫ్‌ లైన్‌ అయిపోయావ్‌” అని అన్నాడు సిద్దు.
”అవునురా. ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు దొరకని సంతోషం ఆఫ్‌లైన్‌లో ఉంటే దొరికింది. తాతయ్యతో పాటు ప్రతిరోజు ప్రకృతి అందాలను ఆస్వాదించాను. స్నేహితులతో కలిసి ఆటలాడుకున్నాను. తాతయ్య చెప్పే ఆఫ్‌లైన్‌ కథల నుండి ఎన్నో మంచి విషయాలను, నీతులను తెలుసుకున్నాను. కథల పుస్తకాలు కూడా చదివాను. ఇకనుండి నేను ఆన్‌లైన్లో కనిపించను. ఓన్లీ ఆఫ్‌ లైన్‌ లోనే… బారు” అంటూ ట్యాబ్‌ ను తన తండ్రికి ఇచ్చాడు అర్జున్‌.
”ట్యాబ్‌ కొనివ్వమని ఏడ్చిన అర్జున్‌, తనకు తానే ట్యాబ్‌ వద్దని ఇవ్వగానే తండ్రికి చాలా సంతోషం వేసింది. వాడి ప్రవర్తనలో కూడా చాలా మార్పు వచ్చింది. పెద్దలతో మర్యాదగా మాట్లాడుతున్నాడు. పుస్తకాలు చదవడం. స్నేహితులతో కలిసి ఆటలాడుకోవడం చేస్తున్నాడు .దీనికి కారణం నాన్నే” అని తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు విజరు.
– ముక్కామల జానకీరామ్‌
6305393291

Spread the love