గుణ పాఠం

కాంతమ్మ, చంద్రయ్య దంపతులు వరంగల్‌లో వుంటారు. వారికి ఒక కొడుకు. అతనికి ముద్దుగా రాజు అని పేరు పెట్టుకున్నారు. చంద్రయ్య కర్ర పని చేస్తూ ఇంటిని పోషిస్తూ ఉండేవాడు. ఐతే కొన్ని రోజులకి చంద్రయ్య అనారోగ్యంతో మరణించాడు. కాంతమ్మ చాలా రోజులు దు:ఖ పడింది. కానీ ఆ తర్వాత దైర్యంగా తన కొడుకుకి తండ్రి లేని లోటు తెలియకుండా పెంచాలని గట్టి నిర్ణయం తీసుకుంది. తను ఎలాగో చదువుకోలేదు కనుక తన కొడుకుని బాగా చదివించాలనుకుంది. దానికోసం పగలనక, రాత్రనక కష్ట పడింది. తాను తినకున్నా తన కొడుకు ఆకలి తీరుస్తూ ఉండేది. రాజు కూడా బాగా కష్టపడి చదువుకొని హైదరాబాద్‌ లో పేరున్న కంపెనీలో సాఫ్టువేర్‌ ఉద్యోగం సంపాదించి పట్నం వెళ్లాడు. అక్కడే శృతి అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. వారికి రాహుల్‌ అనే అబ్బాయి పుట్టాడు. భార్య కొడుకుతో కల్సి అప్పుడప్పుడు పండుగలకి వాళ్ళ సొంతూరికి వస్తూ ఉండేవాడు. అతని భార్యకి అలా రావడం అంతగా ఇష్టం వుండేది కాదు. కానీ కాంతమ్మ కు కొడుకు, కోడలు, మనవడు రాహుల్‌ రాకతో ఎంతో సంబర పడిపోతుండేది. రాహుల్‌కి రకరకాలపిండి వంటలు చేసిపెట్టి ప్రేమగా తినిపించేది. అతనికి వాళ్ళ నానమ్మ అంటే ఎంతో ఇష్టం, ప్రేమ.
కాల చక్రం గిర్రున తిరిగింది. ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు కాంతమ్మకు ముసలితనం వచ్చేసింది. ఇక ఈ వయసులో ఒంటరిగా ఉండలేనని తనకు తెలుస్తోంది. కాని కొడుకు కోడలితో ఇకనుంచి నేను మీతో పాటు ఉంటాను అని చెప్పాలని ఉన్న సంకోచించేది. తల్లి పరిస్థితి చూసి కొడుకుకి తీసుకుపోవాలని ఉన్న ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే శృతికి ఇది ఇష్టం లేదు. తన కొడుకుతో ఉండాలని ఎంత ఇష్టం ఉన్నా, కొడుకు కుటుంబం ఆసక్తి చూపడం లేదన్న బాధతో ఎంతో మానసిక క్షోభను అనుభవించింది. అలా కొంత కాలానికి చనిపోయింది. ఇప్పుడు రాహుల్‌ బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రుల ప్రవర్తన చూసిన రాహుల్‌, నాన్నమ్మ మరణానికి తన తల్లిదండ్రులే కారణమని గ్రహిస్తాడు. వాళ్లకి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అనుకోకుండా ఒక రోజు రాహుల్‌ కి తను పని చేసి కంపెనీ నుండి అమెరికా వెళ్లే ఆఫర్‌ వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నతో… ”నాకు అమెరికాలో మంచి జాబ్‌ వచ్చింది. ఇక నేను అక్కడే ఉంటాను” అని చెప్తాడు. అప్పుడు తల్లి ” చాలా సంతోషం బాబు… అయితే మమల్ని కూడా నీతో పాటు తీసుకువెళ్తున్నావ్‌ కదా?”
దానికి రాహుల్‌ ”మిమ్మల్నా…? అసలు కొడుకు తన అమ్మ నాన్నలని తనతో తీసుకుపోతాడా? ఈ విషయం నాకు తెలీదే?” అంటాడు రాహుల్‌ వ్యంగ్యంగా. ”చిన్నప్పటి నుంచి చూశాను…. మీరు నాన్నమ్మ ని ఒక్కసారి కూడాఎక్కడికి తీసుకపోలేదు. తనని సరిగ్గా చూసుకోలేదు. మరి నేను మిమ్మల్ని ఎలా చూసుకుంటా ననుకున్నారు? అప్పుడు మీరు చేసింది కరెక్ట్‌ అయితే ఇప్పుడు నేను చేస్తోంది కూడా కరెక్ట్‌. ఇదే అమ్మ మీ దగ్గర నుండి నేను నేర్చుకున్నది” అన్నాడు రాహుల్‌ దృఢంగా. కొడుకు మాటలకు ఇద్దరూ షాక్‌ తిన్నారు. అవును మరి… ఆవు చేను మేస్తే దూడ గట్టున మేస్తుందా! అందుకే మనం మన పెద్ద వారితో ఎలా ప్రవర్తిస్తే తర్వాత కాలంలో మన పిల్లలు మనతో అలానే వుంటారు… తస్మాత్‌…..జాగ్రత్త.

– కాశీవొజ్జల సాయి అంజన, మహబూబ్‌నగర్‌

Spread the love