వెదురు పూలు

Bamboo flowersజోరుగా వర్షం కురుస్త్తోంది. మధ్యాహం పూట తను పువ్వులు పూచే ఒక మొక్క విత్తనాలు నాటుతోంది. అప్పుడే నానమ్మ గొంతు వినిపించింది
”ఒసేరు, వర్షంలో తడిసి చావాలని ఉందా?”
”లేదు నానమ్మా, నేను పూల మొక్కల విత్తనాలు నాటుతున్నాను!” సలోని పెరట్లో నుండి కేక వేసి సమాధానమిచ్చింది.
”ఓ పిల్లా, వర్షంలో నాటే విత్తనాలు వుంటాయే, కొట్టుకొని పోతాయి లేదా కుళ్లిపోతాయి”
”లేదు లే నానమ్మా, ఈ విత్తనాలు వర్షంలోనే బాగా నాటుకుంటాయి. చూడు, చూస్తుండగానే తీగ పాకి పూలతో ఈ ఇంటిని అందంగా నింపేస్తుంది” సలోని ఉత్సాహం, నానమ్మ తియ్యని మందలింపు వర్షపు ఆనందాన్ని రెట్టింపు జేసింది. అంతలోనే సలోని పెద్దమ్మ రావడంతో వారిలోని ఉత్సాహం చల్లబడింది. పెద్దమ్మ గట్టిగా పెట్టిన చీవాట్లతో వారిద్దరూ ఇంకాస్త మెత్తబడ్డారు.
”సలోని, నడూ లోపలికి, రేపు రోగంతో పడిపోతే మీ అమ్మ, నాన్నలు నన్ను దోషిగా నిలబెడతరు, తప్పుబడతరు. ఒక్క బిడ్డను చూడమని పంపిస్తే అది కూడా చాతగాక పాయే, అని నన్నే ఆడిపోసుకుంటారు” పెద్దమ్మ కటువుగానే చెప్పింది.
వర్షంలో తడిసి ముద్దయిపోయిన సలోని, పెద్దమ్మ చివాట్లు వినీ విననట్లు చేసి లోపలికెళ్ళిపోయింది. అప్పుడే నానమ్మ కిటికీ దగ్గర నిలబడి తొంగిచూస్తూ, ”ఈ విత్తనం మొక్కకు ఎప్పటికీ పూలు పూయవు. ఇది వెదురు, వెదురు తీగ” అంటూ నసుగుతోంది. పెద్దమ్మ, ముసలామె గొణుగుతున్న మాటలు కూడా విన్నది. ఆమెకు గులగటం, నసపెట్టడం అలవాటే. అలా తనలో తానూ ఏదైనా మాట్లాడుకోకుండా వుండలేదన్న సంగతి ఆమెకు తెలుసు. నానమ్మ, పెద్దమ్మ మధ్య ఎప్పుడూ ఏవో గొడవలు ఉండనే ఉంటాయి. ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకాలు. సలోని ఇవేమీ పట్టించుకోకుండా తన బాటనీ పుస్తకం తెరిచి నానమ్మ ముందు కూర్చుంది.
”నానమ్మ, తెలుసా నీకు. వెదురు కూడా పూలు పూస్తుంది. కాని, అందుకు నలభై సంవత్సరాలు ఎదురు చూడాలి”
”ఔనా బిడ్డా?, ఈ వెదురు విదేశీ మొక్కనేమో!” పెద్దమ్మ వైపు ఓ కంట చూస్తూ అంది నానమ్మ.
”కాదు నానమ్మ, ఇక్కడిదే ఈ రకం, మన దగ్గర కూడా వుంది”
ఇద్దరి మాటలు విని పెద్దమ్మ తన మనిషితనం నుండి విడివడి వెదురులోకి ప్రవేశించింది. సక్కగా, సూటిగా, గట్టిదనంతోటి, అక్కడక్కడా ముళ్ళతో కటువుగా వుండి, విప్పడానికి సాధ్యం కాని ముడులు వంటి కణుపులతో ఉంటూ వయసుతో బాటు పెరుగుతూ పోతుంది వెదురు .
నానమ్మ, మనవరాలు ఇద్దరి సంభాషణతో ఆమెకు మర్మం ఏదో అర్ధం కాసాగింది – ఈ రోజు తాను ఒక స్త్రీ గాదు, ఒక వెదురు తీగ. వెదురు కూడా పూలు పూస్తుంది. వెదురు కూడా పుష్పిస్తుంది. ఆ మాటలు వినగానే తన నలభై ఒక్క సంవత్సరాల వయసు విషయం తట్టింది. అప్పుడే ఆమెలో ఒక మెరుపు మెరిసింది. ఒక నమ్మకం పుట్టుకొచ్చి ‘వెదురు పూలు’ గా వికసించింది. ఆమెలో ఆశ అనే బీజం నాటుకుంది. ఆమెలో ఆలోచనలు మెదలసాగాయి. వెదురుతో చేసిన వేణువు కేవలం శబ్దమే కాదు, సంగీతాన్ని కూడా పలికిస్తుంది.
కానీ, నానమ్మ ఆలోచనలో అది ఇప్పుడు కూడా ఒక బంజరు భూమియే, అందులో కేవలం ముళ్ళతో నిండిన మొక్కలు మాత్రమే ఎదుగుతారు! మరేమి వికసించదు! పుష్పించదు!
(సేకరణ : సాహిత్య అకాడమి ద్వైమాసిక పత్రిక, మే – జూన్‌ :2021
సంచిక నుండి)
హిందీ కథ : బాన్స్‌ కె ఫూల్‌
రచయిత్రి : వాణి ధవే
అనువాదం : డా: రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌

Spread the love